Sunday, December 22, 2024

కెనడాకు భారత్ అల్టిమేటం

- Advertisement -
- Advertisement -

ఈ నెల10లోగా దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాలని డెడ్‌లైన్

న్యూఢిల్లీ: ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యకేసులో భారత్, కెనడాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్‌లో వారి దౌత్య కార్యాలయ సిబ్బంది సంఖ్యను తగ్గించుకోవాలని కెనడాకు భారత ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 10లోగా దాదాపు 40 మంది దౌత్య సిబ్బందిని వెనక్కి పిలిపించుకోవాలని ఒట్టావాకు చెప్పినట్లు సమాచారం.

ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఫైనాన్షియల్ టైమ్స్ కథనం వెల్లడించింది. దౌత్య సిబ్బంది సంఖ్యలో సమానత్వం ఉండాల్సిన అవసరం ఉందని భారత్ గతంలోనూ కెనడాకు సూచించిన విషయం తెలిసిందే. ఇటీవల నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన భారత విదేశాంగ శాఖ .. ఢిల్లీలోని కెనడా దౌత్య వేత్తల అంశాన్నికూడా ప్రస్తావించింది. ఒట్టావాలోని భారత దౌత్య సిబ్బంది సంఖ్యతో పోలిస్తే ఢిల్లీలోని కెనడా దౌత్య సిబ్బంది సంఖ్య చాలా ఎక్కువగా ఉందని,దాన్ని సమస్థాయికి తీసుకురావాలని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.ఈ క్రమంలోనే తాజాగా భారత్.. దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాలని కెనడాకు డెడ్‌లైన్ విధించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఢిల్లీలో కెనడాకు చెందిన 62 మంది దౌత్య సిబ్బంది ఉన్నారు. అందులో 41 మందిని ఒట్టావా వెనక్కి పిలిపించుకోవాలని చెప్పినట్లు సమాచారం. అక్టోబర్ 10లోగా ఈ ప్రక్రియ పూర్తి కావాలని ఢిల్లీ స్పష్టం చేసిందట. ఆ తేదీ తర్వాత కూడా అదనంగా ఉన్న సిబ్బందికి దౌత్యపరమైన రక్షణను తొలగిస్తామని భారత్ హెచ్చరించినట్లు ఆ కథనం వెల్లడించింది. అయితే ఈవార్తలపై అటు కెనడా విదేశాంగ శాఖనుంచి కానీ, ఇటు భారత ప్రభుత్వంనుంచి కానీ ఎలాంటి స్పందనా రాలేదు.

నిజ్జర్ హత్య కేసులో భారత ఏజంట్ల హస్తముందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో ఈ దౌత్యవివాదం రాజుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత రెండు దేశాల మధ్య అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించుకోవాలని అల్టిమేటం ఇవ్వడం వల్ల ఇరు దేశాల మధ్యదౌత్యపరంగా నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడానికి తోడ్పడకపోగా, వివాదం మరింత సంక్లిష్టం చేస్తుందని విదేశీ వ్యవహారాలు, అంతర్జాతీయ వాణిజ్యంపై కెనడా సెనేట్ కమిటీ యైర్మన్ పీటర్ బెహెమ్ వ్యాఖ్యానించినట్లు ఆ పత్రిక పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News