Monday, December 23, 2024

అగ్రరాజ్యం కినుక

- Advertisement -
- Advertisement -

అమెరికా, ఇండియాల బంధం ఎంతో లోతైనది. అయితే దాన్ని అలుసుగా తీసుకునేంత కాదం’టూ భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ చేసిన వ్యాఖ్యలు.. మోడీ రష్యా పర్యటనపై అగ్రరాజ్యం ఎంత ఆగ్రహంగా ఉందో చెప్పకనే చెబుతున్నాయి. వాషింగ్టన్‌లో 32 దేశాల ప్రతినిధులు పాల్గొనే నాటో శిఖరాగ్ర సదస్సు ప్రారంభం కావడానికి ముందు మోడీ జరిపిన రష్యా పర్యటన సహజంగానే అమెరికా సహా పశ్చిమ దేశాలకు కంటగింపుగా మారింది. మోడీకి రష్యా రెడ్ కార్పెట్ స్వాగతం పలకడం, ఇరు దేశాధినేతలూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుని మరీ కుశలప్రశ్నలు వేసుకోవడం వంటివి నాటో సభ్యత్వ దేశాలకు ఇచ్చగించని సంఘటనలే.

మోడీ పర్యటన శాంతి యత్నాలకు విఘాతం కలుగజేసేలా ఉందంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ నేరుగానే విమర్శించారు. క్వీవ్ లోని ఓ చిన్న పిల్లల ఆసుపత్రిపై రష్యా బాంబు దాడి జరిపిన రోజున రష్యాలోనే ఉన్న మోడీ ఇరుకునపడినట్లే కనిపించినా యుద్ధంలో చిన్నారుల మరణాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోందంటూ రష్యా దాడిని ఖండించారు.యుద్ధ సమయంలో శాంతి చర్చలు ఫలించవని తేల్చిచెప్పారు. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలయ్యాక పశ్చిమ దేశాలన్నీ వెలివేసిన రష్యాతో మునుపటి సంబంధాలు కొనసాగించిన దేశాలలో ఇండియాది మొదటిస్థానం. రష్యా చమురును కొనుగోలు చేస్తే చర్యలు తప్పవని అమెరికా పరోక్ష హెచ్చరికలు జారీ చేసినా, చమురు దిగుమతి చేసుకుని తమకు దేశ ప్రయోజనాలు ఎంతో ముఖ్యమని మోడీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

అమెరికా కన్నెర్ర చేసిన నేపథ్యంలో మూడేళ్లుగా ఇరు దేశాల మధ్య నిలిచిపోయిన వార్షిక ద్వైపాక్షిక సదస్సులకు ఇండియా తిలోదకాలు ఇస్తుందని పుతిన్ భావించారు. కానీ ఆయన అభిప్రాయాన్ని వమ్ము చేస్తూ చర్చలకు మోడీ మళ్లీ శ్రీకారం చుట్టడం కూడా సాహసోపేతమైన నిర్ణయమే. పశ్చిమ దేశాల ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాలను తాకట్టుపెట్టేది లేదని మోడీ తన రష్యా పర్యటన ద్వారా స్పష్టం చేశారు. చైనా, రష్యాలతో నెలకొన్న శత్రుత్వం కారణంగా భారత్‌తో మైత్రి అమెరికాకు అత్యంత ఆవశ్యకమే కావచ్చు. అలాగే చైనాను ఎదుర్కొనేందుకు అమెరికా సాయమూ భారత్‌కు తప్పనిసరి కావచ్చు కానీ, అగ్రరాజ్యం అడుగులకు మడుగులొత్తి దేశ ప్రయోజనాలను పణంగా పెట్టేందుకు సిద్ధంగా లేమన్న సంకేతాలను బలంగా పంపించడంలో మోడీ సఫలీకృతులయ్యారని చెప్పవచ్చు.

ఉక్రెయిన్ పై ఒంటికాలిమీద లేచి, యుద్ధాన్ని ప్రకటించి, పీకలలోతు నష్టాలు, కష్టాల్లో కూరుకుపోయిన రష్యా తనకు అందివచ్చే ఏ మిత్రుడినీ వదులుకోలేని పరిస్థితిలో ఉంది. ఒకవైపు ఇండియాతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తూనే, మరోవైపు చైనాతోనూ అంటకాగుతోందన్న విషయం విస్మరించడానికి వీల్లేదు. ఇండియా, చైనాల్లో ఎవరు కావాలో తేల్చుకునే పరిస్థితి ఆసన్నమైతే రష్యా ఖచ్చితంగా చైనానే ఎంచుకుంటుందనడంలో ఎలాంటి సందేహమూ అక్కర్లేదు. ఇదే విషయాన్ని అమెరికా భద్రతా సలహాదారు జేక్ సల్లివాన్ కూడా నొక్కి చెప్పిన విషయం గమనార్హం. సుదీర్ఘకాలం తన నమ్మకమైన భాగస్వామిగా రష్యాను ఎంచుకోవడం అంత మంచి కాదని సలహా ఇస్తూనే ఇటీవలి కాలంలో చైనాకు రష్యా ‘జూనియర్ భాగస్వామి’గా మారిందని వ్యాఖ్యానించారు. పడవలు ఒడ్డున ఉన్నప్పుడు రెండింటి మీదా కాళ్లు వేసి నిలబడవచ్చేమో గానీ, అవి కదిలాక కూడా అలాగే నిలబడితే నీళ్లలో పడటం ఖాయం.

ఈ విషయం తెలియనంత అమాయకురాలేం కాదు ఇండియా. ప్రస్తుతం ఇండియా రెండు పడవల మీద కాలు వేసినట్లు కనిపిస్తున్నా, వ్యూహాత్మకంగా అడుగులు వేయడంలో ఇతర దేశాల కంటే రెండాకులు ఎక్కువే చదివిందన్న సంగతి ఇప్పటికే పలుమార్లు రుజువైంది. మోడీ నాయకత్వంలో భారత విదేశాంగ విధానం పదునుదేలింది. దేశ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ, నొప్పించక తానొవ్వక అనే రీతిలో ఇతర దేశాలతో స్నేహ సంబంధాలు నెరపుతూ పనులు చక్కబెడుతున్న ఇండియాకు తాజా పరిణామం కాస్త ఆందోళనకరమే. ఈ నేపథ్యంలో అమెరికాతో దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించుకోవడంలో చొరవ చూపవలసిన అవసరం ఉంది. ఆసియాలో అతి వేగంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో అమెరికాకు భారత్ అవసరం ఎంతో ఉంది. అలాగే పక్కలో బల్లెంలా మారిన చైనాకు ముకుతాడు వేయాలంటే అమెరికాతో మైత్రీబంధం ఇండియాకు కూడా అంతే ముఖ్యం. ఇవన్నీ తెలిసిన మోడీ ప్రభుత్వం వివేచనతో ముందడుగు వేయాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News