బెల్జియంతో భారత్ ఢీ
నేడు హాకీ సెమీస్ సమరం
టోక్యో: ఒలింపిక్ పతకానికి భారత పురుషుల హాకీ జట్టు ఒక విజయం దూరంలో నిలిచింది. మంగళవారం జరిగే సెమీఫైనల్లో భారత్ వరల్డ్ చాంపియన్ బెల్జియంతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు రజతం ఖాయమవుతోంది. ఇక వరుస విజయాలతో జోరుమీదున్న మన్‌ప్రీత్ సింగ్ సేన సెమీస్‌లోనూ అదే జోరును కనబరచాలనే పట్టుదలతో ఉంది. లీగ్ దశలో దుమ్మురేపిన భారత్ నాకౌట్ సమరంలోనూ ఆకాశమే హద్దుగా చెలరేగి పోతోంది. క్వార్టర్ ఫైనల్ సమరంలో బలమైన బ్రిటన్‌ను చిత్తుగా ఓడించిన భారత్ సెమీస్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. బెల్జియంను ఓడించడం ద్వారా ఫైనల్‌కు దూసుకెళ్లాలని తహతహలాడుతోంది. సమష్టి పోరాటంతో చిరస్మరణీయ విజయాలు సాధిస్తున్న భారత హాకీ టీమ్ మరో విజయం సాధిస్తే దశాబ్దాల నిరీక్షణకు తెరపడుతుంది.
ఒకప్పుడు ఒలింపిక్స్‌లో రారాజుగా వెలుగొందిన భారత్ ఆ తర్వాత వైభవాన్ని కోల్పోయింది. ఒక దశలో కనీసం ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేక పోయింది. ఇలాంటి స్థితి నుంచి ప్రస్తుతం భారత్ పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తోంది. మెరికల్లాంటి ఆటగాళ్ల కలయికతో సంచలన విజయాలు సాధిస్తోంది. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో తనకంటే ఎంతో మెరుగైన స్థానంలో ఉన్న జట్లను సయితం అలవోకగా ఓడించి సెమీస్‌కు చేరుకుంది. ఇక బెల్జియంతో జరిగే సెమీస్‌లోనూ గెలిచి స్వర్ణం పోరుకు అర్హత సాధించాలని తహతహలాడుతోంది. భారత్ ఆటను గమనిస్తే బెల్జియంను ఓడించి టైటిల్ వేటకు చేరడం ఖాయంగా కనిపిస్తోంది. మంగళవారం ఉదయం జరిగే ఈ మ్యాచ్‌లో కోట్లాది మంది భారత అభిమానులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.