Sunday, November 24, 2024

అచ్ఛేదిన్ అంటే ఉచిత బియ్యమేనా?

- Advertisement -
- Advertisement -

ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ పథకాన్ని మరో ఐదు సంవత్సరాలు పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ చత్తీస్‌గఢ్ ఎన్నికల సభలో ప్రకటించారు. గతేడాది జరిగిన రాష్ట్రాల ఎన్నికలపుడు ప్రకటించి ఏడాది పొడిగింపు డిసెంబరు వరకు వుంది. కానీ మోడీ కోయిల ముందే కూసింది అంటే ఇప్పుడు జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నిక గానమే!వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలు కూడా ఎంతో దూరం లేనందున అప్పుడు కూడా దీని గురించి ఊదరగొడతారని వేరే చెప్పనవసరం లేదు. ఈ పథకం ఖజానా మీద మరింత భారం మోపుతుందని కొందరు అంటున్నారు. కొత్తగా పడేదేమీ లేదన్నది మరొక వాదన. ఏదిఏమైనా పేదలకు మేలు చేస్తుంది. ఉచిత పథకాల వలన రాష్ట్రాలు దివాలా తీస్తాయని నరేంద్ర మోడీ కర్నాటక ఎన్నికల సందర్భంగా చెప్పారు. ఉచిత ఆహార భారాన్ని భరిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇబ్బందుల్లో పడదా? చెప్పే మాటలకు చేతలకు పొంతన లేదంటే ఎక్కడో తేడా కొడుతోందని మోడీ గ్రహించారనుకోవాలి. పౌరులు గౌరవప్రదమైన, ఆరోగ్యకర జీవనం గడపాలంటే తగినంత ఆహారం, పోషకాలు అవసరం.

వాటిని హక్కుగా పరిగణిస్తూ 2013 జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా గ్రామాలలో 75%, పట్టణాలలో 50% మంది అర్హులని పేర్కొన్నారు. కొత్తగా నరేంద్ర మోడీ సర్కార్ దేశంలో ఎక్కడైనా రేషన్ పొందేందుకు వీలుగా కార్డులు జారీ చేస్తామని ప్రకటించింది. బహుశా దేశభద్రతకు సంబంధించిన రహస్యంగా భావించి లేదా పరువు పోతుందని సిగ్గుపడిగానీ ఉచిత పథకాన్ని పొడిగించడానికి కారణం ఏమిటో ప్రధాని చెప్పలేదు అనుకోవాలి. ఒకవైపు ఆహార భద్రతకు తూట్లు పొడిచేందుకు మోడీ మంత్రాంగంలో భాగమైన నీతిఆయోగ్ చూస్తుంటే మరోవైపు ఓట్లకోసం పడుతున్న పాట్లు ! అల్లుడికి బుద్ధి చెప్పిన మామ అదే తప్పు చేసినట్లు! మోడీ కేంద్రంలో అధికారానికి వచ్చినపుడు ఆకలి సూచికలో దేశం 120కిగాను 99వ స్థానంలో ఉంది. అది 2022లో 121 దేశాల్లో 107కు, 2023లో 125దేశాల్లో 111కు దిగజారింది.
కరోనా కాలం నుంచి 80 కోట్ల మందికి ఉచితంగా ఆహారధాన్యాలు ఇస్తున్నట్లు, రెండు లక్షల కోట్ల రూపాయలను అందుకు ఖర్చు చేస్తున్నట్లు బిజెపి పెద్దలు విజయగాథలను గానం చేస్తుంటారు. వారి జేబుల్లోంచి తీసి ఖర్చు చేయడం లేదు. దేశంలో ఆకలి ఇవాళ కొత్తగా ప్రారంభం కాలేదు. యుపిఎ పాలనకు ముందు అధికారంలో ఉన్న బిజెపి వాజ్‌పేయీ సర్కార్ ఆహార భద్రతా పథకం గురించి ఎలాంటి ఆలోచనా చేయలేదు. సిఎంగా ఉన్న నరేంద్ర మోడీ ఎన్నడూ అలాంటి ప్రతిపాదన కూడా చేసినట్లు తెలియదు. ఇక 80 కోట్ల సంఖ్య ఎలా వచ్చిందంటే గ్రామాల్లో 75%, పట్టణాల్లో 50% లెక్కన 67% మందికి ఆహార భద్రత కల్పించాలని 2013 చట్ట చెప్పింది.

అప్పటికి ఉన్న జనాభా 122 కోట్లు వారిలో 67% అంటే 81.74 కోట్లు. ఇప్పుడు 142 కోట్లకు చేరింది, అంటే ఇవ్వాల్సింది 95.14 కోట్ల మందికి. పదిహేను కోట్ల మందికి మొండిచేయి చూపుతున్నారు. మరోవైపు ఆరోగ్య సూచికలేవీ మెరుగుపడిన దాఖలా లేదు. అందువలన ఆహార భద్రత, పోషకాహార పథకాలను సవరిస్తే తప్ప దీనివలన ఎలాంటి ప్రయోజనం లేదని అనేక మంది చెబుతున్నారు. అది వాస్తవం కాదని చెప్పేందుకు ప్రభుత్వం ఎలాంటి సర్వేలను నిర్వహించలేదు. దేశంలో ఆహార సబ్సిడీ కేటాయింపులు తగ్గుతున్నాయి. 202021లో కేంద్ర ప్రభుత్వం రూ. 5.41లక్షల కోట్లు ఖర్చు చేసింది. (2016 నుంచి ఎఫ్‌సిఐ తీసుకున్న అప్పులను ఒక్కసారే కేంద్ర ప్రభుత్వం తీర్చిన కారణంగా ఒక ఏడాదిలో ఇంతగా పెరిగింది) 202122లో వాస్తవ ఖర్చు రూ. 3,06,571 కోట్లు, 202223లో సవరించిన అంచనా రు.2,96,523, 2023 24లో ప్రతిపాదించిన మొత్తం రూ. 2,05,765 కోట్లు. యుపిఎ చివరి సంవత్సరం నుంచి నరేంద్ర మోడీ తొలి ఆరు సంవత్సరాలలో ఆహార సబ్సిడీ మొత్తం లక్ష కోట్లకు అటూ ఇటూగా ఉంది.

కరోనా లేకున్నా ఇప్పుడు కొనసాగిస్తున్న ఆహార ధాన్యాల ఉచిత పథకం గురించి అంతకు ముందు మోడీకి ఎందుకు తట్టలేదు. తన ఏలుబడిలో పరిస్థితి ఆకస్మికంగా దిగజారిందా? గతంలో ఏ ప్రభుత్వం చేయలేనంతగా దేశ జిడిపిని పెంచినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. కాసేపు అంగీకరిద్దాం, దానికి అనుగుణంగా ఆహార సబ్సిడీ పెంచకపోగా తగ్గించారు.
2014 15లో ఆహార సబ్సిడీ కేటాయింపు జిడిపిలో 0.9%, తరువాత 201920 నాటికి 0.5 శాతానికి కోతపెట్టారు. కరోనా కాలంలో పాత బకాయిల చెల్లింపుతో 2.7 శాతానికి పెరిగింది, క్రమంగా దిగజార్చుతూ 2023 24లో దాన్ని 0.7 శాతానికి తగ్గించారు. ఇదేదో ఏదో అలా జరిగిపోయిందని చెప్పినట్లుగా సంభవించింది కాదు. పౌర పంపిణీ వ్యవస్థ (పిడిఎస్)ను ప్రైవేటీకరించాలని, ఉచిత ఆహార లబ్ధిదారులను, సబ్సిడీలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నీతిఆయోగ్ చేసిన సూచనలు తెలిసిందే. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ వేసిన బాటలో నడుస్తున్న రాజు కనుసన్నలలోనే సిబ్బంది పనిచేస్తారు.ఆహార సబ్సిడీ అనేది అటు రైతాంగానికి ఇటు వినియోగదారులకు ఇచ్చేది. ఎఫ్‌సిఐ లేదా రాష్ర్ట ప్రభుత్వ సంస్థలు పంటలను మద్దతు ధరలకు కొనుగోలు చేసి ప్రభుత్వ విధానాల మేరకు వినియోగదారులకు అందచేస్తాయి.

వాటిలో ధరకు విక్రయించేవి, ఉచితంగా అందచేసేవీ ఉంటాయి. ఈ లావాదేవీల్లో వచ్చే తేడా మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నది. గతంలో ఆయా రాష్ట్రాలలో ఉన్న దారిద్య్రాన్ని బట్టి ఏ రాష్ట్రానికి ఎంత ఆహారం కేటాయించేదీ నిర్ణయించేవారు. 2017 18 నుంచి దారిద్య్ర సర్వే, కొత్త కార్డులు ఇవ్వడం నిలిపివేశారు. రాష్ట్రాలు జారీ చేస్తే అందుకయ్యే ఖర్చును అవే భరించాల్సి ఉంటుంది. ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి ఎవరు ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చని ఒకే కార్డు పద్దతిని ముందుకు తెచ్చారు. మన దేశంలో దారిద్య్రరేఖ నిర్వచనంలో అనేక లోపాలు ఉన్నాయి. ఒక నిర్దిష్టత లేని కారణంగా ఎవరికి తోచిన అంచనాను ఆయా కమిటీలు ఇచ్చాయి. ప్రపంచ బ్యాంకు అంతర్జాతీయ దారిద్య్ర రేఖను రూపొందించింది. దాని ప్రకారం 2011లో రోజుకు 1.90 డాలర్ల కంటే తక్కువ ఆదాయం వచ్చే వారు దారిద్య్ర రేఖకు దిగువన (దుర్భరదారిద్య్రంలో) వున్నట్లు. దాన్ని 2017 ధరల ప్రకారం 2022 సెప్టెంబరులో 2.15 డాలర్లకు పెంచింది. ప్రస్తుతం డాలరుకు 83 రూపాయలు వుంది.కనుక నెలకు రూ. 5,353 కంటే తక్కువ ఆదాయం వచ్చినవారు దుర్భర దారిద్య్రంలో వున్నట్లు. కానీ మన ప్రభుత్వం పట్టణాల్లో నెలకు రూ. 1,260, గ్రామాల్లో రూ. 1,059గా గీత గీసింది.

ఎందుకంటే ఏ దేశానికి ఆ దేశం తన రేఖను నిర్ణయించుకోవచ్చు. వాటిని చూపి దారిద్య్రాన్ని తగ్గించినట్లు చెప్పుకోవచ్చు. ప్రపంచ ఆకలి సూచికను తయారు చేస్తున్నవారు పిల్లల్లో గిడసబారుతనం, ఎత్తుకు తగిన బరువు లేకపోవటం, బరువు తక్కువగా పుట్టడం, పసిప్రాయ మరణాలు, తగినన్ని కాలరీల శక్తిని తీసుకోకపోవటాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. పిల్లల్లో ఈ లోపాలు ఉన్నాయంటే తలిదండ్రులకు తగిన రాబడి లేకపోవడం తప్ప వేరు కాదు. 2019 నుంచి 2021 మధ్య జరిపిన ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడైన వివరాల ప్రకారం ఐదేండ్ల లోపు పిల్లల్లో 35.5% మంది గిడసబారినవారు, 19.3% ఎత్తుకు తగిన బరువు లేమి, 32.1% మంది ఉండాల్సిన దాని కంటే తక్కువ బరువుతో ఉన్నట్లు తేలింది. అచ్ఛేదిన్ అని చెప్పి అధికారానికి వచ్చిన వారి ఏలుబడిలో గురజాడ చెప్పినట్లు భావిభారత పౌరులు ఈసురోమంటున్నారు.
పోషణ అభియాన్ పేరుతో బడుల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. దాని లక్ష్యం ఏమిటి అంటే ఆరు సంవత్సరాలలోపు ఉన్న పిల్లల్లో 38.4 శాతంగా ఉన్న గిడసబారుతనాన్ని 2016 నుంచి 2022 నాటికి ఏటా 2% చొప్పున 25 శాతానికి తగ్గింపు, పూర్తిగా పోగొట్టాలంటే మరో పదమూడు సంవత్సరాలు పడుతుంది.

ఇదే విధంగా పోషకాహార లేమి, తక్కువ బరువుతో పుట్టే పిల్లల తగ్గింపు కూడా ఏటా 2% అని, రక్తహీనతను 3% చొప్పున తగ్గిస్తామని పేర్కొన్నారు. రక్త హీనత అనేక అనర్థాలకు హేతువుగా ఉంది. రక్తహీనత ముక్త భారత్ పేరుతో కేంద్ర ప్రభుత్వం 2018లో కొన్ని పథకాలను ప్రారంభించింది. ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019 20 ప్రకారం దేశంలో 1549 సంవత్సరాల వయసు వున్న మహిళల్లో 50% మంది, ఆరు నెలల నుంచి ఆరేండ్ల లోపు పిల్లల్లో 59% మంది రక్తహీనతతో ఉన్నారు. ఏటా 3 % చొప్పున 2018 నుంచి 2022లోపు దాన్ని తగ్గిస్తామని చెప్పారు. ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. సర్వేకు ఎంపిక చేసిన ప్రశ్నావళి నుంచి రక్తహీనత అంశాన్ని తొలగించారు. అంటే వాస్తవ పరిస్థితి తెలవకుండా పాతరేసేందుకు పూనుకున్నారు. ఐదులక్షల కోట్ల డాలర్ల ఆర్ధిక వ్యవస్థ గురించి కలలు కంటున్నా, ప్రపంచంలో ఐదవ స్థానానికి జిడిపిని వృద్ధి చేశామని చెప్పినా ప్రయోజనం ఏమిటన్నది ప్రశ్న. జనాలకు ఒక్క బియ్యమో, గోధుమలో ఉచితంగా ఇస్తే సమగ్ర పోషకాహారం లభిస్తుందా? మిగతా వాటి సంగతేమిటి? వాటికి కావాల్సిన ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వ విధానాలేమిటి?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News