దుబాయ్: ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్లు విఫలమయ్యారు. శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, హార్థిక్ పాండ్యా మినహా మిగితా వారందరూ స్వల్ప స్కోర్‌కే పరిమితమయ్యారు. దీంతో భారత్, కివీస్‌కు 250 పరుగుల స్వల్ప లక్ష్యన్ని ముందుంచింది.
ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాట్ హెర్నీ బౌలింగ్‌లో శుభ్‌మాన్ గిల్(2) ఎల్‌బిడబ్ల్యూగా పెవిలియన్ చేరగా.. జెమిసన్ బౌలింగ్‌లో విల్ యంగ్‌కి క్యాచ్ ఇచ్చి రోహిత్ శర్మ(15) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ(11) మ్యాట్ హెర్నీ బౌలింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఈ దశలో కష్టాల్లోపడిన జట్టుకు శ్రేయస్ అయ్యర్, అక్సర్ పటేల్‌ల జోడీ అండగా నిలిచింది. నాలుగో వికెట్‌కి వీరిద్దరు కలిసి 98 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ఈ క్రమంలో శ్రేయస్ అర్థశతకం కూడా సాధించాడు. కానీ, ఆ తర్వాత కొంత సమయానికే అక్సర్ రవీంద్ర బౌలింగ్‌లో అక్సర్ పటేల్(42) విలియమ్‌సన్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కొంత సమయానికే శ్రేయస్(79) పెవిలియన్ బాటపట్టాడు.
ఈ క్రమంలో క్రీజ్‌లోకి వచ్చిన హార్థిక్ పాండ్యా.. పరుగు సాధించేందుకు తన వంతు కృషి చేశాడు. కివీస్ బౌలర్లను ధీటుగా ఎదురుకుంటూ.. 4 ఫోర్లు, 2 సిక్సులతో 45 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. కివీస్ బౌలింగ్‌లో హెర్నీ 5, జెమీసన్, ఓరోర్‌కే, శాంట్నర్, రవీంద్ర తలో వికెట్ తీశారు.