న్యాయవ్యవస్థ లోని న్యాయమూర్తులంటే ధర్మరక్షకులు అన్న నమ్మకం ప్రజలకు ఉంటుంది. అయితే కొందరి న్యాయమూర్తుల తీరు వివాదాస్పదం కావడం న్యాయవ్యవస్థకే తీరని అప్రతిష్టలను తెచ్చిపెడుతుంది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్‌వర్మ నివాసంలో జరిగిన అగ్నిప్రమాదంలో కరెన్సీ నోట్ల కట్టలు కాలి ఉన్నాయని వార్తలు రావడం పెద్ద దుమారం రేపుతోంది. సుప్రీం కోర్టు వెబ్‌సైట్‌లో కూడా ఈ వీడియో ఉండడం గమనార్హం. ఇదంతా అబద్ధమని, కొందరు పన్నిన కుట్ర అని సంబంధిత న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ సంజాయిషీ ఇస్తున్నారు. అయితే ఈ సంఘటనకు సంబంధించి కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నెల 14 వ తేదీ అర్ధరాత్రిన వర్మ నివాసంలో అగ్నిప్రమాదం జరగ్గా కరెన్సీ కట్టలు కాలిపోవడం గురించి 21 వ తేదీ వరకు మీడియా బయటపెట్టే వరకు అధికారికంగా ఎందుకు వెల్లడించలేదో అర్ధం కావడం లేదు. పోలీస్ విభాగం, అగ్నిమాపక అధికార యంత్రాంగం దీనిపై ఏం మాట్లాడడం లేదు.
అసలు కరెన్సీ కట్టలు కాలిపోవడం గురించి చెప్పకుండా మరేదో కథనాలు వెల్లడిస్తున్నారు. ప్రాథమికంగా విచారణ చేపట్టిన ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా మాత్రం జడ్జి ఇంటి ఆవరణలో సగం కాలిన నోట్లు, ఇతర శిథిలాలను తర్వాత రోజు తొలగిస్తున్న దృశ్యాలను ఆధారాలతో సహా చీఫ్ జస్టిస్ డికె ఉపాధ్యాయకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. జస్టిస్ యశ్వంత్ వర్మపై అంతర్గత విచారణ నిర్వహిస్తున్నామని సుప్రీం కోర్టు మొదట చెప్పింది. తరువాత విధులకు దూరంగా ఆయన ఉంటారని పేర్కొంది. ఆ తరువాత అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తున్నామని ప్రకటించింది. అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ దీనికి అభ్యంతరం లేవదీస్తోంది. జస్టిస్‌వర్మను తమ కోర్టుకు బదిలీ చేయరాదని ఆందోళన చేస్తోంది. వర్మ నివాసంలో లెక్కలేనన్ని కరెన్సీ నోట్లు బయటపడిన నేపథ్యంలో వర్మ గతంలో ఇచ్చిన తీర్పులన్నీ మరోసారి విచారించాలన్న వాదన ఎక్కువగా తెరమీదకు వస్తోంది. కరెన్సీ కట్టల ఉదంతంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేలా ఢిల్లీ పోలీసులను ఆదేశించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది.
హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులపై ఎలాంటి నేర విచారణ జరపకూడదన్న 1991 నాటి సుప్రీం కోర్టు తీర్పును సవాల్ చేస్తూ అడ్వకేట్ మాథ్యూస్ నెడుంపారా తదితరులు కేసు వేశారు. ఈ తీర్పు న్యాయవ్యవస్థ జవాబుదారీ తనాన్ని ప్రశ్నార్థకం చేస్తోందని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులపై కేసు నమోదుకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందస్తు అనుమతి కావాలన్న నిబంధనను తొలగించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. జస్టిస్ వర్మ కరెన్నీ నోట్ల ఉదంతం పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ప్రకంపనలు సృష్టించింది. ఈ అంశంపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. ప్రజాస్వామ్యంలో పారదర్శకతకు ప్రాధానం ఇచ్చే న్యాయవ్యవస్థలో ఇలాంటి అవినీతి ఆరోపణలు ముసురుకోవడం ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది, సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల్లో 50 శాతం మంది అవినీతిపరులే అని సుప్రీం కోర్టు న్యాయమూర్తి మార్కండేయ కట్టూ గతంలో వ్యాఖ్యానించడం ఈ సందర్భంగా ప్రస్తావించవలసి ఉంది.
అలహాబాద్ హైకోర్టులోని న్యాయమూర్తుల్లో అవినీతికి పాల్పడుతున్న వారి వివరాలను బయటపెట్టడానికి ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. జస్టిస్‌వర్మ కూడా అలహాబాద్ హైకోర్టులో పనిచేసినప్పుడు ఒక ప్రయివేట్ సుగర్ మిల్లు యాజమాన్యంతో కుమ్మక్కయి ఒక ప్రయివేట్ బ్యాంకు రుణాల భాగోతంలో పాలు పంచుకున్నారని ఆరోపణలు 2018 లో వచ్చాయి. ఆనాడు అలహాబాద్ హైకోర్టు కూడా జస్టిస్ వర్మపై విచారణకు పూనుకుంది. ఈ కారణం వల్లనేమో జస్టిస్ వర్మ భాగోతం తెలిసిన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌వర్మను తమ వద్దకు బదిలీ చేయరాదన్న డిమాండ్‌తో ఆందోళన సాగిస్తున్నారు. ఈ సంఘటన తనను ఎంతగానో బాధపెట్టిందని ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్, జగ్‌దీప్ ధన్‌ఖడ్ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ అంశంపై చర్చించడానికి పార్టీల ఫ్లోర్‌లీడర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొలీజియమ్ వ్యవస్థ లోని లోపాలను తీర్చిదిద్దడానికి జాతీయ న్యాయనియామకాల కమిషన్ (ఎన్‌జెఎసి)చట్టాన్ని తిరిగి అమలు లోకి తీసుకురావలసిన అవసరాన్నిప్రస్తావించారు.
కార్య నిర్వాహక , న్యాయవ్యవస్థ, శాసనసభలు ఒకదానికొకటి వ్యతిరేకంగా పోటీ పడుతున్నట్టు భావించరాదని సూచించారు. న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో కార్యనిర్వాహక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత కల్పించే ఈ చట్టాన్నిపార్లమెంట్ ఉభయ సభలూ 2014 లో దాదాపు ఏకగ్రీవంగా ఆమోదించినా 2015లో సుప్రీం కోర్టు కొట్టివేసింది. న్యాయమూర్తుల నియామకంలో బంధుప్రీతి, పక్షపాతం వంటి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నందున ఎన్‌జెఎసి చట్టాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకువస్తున్నారు. 2018 నుంచి గత ఏడేళ్లలో వివిధ హైకోర్టుల్లో నియామకమైన జడ్జీల్లో 78 శాతం ఉన్నత కులాలకు చెందినవారేనని గత వారం పార్లమెంట్ ఒక ప్రశ్నకు సమాధానం చెప్పడం గమనార్హం.
న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి, ప్రటిష్ఠ దెబ్బతినడానికి కొందరు న్యాయమూర్తుల తీరుతెన్నులే కారణమవుతోంది. పదవీ విరమణ తరువాత న్యాయమూర్తులు మరే పదవిని ఆశించరాదని 1958 లోనే లా కమిషన్ సూచించినప్పటికీ ఆ సూచనలు బేఖాతరు అవుతున్నాయి. జస్టిస్ రంజన్ గగోయ్ తన పదవీ విరమణ కాగానే రాజ్యసభ పదవి వరించింది. అలాగే జస్టిస్ అబ్దుల్ నజీర్ పదవీ విరమణ కాగానే గవర్నర్ అయ్యారు. ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే న్యాయవ్యవస్థ పై ప్రజల్లో , న్యాయార్థుల్లో ఎంతవరకు పారదర్శకత, నమ్మకం, గౌరవం కలుగుతుందో ఆలోచించాల్సిందే !