పురుషులతో దీటుగా విపత్తు సహాయక సేవలు
న్యూఢిల్లీ: ఇప్పటి వరకు పురుషులకే పరిమితమైన జాతీయ విపత్తు సహాయక దళంలో మహిళలు చోటు దక్కించుకున్నారు. జాతీయ విపత్తు సహాయక దళం(ఎన్డిఆర్ఎఫ్)లో ఇటీవలే 100 మందికి పైగా మహిళలు రక్షణ సిబ్బందిగా నియమితులయ్యారు. ఉత్తర్ ప్రదేశ్లోని గఢ్ ముక్తేశ్వర్ పట్టణంలో గంగా నదీ తీరాన సహాయక చర్యల కోసం ఇటీవలే ఎన్డిఆర్ఎఫ్కు చెందిన మహిళా బృందాన్ని వినియోగించుకున్నట్లు ఎన్డిఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎస్ఎన్ ప్రధాన్ తెలిపారు. విపత్తు సహాయకుల తొలి జట్టు ఇప్పటికే పూర్తి స్థాయిలో సేవలందచేస్తోందని, యుపిలోని గఢ్ ముక్తేశ్వర్లో ఆ రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు మహిళా బృందాన్ని పంపామని, వారు సహాయక పడవలు, ఇతర పరికరాలను సమర్థంగా వినియోగించారని ఆయన చెప్పారు. సంపూర్ణ సహాయకులుగా ఈ మహిళా సిబ్బంది సుశిక్షితులయ్యారని ఆయన తెలిపారు.
గత కొద్ది నెలలలో 100 మందికి పైగా మహిళా సిబ్బంది ఎన్డిఆర్ఎఫ్లో చేరారని, వారు తమ శిక్షణను పూర్తి చేసుకున్న తర్వాత వివిధ రాష్ట్రాలలో బెటాలియన్లలో వారిని నియమిస్తామని ఆయన తెలిపారు. సమీప భవిష్యత్తులో ఈ సంఖ్య 200కు పెరుగుతుందని ఆశిస్తున్నట్లు ప్రధాన్ చెప్పారు. ప్రతి 1000 మంది సిబ్బందితో కూడిన ఎన్డిఆర్ఎఫ్ బెటాలియన్లో 108 మంది వరకు మహిళా సహాయకులు ఉండవచ్చని ఆయన వివరించారు. వీరిని కానిస్టేబుల్, సబ్ ఆఫీస్(సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్) ర్యాంకులలో చేర్చుకుంటున్నట్లు ఆయన చెప్పారు.