న్యూఢిల్లీ : ప్రపంచం మొత్తం మీద 2020లో భారత దేశంలో నెలలు నిండని కాన్పులు అత్యధికంగా దాదాపు 3.02 మిలియన్ వరకు జరిగాయని , ప్రపంచం మొత్తం ముందస్తు కాన్పుల్లో ఇవి 20 శాతం కన్నా ఎక్కువ చూపిస్తున్నాయని ది లాన్సెట్ జర్నల్‌లో వెల్లడైన అధ్యయనం వివరించింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్లుహెచ్‌ఒ) , యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్‌ఫండ్ ( యునిసెఫ్) , లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిస్ (యుకె) కు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. 2020లో ముందస్తు జననాల్లో 50 శాతం కన్నా ఎక్కువ కేవలం ఎనిమిది దేశాల్లోనే సంభవించాయని ఈ అధ్యయనం పేర్కొంది. ఈ కాన్పుల్లో పాకిస్థాన్, నైజీరియా, చైనా, ఇథియోపియా, బంగ్లాదేశ్, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో,
అమెరికా తదితర దేశాల సరసన భారత్ ఉందని అధ్యయనం వివరించింది. అత్యధిక జనాభా, ఎక్కువ మొత్తంలో జననాలు, బలహీనమైన ఆరోగ్యవ్యవస్థలు, ఎక్కువ నాణ్యత లేని కుటుంబ సంక్షేమం శస్త్ర చికిత్సలు, ప్రసవానికి ముందు సంరక్షణ, ప్రసవ వైద్య సేవల లోపం, తదితర అనేక లోపాలు ఈదేశాల్లో ప్రతిబింబిస్తున్నాయని అధ్యయనం పేర్కొంది. 2020లో ప్రపంచ వ్యాప్తంగా నెలలు నిండక ముందే జరిగిన జననాలు 13.4 మిలియన్ల వరకు ఉండగా, వీటిలో ఒక మిలియన్ వరకు ముందస్తు ప్రసవ సమస్యలతో చనిపోయారని అధ్యయన రచయితలు పేర్కొన్నారు. ప్రతి పదిమందిలో ఒకరు 37 వారాల కన్నా ముందు జన్మించారన్న డేటాతో ఇది సమానమని తెలిపారు. దీన్ని బట్టి వైద్య ఆరోగ్యభద్రత ముఖ్యంగా ప్రసూతి ఆరోగ్యం, పోషణ పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచిస్తోందని పేర్కొన్నారు.