అమెరికా, రష్యా, చైనా వలే ఉండాలనుకోవడంలేదు!
గాంధీనగర్(గుజరాత్): రాష్ట్రీయ స్వయం సేవక్(ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ప్రసంగిస్తూ ‘భారత దేశం తన మతపరమైన విధులను నిర్వర్తించడాన్ని విశ్వసిస్తోందని, అమెరికా, రష్యా, చైనా వలే అధికార దేశంగా ఉండాలని కోరుకోవడంలేదని అన్నారు. “భారత దేశం ఇతరులకు సేవ చేయడాన్ని విశ్వసిస్తుంది, ఈ సంప్రదాయం వేదాల నుండి అనుసరించబడుతోంది. మన దేశం ధర్మబద్ధమైన దేశంగా అభివృద్ధి చెందుతోంది, అభివృద్ధి చెందిన దేశంగా తన మార్గాన్ని సుగమం చేసుకున్నందున దాని మతపరమైన విధులను నిర్వహిస్తోంది” అన్నారు. ‘వేద్ సంస్కృత జ్ఞాన్ గౌరవ్ సమారోహ్’లో ఆదివారం ఆయన ప్రసంగిస్తూ ఈ విషయం చెప్పారు.
అభివృద్ధి చెందిన దేశాలు ఒకదానిపై మరొకటి ఆధిక్యాన్ని చాటుకునేందుకు ప్రయత్నిస్తాయని, ఒకప్పుడు సోవియట్ యూనియన్ సూపర్ పవర్‌గా ఉండేది. దానిని అమెరికా అధిగమించింది. ఇప్పుడు చైనా అమెరికాను మించిపోవాలని చూస్తోంది. రష్యా, అమెరికాలు ఉక్రెయిన్‌ను ఓ పావుగా వాడుకుంటున్నాయని భగవత్ అన్నారు. తనతో ఎలాంటి సంబంధాలు ఉన్నా ఇండియా మాత్రం ఇతర దేశాలకు సాయపడిందన్నారు.
‘ఉక్రెయిన్ వంటి దేశాలకు ఇండియా సాయం చేయాలనుకుంటోంది. ఇది మన దేశ వైఖరి’ అని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ అన్నారు. భారత విదేశాంగ విధానాన్ని ఆయన కొనియాడారు. ఇదివరలో ఇండియా ఇలాంటి వైఖరిని అనుసరించేది కాదన్నారు. “ శ్రీలంక ఎప్పుడూ చైనా, పాకిస్థాన్ దేశాల వైపు మొగ్గేది. తమ ఆంతరంగిక వ్యవహారాలలో ఇండియాను దూరంగా ఉంచేది. నేడు శ్రీలంకను ఇండియానే ఆదుకుంటోంది. మనం ఎప్పుడూ ఇతర దేశాల సంక్షోభాన్ని మనకు అనుకూలంగా మలచుకోలేదు’ అన్నారు. ఆయన ఇంకా నేడు ఇండియా తన ఆధ్యాత్మిక నమ్మకాలతో ముందుకు పోతోంది, మతం కోసం దేశం పోరాడుతోంది. ఈ విషయంలో ఏ దేశాన్ని తనకు అనుకూలంగా చేసుకోదు’ అన్నారు.
‘సైన్స్ మతాన్ని పట్టించుకోదు. కృత్రిమ మేధస్సు రేపటి రోజున మానవుల స్థానాన్ని తీసుకుంటాయని భయపడుతున్నారు. మనుషులను సైన్స్ బయోలజికల్ యానిమల్స్ అని భావిస్తుంది. కానీ మతం అలా అనుకోదు’ అన్నారు.