చెన్నై: ఆతిథ్య టీమిండియా ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌ను ఆదివారం ఆస్ట్రేలియాతో ఆడనుంది. చెన్నై వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఆరంభ మ్యాచ్‌లో గెలిచి టోర్నీకి శ్రీకారం చుట్టాలనే పట్టుదలతో ఇరు జట్లు ఉన్నాయి. రెండు జట్లను కూడా గాయాల సమస్య వెంటాడుతోంది. శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యలు గాయాలతో సతమతమవుతున్నారు. ఈ మ్యాచ్‌లో వీరు ఆడుతారా లేదా అనేది కాస్త సందేహంగా మారింది. హార్దిక్ బరిలోకి దిగే అవకాశాలున్నా గిల్ తొలి మ్యాచ్‌కు కష్టమేనని సమాచారం. ఈ మ్యాచ్‌లో రోహిత్‌తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ ప్రారంభించే ఛాన్స్ ఉంది.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు సమానంగా ఉన్నాయి. రోహిత్, కోహ్లి, ఇషాన్, శ్రేయస్, రాహుల్, హార్దిక్, జడేజాలతో భారత బ్యాటింగ్ బలంగా ఉంది. అంతేగాక సిరాజ్, షమి, బుమ్రా, అశ్విన్, జడేజా, కుల్దీప్‌లతో బౌలింగ్ కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. ఇక ఆస్ట్రేలియాలో కూడా స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. వార్నర్, స్మిత్, లబుషేన్, మార్ష్, కారే, గ్రీన్, మాక్స్‌వెలలతో ఆసీస్ బ్యాటింగ్ బలంగా ఉంది. అంతేగాక కెప్టెన్ కమిన్స్, హాజిల్‌వుడ్, అబాట్, స్టోయినిస్, జంపాలతో బౌలింగ్ కూడా బలోపేతంగా ఉంది. దీంతో మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయం.
టాప్ బిట్
ఆసియా క్రీడల్లో అసాధారణ ఆటతో చరిత్ర సృష్టించిన భారత క్రీడాకారులపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. బ్యాడ్మింటన్, చెస్, హాకీ, క్రికెట్, కబడ్డీ, ఆర్చరీ, టెన్నిస్ తదితర క్రీడాంశాల్లో భారత ఆటగాళ్లు పతకాల పండించడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆసియా క్రీడల్లో వందకుపైగా పతకాలను సాధించడంతో వీరి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రధాని మోడీతో సహా పలువురు ప్రముఖులు కూడా భారత ఆటగాళ్లపై ప్రశంసలు గుప్పించారు.