టీమిండియాను వెంటాడుతున్న బ్యాటింగ్ వైఫల్యం
తీరు మారకపోతే ఇబ్బందులు ఖాయం!
ప్రపంచ క్రికెట్‌లోనే అత్యంత బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన జట్టుగా పేరున్న టీమిండియా సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్‌లో మాత్రం పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశ పరుస్తోంది. ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో భారత్ ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే ప్రధాన కారణంగా చెప్పొచ్చు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ టీమిండియా తక్కువ స్కోరుకే ఆలౌటైంది. మొదటి ఇన్నింగ్స్‌లో అయితే కేవలం 109 పరుగులకే పరిమితమైంది.
కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు శుభ్‌మన్ గిల్, చటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, శ్రీకర్ భరత్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ వంటి స్టార్ బ్యాటర్లు ఉన్నా భారత్ తక్కువ స్కోరుకే ఆలౌట్ కావడం గమనార్హం. తొలి టెస్టులో సెంచరీతో అదరగొట్టిన కెప్టెన్ రోహిత్ శర్మ ఆ తర్వాత విఫలమయ్యాడు. రోహిత్ వైఫల్యం జట్టును వెంటాడుతోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన రోహిత్ మూడో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలో కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు.
ఇక రాహుల్ స్థానంలో మూడో టెస్టులో జట్టులోకి వచ్చిన యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశ పరిచాడు. ఇండోర్ టెస్టులో గిల్ రెండు ఇన్నింగ్స్‌లలో కూడా విఫలమయ్యాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అసాధారణ బ్యాటింగ్‌తో అలరించిన గిల్ టెస్టుల్లో మాత్రం ఆ స్థాయి ఆటను కనబరచలేక పోతున్నాడు. జట్టు ఎన్నో ఆశలు పెట్టుకున్నా గిల్ మాత్రం పేలవమైన బ్యాటింగ్‌తో తేలిపోయాడు. కనీసం రానున్న చివరి మ్యాచ్‌లోనైనా రోహిత్‌తో పాటు గిల్ మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. వీరిద్దరూ శుభారంభం అందిస్తేనే తర్వాత వచ్చే బ్యాటర్లు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడే అవకాశం కలుగుతోంది. మరోవైపు సీనియర్ ఆటగాళ్లు పుజారా, విరాట్ కోహ్లి కూడా పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశ పరుస్తున్నారు.
పుజారా మూడో టెస్టు చివరి ఇన్నింగ్స్‌లో మాత్రమే కాస్త మెరుగ్గా ఆడాడు. మిగతా ఇన్నింగ్స్‌లలో విఫలమయ్యాడు. ఆఖరి మ్యాచ్‌లో జట్టు పుజారాపై భారీ ఆశలు పెట్టుకుంది. అతను ఎలా రాణిస్తాడో వేచి చూడాల్సిందే. విరాట్ కోహ్లిని కూడా వరుస వైఫల్యాలు వెంటాడుతున్నాయి. ఇప్పటి వరకు కోహ్లి ఒక్క మ్యాచ్‌లో కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేక పోయాడు. ఇది జట్టును ఇబ్బందులకు గురిచేస్తోంది. ఒకప్పుడూ టెస్టుల్లో వరుస సెంచరీలతో పెను ప్రకంపనలు సృష్టించిన కోహ్లి ఇటీవల కాలంలో వరుసగా విఫలమవుతున్నాడు.
కీలకమైన అహ్మదాబాద్ మ్యాచ్‌లో మాత్రం మెరుగ్గా ఆడాలనే పట్టుదలతో ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ కూడా అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక పోయాడు. మిగిలిన మ్యాచ్‌లో అతనికి ఛాన్స్ ఇస్తారా లేదా అనేది సందేహంగా మారింది. శ్రీకర్ భరత్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అశ్విన్‌లు మాత్రం కాస్త బాగానే బ్యాటింగ్ చేస్తున్నారు. అయితే వీరి నుంచి మరింత మెరుగైన బ్యాటింగ్‌ను జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. ఇందులో వీరు ఎంతవరకు సఫలం అవుతారనే దానిపైనే చివరి టెస్టులో టీమిండియా గెలుపోటములు ఆధారపడి ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.