Wednesday, January 22, 2025

ఆహార ద్రవ్యోల్బణం

- Advertisement -
- Advertisement -

వచ్చే ఎన్నికల్లో పార్లమెంటులో మళ్ళీ అధిక సంఖ్యలో స్థానాలను గెలుచుకొని వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తామని చెప్పుకొంటున్న కమలనాథులు అదుపు తప్పి అదే పనిగా పేట్రేగిపోతున్న ఆహార ద్రవ్యోల్బణం గురించి ప్రజలకు వివరించుకొనే స్థితిలో లేకపోడం గమనించవలసిన విషయం. ధరలు ఎంతగా పెరిగినా, నిరుద్యోగం మరెంతగా విజృంభించినా, డీజెల్, పెట్రోల్ ధరలు ఆకాశం నుంచి దిగిరాకపోయినా తాము మాత్రం అదే పనిగా పదే పదిగా దేశాన్ని పరిపాలిస్తూనే వుంటామని, మరొకరికి చోటు ఇవ్వబోమని బిజెపి పాలకులు చాటుతున్నారు. ఇటీవల విడుదలైన ‘టైమ్స్ నౌ ఇటిజి అభిప్రాయ మచ్చు సేకరణ ఫలితాలు ప్రధాని నరేంద్ర మోడీకి విశేషమైన మార్కులు వేశాయి. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడు సార్లు గెలుపొంది అధికారానికి వచ్చిన ప్రధానిగా నరేంద్ర మోడీ నిరూపించుకొంటారని ఈ ప్రజాభిప్రాయ సేకరణ బల్లగుద్ది చెబుతున్నది. హిందీ మాట్లాడే ప్రాంతాల్లో ఎన్‌డిఎ విజయావకాశాలు 80% వద్ద విహరిస్తున్నట్టు ఈ ఫలితాలు అభిప్రాయపడ్డాయి.

మీడియాలో ప్రచారం ఇలా వుంటే వాస్తవంలో ప్రధాని మోడీ పాలన సగటు మనిషికి చుక్కలు చూపిస్తున్నది. అన్నమో రామచంద్రా అంటూ ఆకలి కేకలు పెట్టిస్తున్నది. ఈ ఆగస్టు నెలలో ఆహార ద్రవ్యోల్బణం 7.44 శాతానికి అంటే గరిష్ఠ స్థాయికి చేరుకోడమే ఇందుకు నిదర్శనం. టమాటో ధరలు గరిష్ఠంగా కిలో రూ. 250కి చేరుకొని ఆ స్థాయిలో కొన్ని మాసాల పాటు కొనసాగాయి. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పటికీ కిలో రూ. 60, రూ. 50 వద్ద వున్నదంటే సామాన్యులు టమాటోని కొని తినే పరిస్థితి లేదు. పచ్చిమిర్చి తదితర కూరగాయల ధరలు కూడా దిగిరాకుండా పైపైనే కొనసాగుతున్నాయి. ఇంటిలో తయారు చేసుకొనే ఒక ప్లేటు శాకాహారం ధర 28% పెరిగిపోయిందని అంచనాలు వెలువడ్డాయి. అన్నం, రోటీ, పప్పు, కూరగాయలు, సలాడ్, పెరుగుతో కూడిన భోజనం ధర అదనంగా రూ. 33.7 పెరిగిందని మరో సమాచారం. ప్రజలకు సరసమైన ధరలకు తిన తిండి సమకూర్చలేని పాలకులు వుండెందుకు అనే ఆలోచన ఓటర్లను బొత్తిగా కదిలించజాలదని బిజెపి అనుకూల శక్తులు నమ్మమంటున్నాయా?

ఇంతటి దారుణమైన పాలనను మళ్ళీ మరి ఐదేళ్ళు కావాలని కోరుకునేవారుంటారా? ఉంటారని టైమ్స్ నౌ ఇటిజి అభిప్రాయ సేకరణ సర్వే నమ్మబలుకుతున్నది. అదే నిజమైతే తింటి కంటె మతమే ముఖ్యమనే స్థితిలో ప్రజలున్నారనే అనుకోవాలి. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు మౌలిక సౌకర్యాల అందుబాటులో ఎటువంటి ఇబ్బందీ లేని సమాజాన్ని, స్వయం సమృద్ధి గల భారతాన్ని నెలకొల్పుతానని వచ్చిన ప్రధాని మోడీ ప్రభుత్వం వాటిని సాధించడంలో విఫలమైంది. 2015లో 7.4% స్థూల దేశీయోత్పత్తిని సాధించగా అది 2020 నాటికి 4.2 శాతానికి పడిపోయింది. ఆ తర్వాత వచ్చిన కరోనా దేశ శ్రామిక వర్గంలో ఉత్పత్తి ఉత్సాహాన్ని చంపివేసింది. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన 2014లో ద్రవ్యోల్బణం 8.33 శాతం వద్ద వుంది. ప్రస్తుతం ఒక్క ఆహార ద్రవ్యోల్బణమే 7.44 శాతం. అంటే మనం ఎటు ప్రయాణం చేస్తున్నామో అర్థం కాక మానదు. రైతు చేతిలో వున్న ఆహారోత్పత్తిని కార్పొరేట్ శక్తుల చేతికి అప్పగించడానికి జరిగిన ప్రయత్నాలు, వాటిని నిరోధించడానికి ప్రజ్వరిల్లిన రైతు ఉద్యమం గురించి తెలిసిందే.

ఆ ఉద్యమంలో 700 మంది రైతులు ప్రాణాలు అర్పించుకొన్న సంగతీ తెలిసిందే. ఆ తర్వాత రైతు ఉత్పత్తులకు మద్దతు ధరలు కల్పించి తీరవలసిన పరిస్థితిని సృష్టించే ప్రత్యేక చట్టాన్ని తీసుకు వస్తామని ఆశజూపి ప్రధాని మోడీ ప్రభుత్వం ఆ విషయంలో విఫలమైంది. ద్రవ్యోల్బణాన్ని 2 నుంచి 6 శాతానికి మించకుండా చూస్తానని ఆర్‌బిఐ చెప్పుకొన్నది. అది ఇప్పుడు విఫలమైంది. ప్రభుత్వం కొన్ని ఆహార సరకుల ఎగుమతులను నిలిపివేసింది. అయినా ద్రవ్యోల్బణం ఆగడం లేదు. గత జులై లోనే నాన్ బస్మతి బియ్యం ఎగుమతిని నిషేధించింది. దానితో దేశంలో బియ్యం ధరలు తగ్గుతాయని ఆశించింది. ప్రపంచంలో బియ్యాన్ని ఆహారంగా వినియోగించే దేశాల్లో వాటి ధరలు విపరీతంగా పెరిగిపోతాయని భయపడ్డారు. అదే సమయంలో ఈ నిషేధం దేశంలోని రైతుల అధిక ఆదాయ ఆశల మీద చన్నీళ్ళు చల్లింది. ఆహార ద్రవ్యోల్బణాన్ని అరికట్టలేకపోతే 70% నిరుపేదలుగా వున్న భారత ప్రజలు అర్ధాకలితో బతకాల్సి వస్తుంది.

బలవర్ధకమైన తిండికి మామూలు రోజుల్లోనే నోచుకోని నిరు పేద భారతీయులు ఆహార ద్రవ్యోల్బణం నేపథ్యంలో మరింత ఆకలికి లోనవుతారు. కరవు ఏర్పడగానే కేంద్రం కొంత కాలం పాటు 5 కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇచ్చి చేతులు దులుపుకొంటుంది. అంతకు మించి తన వద్ద గల బియ్యం నిల్వల మీద ఈగ వాలనివ్వదు. కొద్ది రోజుల పాటు ఎంతో కొంత సాయం చేసినంత మాత్రాన ఆహార కొరత పూర్తిగా తొలగిపోదు. అందుచేత అందుబాటులోని ధరలకు ఆహారం అందేలా చూడడం ఒక్కటే ఈ ద్రవ్యోల్బణానికి సరైన విరుగుడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News