Wednesday, January 8, 2025

మరో మహమ్మారి వైరస్?

- Advertisement -
- Advertisement -

కరోనా మహమ్మారి విలయతాండవం సృష్టించి ఐదేళ్లు గడిచినా, ఇప్పటికీ ఆ పేరు వింటే చాలు వెన్నులోంచి వణుకు పుడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి వైరస్ లక్షలాది మందిని కబళించింది. దీని బారినపడి బతికి బట్టకట్టినవారు ఉన్నా, దాని ప్రభావంతో ఇప్పటికీ పడరాని పాట్లు పడుతున్నారన్నది తోసిపుచ్చలేని నిజం. మళ్లీ అలాంటి వైరస్ ఒకటి వెలుగు చూసిందనీ, మానవాళిని తుదముట్టించేందుకు ముంచుకువస్తోందని తెలిస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడా పరిస్థితి ప్రజానీకానికి కంటి మీద నిద్ర లేకుండా చేస్తోంది. కరోనా వైరస్‌కు పుట్టినిల్లయిన చైనాలోనే హెచ్‌ఎంపివి అనే కొత్తరకం వైరస్ పుట్టి, విస్తృతంగా వ్యాప్తి చెందుతోందని, దీని బారినపడిన జనం వేల సంఖ్యలో ఆస్పత్రులలో చేరుతున్నారని సామాజిక మాధ్యమాల్లో వెల్లువలా పోస్టవుతున్న వీడియోలను చూసి జనం బెంబేలెత్తిపోతున్నారు.

ఈ వైరస్ తాజాగా బెంగళూరులోను, అహ్మదాబాద్‌లోను వెలుగుచూసిందన్న వార్తలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. బెంగళూరులోని ఒక ఆస్పత్రిలో ఎనిమిది నెలలు, మూడు నెలలు వయసున్న ఇద్దరు పసికందులకు వైద్య పరీక్షలు నిర్వహించగా, హెచ్‌ఎంపివి జాడలు బయటపడ్డాయని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. ఇండియాలోనే కాకుండా, అనేక దేశాల్లో జనావళి ఈ వైరస్ గురించి చర్చించుకోవడం, ఆందోళన చెందడం కొన్ని రోజులుగా జరుగుతోంది. ఇటీవల చైనాలోనూ, తాజాగా బెంగళూరు, అహ్మదాబాద్ నగరాల్లోనూ వెలుగు చూసిందని చెబుతున్న హ్యూమన్ మెటానిమో వైరస్ (హెచ్‌ఎంపివి) కోవిడ్ లా ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చినదేమీ కాదు. దీని జాడలు 2001లోనే నెదర్లాండ్స్‌లో బయటపడ్డాయి. 2018లో ప్రపంచవ్యాప్తంగా ఆస్పత్రిపాలైన చిన్నారుల్లో మూడు నుంచి పది శాతం మంది హెచ్‌ఎంపివి బారిన పడినట్లు ఒక అధ్యయనంలో తేలింది. దీనిని బట్టి ఈ వైరస్ ప్రపంచానికి పాతదేనని స్పష్టమవుతోంది.

అదిగో పులి అంటే ఇదిగో తోక అంటూ సామాజిక మాధ్యమాల్లో బాధ్యతారహితంగా పోస్టులు పెట్టేవారి పుణ్యమాని హెచ్‌ఎంపివి పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. నిజానికి అనేక ఆసియా దేశాలకు ఇది శీతాకాలం. ఇన్‌ఫ్లూయెంజా, మైక్రోప్లాస్మా, నిమోనియా వంటి వ్యాధులు ప్రబలి, జలుబు, దగ్గు, ఇతర శ్వాసకోశ వ్యాధులతో జనం బాధపడటం సహజం. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే పిల్లలూ, పెద్దలూ త్వరితగతిన ఇలాంటి వ్యాధులకు లోనవుతూ ఉంటారు. కోవిడ్ వ్యాప్తి చెందిన తొలినాళ్లలో అవగాహన లేమివల్ల ప్రజలను అప్రమత్తం చేయడంలోనూ, సరైన నిరోధక చర్యలు చేపట్టడంలోనూ జరిగిన జాప్యం లక్షలాదిమంది ప్రాణాలను బలిగొనడానికి కారణమైంది. ఈ నేపథ్యంలో మరో వైరస్ వ్యాప్తి చెందుతోందని తెలిస్తే, ఆందోళన చెందడం సహజం. అయితే, గత ఏడాదితో పోలిస్తే తమ దేశంలో హెచ్‌ఎంపివి కేసులు తగ్గాయంటూ చైనా గణాంకాలతోసహా పేర్కొంటూ ఉండగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఇప్పటి వరకూ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించకపోవడాన్ని బట్టి హెచ్‌ఎంపివి అంత ప్రమాదకరమైన వైరస్ కాదని తెలుస్తోంది. ఈ సూక్ష్మక్రిముల బారిన పడినవారు కోవిడ్ లాగానే శ్వాసకోశ వ్యాధులకు లోనవుతారని తేలినా, ఇప్పటివరకూ దీనికి వ్యాక్సీన్ కనిపెట్టకపోవడం వైద్య ఆరోగ్య శాఖ ఉదాసీన వైఖరికి ఉదాహరణ.

చైనాలో హెచ్‌ఎంపివి కేసులు పెరుగుతున్నట్లుగా వస్తున్న వార్తలపై తక్షణమే స్పందించి, ప్రపంచ ఆరోగ్య సంస్థను వివరాలకోసం అడగడం భారత ప్రభుత్వం అప్రమత్తతను తెలియజేస్తోంది. దీనికి తోడు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ రంగంలోకి దిగి, జాయింట్ మానిటరింగ్ గ్రూప్ సమావేశం నిర్వహించి, హెచ్‌ఎంపివి వ్యాప్తి, నివారణపై తీసుకోవలసిన చర్యల గురించి చర్చించింది. దేశవ్యాప్తంగా ఆరోగ్యశాఖాధికారులు పలు ప్రాంతాల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తున్నారు. బెంగళూరులో హెచ్‌ఎంపివి వైరస్ సోకిన ఇద్దరు పసికందుల్లో ఒకరు ఇప్పటికే ఆస్పత్రినుంచి డిశ్చార్జ్ కాగా, మరొకరిలో వ్యాధి తగ్గుముఖం పట్టిందన్న విషయం గమనార్హం. పైగా ఈ ఇద్దరికీ విదేశాల నుంచి వచ్చినవారివల్ల ఈ వైరస్ సోకలేదన్న ఆరోగ్య శాఖ ప్రకటనను బట్టి, కోవిడ్ మాదిరిగా హెచ్‌ఎంపివి ఇప్పటికిప్పుడు చైనా నుంచి దిగుమతైన వైరస్ కాదన్న సంగతి స్పష్టమవుతోంది.

వ్యాధులవ్యాప్తి అంతగా లేనప్పటికీ గత కోవిడ్ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని హెచ్‌ఎంపివి వ్యాప్తిని అరికట్టేందుకు చైనా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటోందని అక్కడి అధికార మీడియా వెల్లడించడం ఊరట కలిగించే విషయం. ఏదిఏమైనా, హెచ్‌ఎంపివి వైరస్ జాడలు మన దేశంలోనూ బయటపడిన నేపథ్యంలో మరింత వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం అవసరం. వ్యాధి నిర్ధారణ కేంద్రాలను ఏర్పాటు చేసి, హెచ్‌ఎంపివి జాడ కనిపెట్టి, ఈ మహమ్మారిని మొగ్గలోనే తుంచేందుకు ప్రభుత్వాలు నడుం బిగించాలి. ప్రజలు తమ వంతు బాధ్యతగా స్వీయ రక్షణ చర్యలు చేపట్టడం అత్యంత ఆవశ్యకం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News