న్యూఢిల్లీ : ఈ సంవత్సరాంతానికి ఆశావహ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. రక్షణ, భద్రత, కీలక టెక్నాలజీ రంగాల్లో భారత్, ఇయు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు ఉభయ నేతలు ప్రతిజ్ఞ చేశారు. వాన్ డెర్ లెయెన్‌తో చర్చల అనంతరం మీడియా ప్రకటన విడుదల చేసిన ప్రధాని మోడీ భారత్, ఇయు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ‘సహజమైనది, సేంద్రీయమైనది’గా, ప్రజాస్వామ్య విలువల్లో ‘విశ్వాసం’పై, ఉమ్మడి భావనపై ఆధారపడినదిగా అభివర్ణించారు.
ఈ సంవత్సరాంతానికి పరస్పర ప్రయోజనకర ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవలసిందిగా తమ బృందాలను ఆదేశించామని ఆయన తెలియజేశారు. వాణిజ్యం, టారిఫ్‌లపై ట్రంప్ ప్రభుత్వ విధానంపై ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో తీసుకున్న గణనీయమైన నిర్ణయం ఇది. పెట్టుబడుల పరిరక్షణ ఒప్పందం, భౌగోళిక సూచిక (జిఐ)లపై ఒప్పందం కోసం సంప్రదింపులపై ముందుకు సాగేందుకు ఉభయ పక్షాలు చూస్తున్నాయని ప్రధాని తెలిపారు. అనుసంధానతను మోడీ ప్రస్తావిస్తూ, భారత, మధ్య ప్రాచ్య యూరప్ ఆర్థిక కారిడార్ (ఐఎంఇఇసి)ని ముందుకు తీసుకువెళ్లేందుకు పటిష్ఠ చర్యలు తీసుకోనున్నట్లు తెలియజేశారు.
‘ప్రపంచ వాణిజ్యం, సుస్థిర వృద్ధి, సంపద రంగాల్లో సాగేందుకు ఐఎంఇఇసి కారిడార్ దోహదకారి కాగలదని తాను విశ్వసిస్తున్నట్లు మోడీ తెలిపారు. వాన్ డెర్ లెయెన్, ఇతర కమిషనర్ల బృందం భారత పర్యటన ‘కని విని ఎరగనటువంటిది’ అని ప్రధాని పేర్కొన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రత, సుస్థిరత, సంపద ప్రాముఖ్యంపై భారత్, ఇయు అంగీకరించినట్లు మోడీ వెల్లడించారు. భారత్, ఇయు భాగస్వామ్యాన్ని పెంచేందుకు, వేగిరపరచేందుకు అనేక నిర్ణయాలు తీసుకున్నట్లు మోడీ తెలియజేశారు. భారత్‌తో తమ అనుబంధాన్ని కొత్త పుంతలు తొక్కించాలని ఇయు కోరుకుంటున్నట్లు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు లెయెన్ తెలిపారు.