నయా వాయుసేన దిశలో
న్యూఢిల్లీ : మానవ రహిత యుద్ధ విమానాన్ని భారతదేశం తొలిసారిగా గగనమార్గంలో విజయవంతంగా పరుగులు తీయించారు. భారత వాయుసేనకు ఇది మరో బలమైన ఆయుధం అవుతుంది. దేశ రక్షణ రంగపు కీలక సంస్థ డిఆర్‌డిఒ ఈ స్వయంచలిత, పైలెట్ రహిత విమాన సమర్థతను కర్నాటకలోని చిత్రదుర్గ వైమానిక స్థావరం వైమానిక పరీక్ష కేంద్రం నుంచి శుక్రవారం పరీక్షించారు. ఈ విషయాన్ని డిఆర్‌డిఒ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు వైమానిక రంగంలో అత్యంత అధునాతన సాంకేతికను వాయుసేనల బలోపేతానికి గీటురాయిగా ఖరారుచేసుకుంటున్నారు. ఈ దిశలో దేశంలో ఇటువంటి మానవరహిత యుద్ధ విమానం తయారీ దీనిని విజయవంతంగా పరీక్షించడం ఈ దిశలో భారతదేశానికి ఇదే తొలి ఘట్టం కావడం వంటి అంశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
ఈ విమానంలో ఆటోనమస్ ఫ్లైయింగ్ వింగ్ టెక్నాలజీ ఇమిడి ఉంది. ఈ సాంకేతికత పనితీరును ఇప్పుడు ఈ విమానం ద్వారా పరీక్షించుకున్నారని వివరించారు. డిఆర్‌డిఒ పరిధిలోకి వచ్చే బెంగళూరు కేంద్రపు ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (ఎడిఇ) వేదికగా ఈ ప్రత్యేక యుద్ధ విమానం రూపొందింది. చిన్నపాటి టర్బోఫన్ ఇంజిన్, ఎయిర్‌ఫ్రేమ్, దీనిలోపలి భాగాలు , వైమానిక ఛోదక వ్యవస్థలు అన్నింటిని దేశీయంగానే తయారు చేశారు. వ్యూహాత్మక రక్షణ రంగ సాధనలో ఈ తరహా విమానం కీలక ఆవిష్కరణగా నిలుస్తుంది. తొలిసారి చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతం కావడం పట్ల రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. డిఆర్‌డిఒ సిబ్బందిని అభినందించారు.