బెంగళూరు : ఇస్రో ( ఇండియన్ స్పేస్ రీసెర్చి ఆర్గనైజేషన్ ) జనవరి1న ఎక్స్ రే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎక్స్‌పోశాట్)ను అంతరిక్షం లోకి ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఇది భారత్ మొదటి ఎక్స్‌రే పోలారిమెట్రిక్ మిషన్. ఇటువంటి మిషన్‌ను ఇప్పటివరకు అమెరికాయే ప్రయోగించింది. ఎక్స్‌పోశాట్ అనేది ప్రత్యేక ఖగోళ శాస్త్ర అబ్జర్వేటరీ. ఇది కృష్ణబిలాలను, న్యూట్రాన్ నక్షత్రాలను అధ్యయనం చేస్తుంది. అయితే జనవరి 5న ప్రారంభమైన ఈ అధ్యయనంలో ఎక్స్‌పోశాట్‌పై ఉన్న ఎక్స్‌స్పెక్ట్ పేలోడ్ సూపర్‌నోవా అవశేషం తాలూకు మొదటి కాంతి కిరణాన్ని గ్రహించ గలిగింది. సూపర్‌నోవా అనేది ప్రకాశిస్తూ విస్ఫోటనం చెందే నక్షత్రం. కెసియోపియా ( సిఎఎస్ ఎ) అనే నక్షత్ర విస్ఫోటన కాంతి కిరణ అవశేషాన్ని గ్రహించడమైందని బెంగళూరు ప్రధాన కేంద్రంగా ఉన్న ఇస్రో బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఈ సూపర్‌నోవా అధ్యయనం ద్వారా ఎక్స్‌స్పెక్ట్ తన పనితీరును తానే పరీక్షించుకుందని ఇస్రో వివరించింది. సాఫ్ట్ ఎక్స్‌రేల ద్వారా విశ్వం లోని రహస్యాలను ఈ మిషన్ స్పెక్ట్రల్, తాత్కాలిక అధ్యయనాలు ఛేదించగలవన్న నమ్మకం కలిగిందని ఆశాభావం వెలిబుచ్చింది. ఎక్స్‌పోశాట్ తనతోపాటు రెండు సాంకేతిక పరికరాలను మోసుకెళ్లింది. అవి ఎక్స్‌రే లోని పోలారి మీటర్ (పోలిక్స్), ఎక్స్‌రే స్పెక్ట్రోస్కోపీ , టైమింగ్ (ఎక్స్‌స్పెక్ట్). కాస్మిక్ ఎక్స్‌రే మూలాలను కనుగొనడమే వీటి లక్షం. మీడియం ఎనర్జీ ఎక్స్‌రేల్లో ఎక్స్‌రే పోలరైజేషన్ ను అంటే ఎక్స్‌రే ధ్రువణాన్ని పరిశోధించడంపై పోలిక్స్ సాధనం దృష్టి కేంద్రీకరించగా, సాఫ్ట్ ఎక్స్‌రే బాండ్‌లో ఎక్స్‌రే మూలాలను నిరంతరం అధ్యయనం చేయడం ఎక్స్‌స్పెక్ట్ పేలోడ్ లక్షం. ఈ నేపథ్యంలో నిర్వహణ సామర్థాన్ని పరీక్షించే దశలో సూపర్‌నోవా కెసియోపియా ఎ ను ఎక్స్‌స్పెక్ట్ నేరుగా పరిశీలిస్తుంది.
నక్షత్ర విస్ఫోటన అవశేష ఉద్గారంలో మెగ్నీషియం, సిలికాన్, సల్ఫర్, ఆర్గాన్, కాల్షియం, ఐరన్ మూలకాలను ఈ అధ్యయనంలో కనుగొనడమైంది. బెంగళూరుకు చెందిన యుఆర్ రావు శాటిలైట్ సెంటర్ ( యుఆర్‌ఎస్‌సి) స్పేస్ ఆస్ట్రానమీ గ్రూప్ ఈ ఎక్స్‌స్పెక్ట్ పేలోడ్‌ను అభివృద్ధి చేసింది. విశ్వం లోని అత్యంత శక్తివంతమైన అద్భుత దృగ్విషయాలను నిరంతరం కనుగొనడంలో ఎక్స్‌స్పెక్ట్ సుదీర్ఘకాలం సామర్ధాలను కలిగి ఉంటుందన్న విశ్వాసాన్ని ఇస్రో వెల్లడించింది.