నిండా మునిగిన తర్వాత నెమ్మది నెమ్మదిగా పైకి వస్తూ వుండడం, ఊబిలో కూరుకుపోలేదని, ఊర్ధగమన శక్తి లోపించలేదని చాటడం ఆనందమే. ఈ ఆర్థిక సంవత్సరం రెండో మూడు మాసాల (త్రైమాసికం) కాలం (జులై సెప్టెంబర్) లో స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) 8.4 శాతం వృద్ధిని నమోదు చేయడం దేశ ఆర్థిక వికాసానికి సంబంధించి అటువంటి ఒక మంచి పరిణామం. ఈ కాలంలో నమోదైన మొత్తం జిడిపి విలువ 35.73 లక్షల కోట్ల రూపాయలు. ఇది 20192020 (కొవిడ్‌కు ముందు) ఇదే సమయంలో వున్న దాని కంటే 0.33 శాతం ఎక్కువ. అందుచేత మన ఆర్థిక వృద్ధి కొవిడ్ అవరోధాలను దాటి అంతకు ముందు స్థాయిని అందుకొని తిరిగి పుంజుకుంటున్నదనే ఆనందం ప్రభుత్వం తరపు ఆర్థిక నిపుణుల నుంచి, సలహాదారుల నుంచి వ్యక్తమవుతున్నది. 2021 22 అంతానికి రెండంకెల వృద్ధి రేటు సాధించగలమని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణ్యన్ అమిత విశ్వాసాన్ని ప్రకటించారు. గత ఆర్థిక సంవత్సరం (202021) ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో మైనస్ 24.4 శాతంగా నమోదై చెప్పనలవికాని లోతులకు పడిపోయిన జిడిపి తిరిగి ప్లస్‌లోకి వచ్చి ముందుగమనాన్ని నిరూపించుకున్న మాట వాస్తవం. ప్రధాన రంగాలైన సిమెంటు, బొగ్గు, రిఫైనరీ ఉత్పత్తులు, విద్యుత్తు వంటి ఎనిమిది విభాగాలు ఈ అక్టోబర్‌లో 7.5 శాతం వృద్ధిని చూపించినట్టు వార్తలు చెబుతున్నాయి. వ్యవసాయ రంగం ఎప్పటి మాదిరిగానే జిడిపి వృద్ధికి ప్రధాన ఉత్ప్రేరకంగా వుంది. అలాగే అటవీ సంపద, మత్స పరిశ్రమలు కూడా వృద్ధికి తోడ్పడ్డాయి. క్రూడాయిల్ ఉత్పత్తిలో మాత్రం మెరుగుదల కనిపించలేదు. ఆటోమొబైల్ రంగ వికాసాన్ని పరోక్షంగా తెలియజేసే ఉక్కు రంగం వృద్ధి కూడా మందకొడిగానే వుంది. తాత్కాలిక ఉద్యోగాలకు అవకాశం గల సర్వీసు రంగం, ప్రైవేటు పెట్టుబడి, వ్యయ రంగం కూడా ఆశాజనకంగా లేవని తెలుస్తున్నది. కేవలం ప్రభుత్వం పెడుతున్న పెట్టుబడి, ఖర్చు వల్లనే జిడిపిలో వృద్ధి సంభవమైనట్టు స్పష్టపడుతున్నది. దారుణంగా పడిపోయి కాళ్లూ, చేతులు విరిగిపోయినప్పటి స్థితితో పోల్చుకున్నప్పుడు కనిపించే స్వల్ప వృద్ధి చెప్పుకోదగినది కాదని పరిశీలకులు పెదవి విరుస్తున్నారు. కొవిడ్‌కు ముందే డిమాండ్ పడిపోయి కొత్త పెట్టుబడులకు అత్యంత నిరాశజనకంగా వున్న దేశ ఆర్థిక వ్యవస్థ ఇంకా గణనీయంగా పెరగవలసి వుందని అంటున్నారు. ఈ వృద్ధిని చూసి సంబర పడడానికి వీల్లేదని, ఆర్థిక రంగం పూర్తిగా కోలుకొని పరుగులు పెట్టడానికి సిద్ధంగా వుందని అనుకోలేమని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం వ్యాక్యానించారు. ఇంకా మెరుగుపడవలసిన రంగాలనేకం వున్నాయన్నారు. ప్రతిపక్ష నేతల్లో ఒకరైన చిదంబరం మాటను పూర్తిగా పరిగణనలోకి తీసుకోలేకపోయినా వాస్తవ పరిస్థితిని చూసినప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో వికసించలేదని మాత్రం చెప్పవచ్చు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం జిడిపి వృద్ధి కొవిడ్‌కు ముందరి స్థితికి కూడా ఇంకా చేరుకోలేదని ప్రొఫెసర్ గౌరవ్ వల్లభ్ అభిప్రాయపడ్డారు. రెండవ త్రైమాసికంలో జిడిపిపై కొన్ని సంస్థలు చెప్పిన జోస్యాలతో పోల్చుకుంటే 8.4 వృద్ధి రేటు గణనీయమైనదిగానే ధ్రువపడుతున్నది. జిడిపి వృద్ధి రేటు 7.7 శాతంగా వుండగలదని ఐసిఆర్‌ఎ జోస్యం చెప్పింది. ఆ తర్వాత దానిని 7.9 శాతంగా సవరించింది. ఆర్‌బిఐ కూడా 7.9 శాతం వృద్ధిని ఊహించింది. భారత ఆర్థిక రంగం తిరిగి పుంజుకునే విషయంలో మిశ్రమ సంకేతాలు కనిపిస్తున్నాయని వాస్తవానికి విశాల ప్రాతిపదిక పునరుద్ధరణకు అవకాశాలు లేవని స్విస్ బ్రోకరేజ్ యుబిఎస్ సెక్యూరిటీస్ ఆర్థికవేత్త తన్వీ గుప్తా జైన్ అభిప్రాయపడ్డారు. అయితే వాహనాలు, ఆస్తులు, గృహ నిర్మాణం, వినియోగ వస్తువుల రంగాల్లో గిరాకీ పెరిగే అవకాశాలున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ముడి సరకుల ధరలు పెరిగాయని వాటి ప్రభావం చిల్లర ధరలపై ఇంకా పూర్తిగా కనిపించడం లేదని, చిల్లర ధరలు పెరిగే కొద్దీ గిరాకీ తగ్గిపోయే ప్రమాదం వుందని కూడా అన్నారు. కొవిడ్ కాలంలో భారత ప్రభుత్వం అమలు చేసిన అనేక నూతన ఆర్థిక సంస్కరణలు ఇంకా పూర్తిగా అమల్లోకి రాలేదని, వాటి ప్రభావం ఎలా ఉంటుందో వచ్చే ఏడాది గాని తెలియదని గుప్తా జైన్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడేళ్ల కాలంలో ఆర్థిక వ్యవస్థకు స్పష్టమైన దిశానిర్దేశం జరగలేదు. ఆర్థిక రంగానికి చికిత్సలుగా చెప్పి మోడీ అత్యంత ఉత్సాహంగా అమలు చేసిన పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి అమలు వ్యతిరేక ప్రభావాన్ని చూపి దేశ వ్యాప్తంగా అసంఖ్యాక వ్యాపారాలు, పరిశ్రమలు మూతపడ్డానికే తోడ్పడ్డాయి. అందుచేత ఒకటి రెండు త్రైమాసికాల్లో కనిపించేటటువంటి స్వల్ప వృద్ధిని చూసి సంబరపడలేము. కేంద్రం జనహిత దృష్టితో ఆలోచించి నమ్మదగిన ఆర్థిక వ్యయాన్ని రచించి అమలు చేయాలి.