Monday, December 23, 2024

రైతు కంట తడి

- Advertisement -
- Advertisement -

దాదాపు ఆగస్టు నెలంతా ముఖం చాటేసిన వర్షాలు రాష్ట్రంలో రైతుకి నరకం చూపించాయి. ఇదే పరిస్థితి కొనసాగితే వర్షాధార పంటలు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం పొంచి వుంది. బోర్ల కింద పంటలను కాపాడుకోడానికి రైతు పడుతున్న తాపత్రయం రాష్ట్రంలో విద్యుత్తు వినియోగాన్ని అసాధారణంగా పెంచేసింది. ఆగస్టు 25న రాష్ట్రంలో అత్యధికంగా 14,361 మెగావాట్ల విద్యుచ్ఛక్తి వినియోగమైనట్టు ట్రాన్స్‌కో అధికారులు తెలియజేశారు. కొన్ని చోట్ల బోర్లు వట్టిపోతున్న పరిస్థితి కూడా నెలకొన్నది. ఆగస్టు మాసంలో 62% లోటు వర్షపాతం రికార్డు అయినట్టు తెలుస్తున్నది. ఇది గత 60 సంవత్సరాల్లో ఎన్నడూ ఎరుగనంత తక్కువ అంటున్నారు. సాగర ఉపరితలం వేడెక్కడమనే ఎల్‌నినో పరిస్థితి తలెత్తడం వల్లనే ఇది ఇలా సంభవించిందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రంలో 1.1 కోట్ల ఎకరాల్లో పంటలు వేసినట్టు సమాచారం. ఇందులో 86% వరి, పత్తి పంటలే. కొద్ది రోజుల్లో వర్షాలు కురవకపోతే వాటిని కాపాడుకోడం కష్టతరమే.

జులై నెలలో కనీవినీ ఎరుగనంత వర్షాలు కురిసి కొన్ని చోట్ల పొలాలు ఇసుక మేటలు వేశాయి. ఊళ్ళకు ఊళ్ళు మునిగిపోయాయి. చెప్పనలవికాని జీవన వ్యథను కళ్ళారా చూశాము. అందుకు పూర్తి విరుద్ధంగా ఆగస్టులో పరిస్థితి తల్లకిందులై వర్షం జాడే లేకుండా పోడం బాధాకరం. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని గత ఏప్రిల్, మే నెలల్లో భారత వాతావరణ విభాగం (ఐఎండి) పదేపదే నమ్మబలికింది. జూన్ సెప్టెంబర్ వర్షాకాలంలో సాధారణం కంటే తక్కువ కురిసే ప్రమాదం వుందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ హెచ్చరించింది. ఎల్‌నినో బలపడే సూచనలు వున్నాయని కూడా చెప్పింది. ఎల్‌నినో సంవత్సరాలన్నింటా వర్షాలు తక్కువగా పడతాయని అనుకోడానికి వీల్లేదని 1951 నుంచి 2022 వరకు సంభవించిన 15 ఎల్‌నినో సంవత్సరాల్లో ఆరింట మామూలు నుంచి అసాధారణ వర్షపాతం నమోదైందని ఐఎండి డైరెక్టర్ జనరల్ ఎం మహాపాత్ర ప్రకటించారు. దేశంలో సాగు జరుగుతున్న భూమిలో 51% అంటే 40% వ్యవసాయోత్పత్తి జరిగే ప్రాంతం పూర్తిగా వర్షాధారమే.

అందుచేత తొలకరి వర్షాలు అత్యంత ప్రధానమైనవి. అలాగే 47% మంది ప్రజలు వ్యవసాయ రంగం మీదే ఆధారపడి బతుకుతున్నారు. అందుచేత వర్షాలు బాగా పడడమనేది భారత దేశంలో ప్రజలకు ప్రాణప్రదమైంది. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండితే గ్రామీణ భారతంలో ఉపాధి అవకాశాలు మెరుగై ప్రజలు సంతోషంగా వుంటారు. దాని ప్రభావం వల్ల దేశ వ్యాప్తంగా పలు ఉత్పత్తుల కొనుగోళ్ళు కూడా పెరుగుతాయి. దేశ ఆర్థిక వ్యవస్థ చక్కబడుతుంది. అదనంగా ఉద్యోగాలు కలుగుతాయి. ఈ ఏడాది అసలు రుతు పవనాల ఆగమనమే ఆలస్యమైంది. తీరా వచ్చిన తర్వాత దేశమంతటా కమ్ముకోడానికి మరింత సమయం పట్టింది. జులైలో కురిసిన అతి భారీ వర్షాల వల్ల గోదావరి లోయలోని మానేరు, శ్రీరామ్ సాగర్, ప్రాణహిత, కడెం, ఎల్లంపల్లి వంటి ప్రాజెక్టులు నిండాయి. కాని కృష్ణా నదీ లోయలోని ప్రాజెక్టుల పరిస్థితి దయనీయంగా వుంది. ఒక్క జూరాల మినహాయిస్తే శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు నీళ్ళు లేక ఆయకట్టులను ఆదుకోలేని పరిస్థితిలో వున్నాయి.

శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం 215.81 టిఎంసిలు కాగా, ఇప్పుడు అందులో కేవలం 88.47 టిఎంసిలు మాత్రమే వున్నాయి. అలాగే నాగార్జునసాగర్ నీటి మట్టం 312.05 టిఎంసిలు కాగా, 153.39 టిఎంసిల నీటి నిల్వే వున్నది. వర్షాలు కురవకపోడంతో మొక్కజొన్న, జొన్న, పత్తి పంటల్లో ఎదుగుదల ఆగిపోయింది. తెగుళ్ళు కూడా సోకుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే పంటల దిగుబడి దారుణంగా తగ్గిపోయి రైతు కంట కన్నీరే చూడవలసి వుంటుంది. 1960 నుంచి రాష్ట్రంలో ఇది మూడో అత్యల్ప వర్షపాతమని నిపుణులు చెబుతున్నారు. నేటి నుంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికార్లు చెబుతున్నారు. ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్ నెల మెరుగ్గా వుంటుందని ఆశిస్తున్నారు. సెప్టెంబర్‌లో కూడా ఒక వారం పాటు వేడి వాతావరణం ఉన్నప్పటికీ మొత్తం మీద వర్షాలు బాగా కురుస్తాయంటున్నారు. వర్షాలను నమ్ముకొని విత్తనాలు చల్లడం, పంటలు సాగు చేయడం నిష్ప్రయోజనమని పదే పదే రుజువవుతున్నది. కాని సాగు నీటి సదుపాయం పుష్కలంగా వుండేలా చూడడానికి కేంద్రంలోని పాలకులు సహకరించడం లేదు. ప్రాజెక్టులకు అవసరమైనన్ని నిధులు సమకూర్చడం లేదు. ఈ పరిస్థితి మారనంత కాలం రైతు ఆకాశం వంక ఆశగా చూసి నిరాశకు గురి కావడం తప్పదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News