ఏది బాగుంది కనుక ఇదొక్కటే భ్రష్టుపట్టిపోయిందని ప్రత్యేకించి బాధ పడడానికి? 2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధిరేటు మైనస్ 7.3 అని తెలిసినప్పుడు ఇలాంటి నిరాశాపూరిత అభిప్రాయం కలుగుతుంది. కొవిడ్ వరుసగా రెండు బీభత్సావతారాలు ఎత్తి ప్రజల ప్రాణాలను అవలీలగా కబళిస్తుంటే ముందస్తు వ్యూహ రచన లేకపోయినా, సకాలంలోనైనా సరిగ్గా స్పందించక ప్రమత్తత చిత్తగించిన పాలకుల వల్ల దేశానికి అపూర్వమైన కల్లోలం దాపురించింది. వరుస లాక్‌డౌన్లు, నిరుద్యోగం, అధిక ధరలు, సకల నిరాశామయమైన వాతావరణంలో వృద్ధిరేటు కుంచించుకుపోడం వింత కాదు. అయితే అంతకు ముందు నుంచి ఉన్న ఈ పతనావస్థ లాక్‌డౌన్ల వల్ల తిరిగి కోలుకోలేని స్థితిలోకి కూరుకుపోడమే ఆందోళనకరం. వృద్ధిరేటు ఒక ఏడాది మొత్తంలో ఇంతగా పడిపోడం గత నాలుగు దశాబ్దాల్లో ఇదే మొదటిసారి. ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి చెప్పుకోదగిన చర్యలేవీ తీసుకోకపోడం కూడా ఇందుకు ఒక ముఖ్యకారణమని స్పష్టపడుతున్నది. గత ఏడాది మార్చి చివరి వారంలో విధించిన సుదీర్ఘ లాక్‌డౌన్ వల్ల ఆ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో మైనస్ 23 వ్యతిరేక వృద్ధిని ఆర్థిక వ్యవస్థ చవిచూసింది.
ఆ తర్వాత జులైలో లాక్‌డౌన్‌ను ఎత్తేసినప్పటికీ స్వస్థత పూర్తిగా సమకూరలేదు. ఇందుకు కారణం మార్కెట్‌లో డబ్బు పెట్టి ఉత్పత్తులను కొనుగోలు చేయగల వర్గాల జనం జేబులు పూర్తిగా ఖాళీ అయిపోడమే. 2020 -21 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో అన్నీ తెరుచుకున్నప్పుడు సైతం నమోదయిన వృద్ధిరేటు 1.6 శాతమే. ఆర్థిక వ్యవస్థ దీర్ఘ రోగగ్రస్థమై ఇప్పట్లో లేవలేనంతగా మంచం పట్టిపోయిందని దానితోనే రుజువైపోయింది. అంతకు ముందు ఏడాది (2019-20) లో నమోదైన 4 శాతం వృద్ధిరేటు సైతం స్వల్పమైనదేనని, అది అప్పటికి 11 ఏళ్లలో ఎన్నడూలేని పతనమని నిపుణులు పెదవి విరుస్తున్నారు. అందుచేత ప్రస్తుత ఆరోగ్య సంక్షోభం అంతమైన తర్వాత కూడా చెప్పుకోదగినంత పైచూపును ఆశించలేమని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత సెకండ్ వేవ్ ముగిసిపోయినా ముక్కుపచ్చలారని చిన్నారులను కబళించే కొవిడ్ మూడో కెరటం పొంచి ఉన్నదని వస్తున్న సమాచారం, ఇప్పటికే అసంఖ్యాకంగా బాలలు దాని బారిన పడుతున్నారని వెలువడుతున్న వార్తలు ఈ ఆరోగ్య ప్రళయం ముగిసిపోడానికి ఇంకెంతో కాలం పట్టవచ్చునని, ఆర్థిక మూసివేత మరింత తీవ్రమైనా ఆశ్చర్యపోనక్కరలేదని అనిపిస్తున్నది.
అందుచేత ఊబిలో కూరుకుపోయిన ఆర్థికాన్ని తట్టి కుదిపి, పట్టి లేపి పరుగులెత్తించడానికి కేంద్ర పాలకులు బలవర్థకమైన టానిక్ తాగించాల్సిందేనని సూచిస్తున్నారు. పెద్దనోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అవకతవక అమలు వల్ల అంతకు ముందే వెన్నెముక విరిగిపోయిన చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు లాక్‌డౌన్లతో పూర్తిగా మూతపడి వాటి నిర్వాహకులు, సిబ్బంది ఆదాయాలను, ఉద్యోగాలను నష్టపోయారు. నిరుద్యోగం పెరుగుదల రేటు గత నెలలో ఒక్కసారిగా 11.9 శాతానికి ఎగబాకిందని సిఎంఐఇ (భారత ఆర్థిక పర్యవేక్షక కేంద్రం) తెలియజేసింది. ఏప్రిల్‌లో 7.97 శాతం వద్ద ఉన్న ఈ రేటు మే నెలలో ఇంతగా పెరిగిపోడం ఆందోళనకరం. పట్టణ, గ్రామీణ నిరుద్యోగాలు రెండూ ఒకే మాదిరిగా విజృంభించాయి. కుటుంబ ఆదాయాలు గణనీయంగా పెరిగి ప్రజల్లో ఉత్సాహం పుంజుకుంటే తప్ప వృద్ధి తిరిగి కోలుకోడం కష్టమని సిఎంఐఇ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సాలీనా రూ. 5 నుంచి 10 లక్షలు, అంతకు మించిన ఆదాయవర్గాలు పెట్టే ఖర్చు పెరగాలన్నారు.
సంవత్సరానికి రూ. 10 లక్షలు అంతకు మించి సంపాదించుకునే వారి రాబడి 2020 డిసెంబర్‌తో అంతమైన మూడు మాసాల కాలంలో అంతకు ముందటేడాది అదే కాలంతో పోల్చుకుంటే 14.5 శాతం పడిపోయింది. కార్లు, బైక్‌లు సహా అన్ని ఆధునిక జీవనోపకరణాలను పెద్ద ఎత్తున కొనగల సత్తా ఈ వర్గానికే ఉంటుంది. లాక్‌డౌన్ వల్ల అన్ని పట్టణాలు, నగరాల్లోని పారిశ్రామిక, వ్యాపార కార్యకలాపాలు స్తంభించిపోయాయి. పర్యవసానంగా ఎంత మంది ఎంతెంత దుర్భర ఆర్థిక బాధలు ఎదుర్కొంటున్నారో చెప్పనలవి కాదు. ఈ నేపథ్యంలో దేశంలో నగల తాకట్టులు కూడా పెరిగిపోయాయంటున్నారు. ధరల సంగతి ప్రత్యేకించి చెప్పుకోనక్కర లేదు. వంట నూనెల ధరలు రెట్టింపై చాలా కాలమైంది. నిరుద్యోగ సర్పం ఇలా బుసకొట్టడం గోరుచుట్టు మీద రోకటి పోటును తలపిస్తున్నది. ఈ పరిస్థితుల్లో ప్రజల జేబుల్లోకి నేరుగా నగదును చేర్చే మార్గాలను తెరవవలసిన అగత్యాన్ని గురించి ఆర్థికవేత్తలు పదేపదే సూచిస్తున్నారు. విశేష జనాభాకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించే చిన్న, మధ్యతరహా కంపెనీలు తిరిగి నిలదొక్కుకునేలా చేయడానికి తగిన ఊతం ఇవ్వాలని, ప్రభుత్వ వ్యయాన్ని పెంచాలని, గ్రామీణ ఉపాధి హామీ వంటి మరి కొన్ని పథకాలను ప్రవేశపెట్టక తప్పదని సలహా ఇస్తున్నారు. కేంద్ర పాలకులు ఇప్పటికైనా మేలుకొని వీటిపై దృష్టి సారించాలి.