కొలంబో: ఆర్థిక సంక్షోభం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న శ్రీలంకలోని రైతులను ఆదుకునే ప్రయత్నాల్లో భాగంగా భారత్ ఆదివారం ఆ దేశానికి 44 వేల టన్నుటకు పైగా యూరియాను అందజేసింది. శ్రీలంకలో భారత హైకమిషనర్ గోపాల్ బాగ్లే శ్రీలంక వ్యవసాయ మంత్రి మహింద అమరవీరను కలిసి 44 వేల టన్నులకు పైగా యూరియా శ్రీలంకకు చేరుకున్నట్లు తెలియజేశారు. తమ దేశం గతంలో ఎన్నడూ లేనంత తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందున ఆహార భద్రత, పర్యావరణ పరిరక్షణ కోసం భారత్ సాయం అందించాలని అమరవీర గత నెల బాగ్లేను కోరారు. కాగా శ్రీలంకలో ప్రస్తుత సాగు సీజన్‌లో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఉండడం కోసం తక్షణం 65 వేల టన్నుల యూరియాను సరఫరా చేస్తామని గత మేలో మన దేశం శ్రీలంకకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరినుంచి భారత్ శ్రీలంకకు వివిధ రూపాల్లో 300 కోట్ల డాలర్లకు పైగా ఆర్థిక సాయాన్ని అందించింది. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తలెత్తిన తర్వాత మన దేశం ఆ దేశానికి ఆహార వస్తువులు, మందులు, ఇంధనం, కిరోసిన్, ఇతర నిత్యావసరాలు సరఫరా చేయడం ద్వారా ఆ దేశాన్ని ఆదుకుంటోంది.
India helps 44k MT of Urea to Sri Lanka