నిరుద్యోగతపై రాహుల్ గాంధీ ఆవేదన
కొల్లం(కేరళ): భారతదేశం గడచిన 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత అత్యధిక నిరుద్యోగతను ఎదుర్కొంటోందని, యువత భవితను బలోపేతం చేసి వారిలో సానుకూల దృక్పథాన్ని తీసుకురావడమే కాంగ్రెస్ పార్టీ కర్తవ్యమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. తన భారత్ జోడో యాత్రలో భాగంగా తొమ్మిదవ రోజున కేరళలోని కొల్లం జిల్లాకు చెందిన నీండాకర చేరుకుంది. తన పాదయాత్రలో అత్యధికంగా యువజనులతో భేటీ అవుతున్నానని, ప్రభుత్వం నుంచి వారు ఏమి ఆశిస్తున్నారో తెలుసుకుంటున్నానని తన ఫేస్‌బుక్ పేజీలో రాహుల్ పేర్కొన్నారు. యువ శక్తిని దేశం ఉపయోగించుకుంటే అది మరింత వేగంగా పురోభివృద్ధి సాధించగలదని ఆయన అన్నారు. అయితే నుడు దేశంలో నిరుద్యోగ శాతం గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత అధికంగా ఉందని, చదువుకున్న యువజనులు ఉద్యోగాల అన్వేషణలో నిరాశానిస్పృహలకు లోనవుతున్నారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం పాదయాత్ర ముగిసిన తర్వాత రాహుల్ జీడి కార్మికులు, పారిశ్రామికవేత్తలు, కార్మిక సంఘాలు, ఆర్‌ఎస్‌పి, ఫార్వార్డ్ బ్లాక్ తదితర కాంగ్రెస్ మిత్రపక్షాలతో చర్చలు జరిపారు.