Monday, December 23, 2024

‘దేశద్రోహం’పై దోబూచులాట

- Advertisement -
- Advertisement -

ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ‘దేశద్రోహం’ నేరం మోపే వలసవాద చట్టంతో దోబూచులాడుతోంది. భారత శిక్షాస్మృతిలోని 124ఎ సెక్షన్ ప్రకారం ‘దేశద్రోహం’ నేరం మోపే చట్టాన్ని రాజకీయ ప్రత్యర్థుల పైనే ఎక్కువగా ప్రయోగిస్తున్నారు. మోడీ అధికారం చేపట్టినప్పటి నుంచి ‘దేశ ద్రోహం’ నేరం కింద నమోదైన కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. స్వాతంత్య్ర సమరయోధులను సైతం నిర్బంధించి, జైళ్ళలో పెట్టిన ఈ వలసవాద చట్టం కొనసాగింపుపై తమ అభిప్రాయాన్ని చెప్పమని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది. కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని చెప్పడాన్ని వాయిదా వేస్తూ, భిన్నాభిప్రాయాలతో దోబూచులాడుతోంది.వలసవాద చట్టాన్ని కొనసాగించడానికే పిల్లిమొగ్గలు వేయడం మొదలు పెట్టింది.

రాజ్యాంగంలోని 19(1) అధికరణం కల్పించిన భావప్రకనా స్వేచ్ఛను, 21వ అధికారణం కల్పించిన జీవించే హక్కును, 14వ అధికరణం కల్పించిన సమానత్వపు హక్కును భారత శిక్షాస్మృతిలోని 124ఎ హరించి వేస్తోంది. ‘దేశద్రోహం’ నేరం మోపే ఈ వలస వాద చట్టం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను హరించేలా, రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ఉందని, దీన్ని రద్దు చేయాలని కోరుతూ రిటైర్డ్ ఆర్మీ మేజర్ జనరల్ ఎస్.జి. ఓంభక్తార్, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ శౌరి తదితరులతో పాటు ఎడిటర్స్ గిల్డ్, పియుసిఎల్, అస్సాం జర్నలిస్టు యూనియన్‌లు గత ఏడాది జులైలో సుప్రీంకోర్టులో అఫిడవిట్‌లు దాఖలు చేశాయి. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు దాటుతున్నా ఈ వలసవాద చట్టాన్ని కొనసాగించడంలో ఉన్న ఔచిత్యంపై సుప్రీంకోర్డు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ ఆధ్వర్యంలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమాకోహ్లీలతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దీనిపై విచారించడానికి ఏడుగురు సభ్యుల రాజ్యాంగ విస్తృత ధర్మాసనానికి నివేదించడంపై మీ అభిప్రాయం ఏమిటో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ‘దేశద్రోహం’ నేరం మోపే చట్టాన్ని కొనసాగించమని సూటిగా కోరితే, అత్యున్నత న్యాయస్థానమే విచారించి దాన్ని రద్దు చేస్తే పరువుపోతుంది. ఈ చట్టాన్ని రద్దు చేయమని కోరితే, రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడం ఎలా? అన్న సందిగ్ధంలో కేంద్ర ప్రభుత్వం పడిపోయింది.దాంతో కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని చెప్పకుండా వాయిదా వేస్తూ వచ్చింది. సుప్రీంకోర్టు చివరికి దీన్ని తీవ్రంగా పరిగణించి, మీ అభిప్రాయం తెలియచేయడానికి మే 5వ తేదీ చివరి అవకాశంగా ఇస్తున్నామని, ఆ రోజే చివరి సారిగా మీ అభిప్రాయాన్ని వింటామని ఏప్రిల్ 27న హెచ్చరించింది. దాంతో విధిలేక కేంద్ర ప్రభుత్వం మరింత సమయం కావాలని కోరింది. తన అభిప్రాయాన్ని ఈ నెల 7వ తేదీన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ద్వారా సుప్రీంకోర్టు ధర్మాసనానికి తన నివేదికను సమర్పించింది.

కేదార్‌నాథ్ సింగ్, బీహార్ ప్రభుత్వానికి మధ్య అరవై ఏళ్ళ క్రితం జరిగిన కేసులో ఈ ‘దేశద్రోహం’ నేరం ‘మంచి చట్టం’ అని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యానించడాన్ని గుర్తు చేస్తూ తాము ఆ తీర్పునకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ నివేదికను కాను అగర్వాల్ ఆధ్వర్యాన ఏర్పడిన కేంద్ర ప్యానల్ తయారు చేసింది. దీనిపైన సుప్రీంకోర్టు ధర్మాసనం 10వ తేదీ చర్చించడానికి సిద్ధమవుతుండగా ముందు రోజు 9వ తేదీన దానికి భిన్నంగా మరొక అఫిడవిట్ దాఖలు చేసి పిల్లిమొగ్గ వేసింది. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచన ప్రకారం ‘ఆజాదీ అమృతో త్సవ్’ కార్యక్రమంలో భాగంగా కాలం చెల్లిన వలసవాద చట్టాలను పునః సమీక్షించదలిచామని తెలిపింది. సుప్రీంకోర్టు ‘దేశద్రోహం’ నేరం మోపే చట్టాన్ని పరిశీలించవద్దని, ఈ చట్టాన్ని సవాలు చేస్తూ వేసిన రిట్‌లను పరిగణనలోకి తీసుకోవద్దని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును తాజాగా కోరింది. రాజ్యాంగబద్ధ సాధికారిక సంస్థతో ఈ ‘దేశద్రోహ’ నేరం మోపే చట్టాన్ని సమీక్షిస్తామని చెప్పింది. పౌరహక్కులపైనా, మానవ హక్కులపైనా తమకు గౌరవం ఉందని, కనుక దేశ సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ ఉద్దేశంతోనే భారత శిక్షాస్మృతిలోని 124ఎ ని పునః సమీక్షించి, పునరుద్ధరించదలిచినట్టు పేర్కొంది. దీంతో సుప్రీంకోర్టు సందిగ్ధంలో పడిపోయింది.

ఈ చట్టం కింద ఎవరిపైనైనా కేసు పెడితే నిందితుడికి బెయిల్ కూడా లభించదు. నేరం రుజువైతే మూడేళ్ళ నుంచి, యావజ్జీవ కారాగార శిక్ష వరకు పడవచ్చు. చట్టవ్యతిరేక చర్యలు నిరోధక చట్టం (యుఎపిఎ), భద్రతా బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఎఎస్‌ఎస్‌పిఎ) కంటే కూడా ఈ ‘దేశద్రోహం’ నేరం మోపే చట్టం చాలా బలమైంది, దుర్మార్గమైంది. మోడీ నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం నిజంగా రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నట్టయితే ఈ చట్టాన్ని చీటికి మాటికీ ఎందుకు ఉపయోగిస్తోంది!? కేంద్ర హోం శాఖ, నేషనల్ క్రైం రికార్డు బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) రికార్డుల ప్రకారం ప్రధానిగా మోడీ అధికారం చేపట్టినప్పటినుంచి ‘దేశద్రోహ’ నేరం మోపే కేసులు పెరిగాయి. ఈ చట్టం కింద కేసులు 2010 నుంచి 10,938 మంది పైన పెట్టగా వీటిలో 65 శాతం కేసులు కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక పెట్టినవే. ప్రతిపక్ష రాజకీయ నాయకులు, విద్యార్థులు, రచయితలు, విద్యావేత్తలపైనే ఎక్కువగా ‘దేశ ద్రోహం’ కేసులు పెట్టారు.

కొన్ని కేసులు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. గత ఏడాది టి 20 క్రికెట్ మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలుపు సంబరాలను సోషల్ మీడియాలో జరుపుకున్నందుకు ఇద్దరు కశ్మీరీ యువకులపై ‘దేశద్రోహం’ నేరం కింద కేసులు పెట్టారు. ప్రధాని నరేంద్ర మోడీని, ఆర్‌ఎస్‌ఎస్‌ను, మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌ను సోషల్ మీడియాలో విమర్శించినందుకు ఇంఫాల్ కు చెందిన కిషోర్ చంద్రదేవ్ వాంఖేవ్‌ుపై ‘దేశద్రోహం’ కేసు పెట్టారు. కర్ణాటకలో ఓ పిల్లవాడు 2020లో పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎగతాళి చేస్తూ ఆడుకుంటున్నాడని ఆ పిల్లవాడిని పోలీసులు ప్రశ్నించి అతని తల్లిపైన ‘దేశ ద్రోహం’ కేసు పెట్టారు.

బెంగళూరుకు చెందిన విద్యార్థిని దిశరవిని పోలీసులు ఇంటి నుంచి ఢిల్లీ తీసుకెళ్ళి ‘దేశద్రోహం’ నేరం కింద కేసు పెట్టారు. ఆందోళన చేస్తున్న రైతులకు సంబంధించిన టూల్ కిట్‌ను దిశరవి వ్యాపింప చేస్తోందని వారి ఆరోపణ. జెఎన్‌యు విద్యార్థి కన్హయ కుమార్ జైలు నుంచి విముక్తి కావాలని కోరినవారిపై ‘దేశద్రోహం’ కేసు పెట్టారు. రైతుల ఆందోళనకు మద్దతు తెలపడం కూడా ‘దేశం ద్రోహం’ అయిపోయింది. ప్రధాని నరేంద్ర మోడీని కానీ, ఇతర బిజెపి నాయకులను కానీ, వారి మాతృ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ను కానీ విమర్శిస్తే ‘దేశ ద్రోహం’ అయిపోతోంది. అదే గాంధీ జీని అవమాన పరిస్తే, ‘దేశ భక్తి’ అయిపోతోంది. మహాత్ముడిని హత్య చేసిన గాడ్సేని కీర్తిస్తే అదీ ‘దేశభక్తి’ అయిపోతోంది. ‘దేశభక్తి’ , ‘దేశద్రోహం’ అన్న పదాలకు అర్థాలు తారుమారైపోతున్నాయి. ‘దేశమంటే మనుషులో య్’ అన్న గురజాడ మాటలు కాకుండా, ‘దేశం అంటే నేనే’ అన్న ఫ్రాన్స్‌ను పాలించిన పద్నాల్గవ లూయీ మాటలు మోడీ ప్రభుత్వానికి అనుసరణీయమయ్యాయి.గడిచిన దశాబ్ద కాలంలో రాజకీయ నాయకులను విమర్శించినందుకు 405 మంది పైన పెట్టిన ‘దేశద్రోహ’ కేసుల్లో 95 శాతం మోడీ అధికారంలో కొచ్చాక పెట్టినవే. వీటిలో 149 కేసులు మోడీని విమర్శించినందుకు పెట్టినవి కాగా, 144 కేసులు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ను విమర్శించినందుకు పెట్టినవే. ‘దేశ ద్రోహం’ కేసులు ప్రతి ఏడాది 28 శాతం చొప్పున పెరిగిపోతున్నాయి. అత్యధికంగా ఈ కేసులు పెట్టిన 5 రాష్ట్రాలలో 4 బిజెపి పాలిత రాష్ట్రాలే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో 115, జార్ఖండ్‌లో 62, కర్ణాటకలో 50, బీహార్‌లో 168, తమిళనాడులో 139 కేసులు నమోదయ్యాయి.బిజెపి అధికారంలోకి వచ్చిన తొలి అయిదేళ్ళలో(201419) మొత్తం 326 ‘దేశద్రోహ’ కేసులకు గాను కేవలం 141 కేసుల్లో మాత్రమే చార్జిషీటు దాఖలు చేశారు. వీటిలో అయిదుగురికి మాత్రమే శిక్షపడింది. ఈ లెక్కలను బట్టి కేవలం తమకు గిట్టని వారిపైనా, రాజకీయ ప్రత్యర్థులపైనా ‘దేశ ద్రోహం’ కేసులు పెట్టి వేధిస్తున్నారని స్పష్టమవుతోంది. వివిధ ప్రభుత్వాలు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేశాయి. ఈ దుర్వినియోగంలో మోడీ ప్రభుత్వం అగ్రభాగాన నిలిచింది.
పదిహేడవ శతాబ్దంలో ఇంగ్లాండులో తయారైన ఈ ‘దేశద్రోహం’ చట్టం పన్నెండేళ్ళ క్రితం ఆ దేశంలో రద్దయినా, వలస పాలకులు మన దేశాన్ని విడిచిపెట్టి 75 ఏళ్ళు దాటుతున్నా ఈ వలస చట్టం మాత్రం మన దేశంలో కొనసాగుతోంది. స్వాతంత్య్ర సమరయోధుడు బాలగంగాధర్ తిలక్ పైైన బ్రిటిష్ ప్రభుత్వం 1897లో ఈ చట్టం కింద కేసు పెట్టడంతో 18 నెలలు జైలు శిక్షపడింది. ఆ తర్వాత ఈ చట్టం కింద గాంధీ జీపైన కేసు పెట్టడంతో ఆరేళ్ళు శిక్షపడి రెండేళ్ళకు విడుదలయ్యారు. స్వాతంత్య్రానంతరం కూడా కొనసాగుతున్న ఈ ‘దేశద్రోహం’ నేరం మోపే భారత శిక్షాస్మతిలోని 124ఎ చట్టం బిజెపి పాలనలో మరింత రాటుదేలి దుర్మార్గంగా తయారైంది. ఈ చట్టాన్ని పునః సమీక్షించి, పునరుద్ధరిస్తామని, పౌరహక్కులపైనా, మానవహక్కులపైనా తమకు గౌరవం ఉందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన తాజా నివేదికలో పేర్కొనడం కౄర జంతువులు శాంతి వచనాలను వల్లించినట్టుంది.

రాఘవశర్మ
9493226180

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News