సెమీస్‌లోకి భారత హాకీ జట్టు
క్వార్టర్ ఫైనల్లో గ్రేట్ బ్రిటన్‌పై గెలుపు
పారిస్ : ఒలింపిక్స్‌లో భారత హాకీ టీమ్ అద్భుతంగా రాణిస్తోంది. ఆదివారం ఉత్కంఠగా సాగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ షూటౌట్‌లో 4-2 తేడాతో గ్రేట్ బ్రిటన్‌ను ఓడించింది. దీంతో సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. ఆధ్యాంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో గోల్ కీపర్ శ్రీజేష్ కీ రోల్ పోషించడంతో భారత్ ఘన వవిజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1-1 సమంగా నిలవడంతో షూటౌట్ రౌండ్‌తో ఫలితాన్ని ప్రకటించారు. 22వ నిమిషంలో భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ కౌర్ గోల్ చేయగా.. గ్రేట్ బ్రిటన్ తరఫున లీ మోర్టన్ 27వ నిమిషంలో ఓ గోల్ సాధించాడు.
ఇరు జట్లు హోరాహోరీ..
మ్యాచ్ ఆరంభమే మొదలు ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. దాంతో ఫస్ట్ క్వార్టర్‌లో ఒక్క గోల్ కూడా నమోదు చేయలేకపోయాయి. అయితే సెకండ్ క్వార్టర్‌లో భారత్‌కు బిగ్ షాక్ తగిలింది. భారత ప్లేయర్ అమిత్ రోహిడాస్ రెడ్ కార్డ్‌తో మైదానం వీడాడు. దాంతో భారత్.. మ్యాచ్ ఆసాంతం 10 మందితోనే సాగించింది. రోహిడాస్ మైదానం వీడిన కాసేపటికే భారత్ గోల్ నమోదు చేసింది. 22వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్ సింగ్ అద్భుతంగా గోల్‌గా మలిచాడు. దీంతో భారత్ 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
అయితే ఈ ఆనందం ఎంతోసేపు నిలువలేదు. 5 నిమిషాల వ్యవధిలోనే గ్రేట్ బ్రిటన్ గోల్ నమోదు చేసి భారత్‌తో సమంగా నిలిచంది. 27వ నిమిషంలో లీ మోర్టన్ అద్భుత షాట్‌తో బంతిని గోల్ పోస్ట్‌లోకి తరలించాడు. అనంతరం ఇక గ్రేట్ బ్రిటన్ గోల్ ప్రయత్నాలను భారత కీపర్ శ్రీజేష్ అద్భుతంగా అడ్డుకున్నాడు. దాదాపు 12 గోల్స్ ప్రయత్నాల్లో 11 గోల్స్‌ను అడ్డుకున్నాడు. దాంతో మ్యాచ్ సమయం ముగిసే వరకు ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. దీంతో ఫలితం కోసం షూటౌట్ రౌండ్‌ను ఆడించారు.
షూటౌట్ రౌండ్‌లో ఫలితం..
షూటౌట్‌లో తొలి రెండు ప్రయత్నాల్లో గ్రేట్ బ్రిటన్ గోల్స్ నమోదు చేయగా.. భారత ఆటగాళ్లు హర్మన్‌ప్రీత్, సుఖ్‌జీత్ సమం చేశారు. గ్రేట్ బ్రిటన్ మూడో ప్రయత్నాన్ని శ్రీజేష్ అడ్డుకోగా.. భారత్ నుంచి లలిత్ గోల్ నమోదు చేశాడు. దీంతో భారత్ 3-2తో ఆధిక్యంలో నిలిచింది. అనంతరం నాలుగో రౌండ్‌లోనూ గ్రేట్ బ్రిటన్ గోల్ సాధించలేకపోయింది. ఇప్పటికే ఆధిక్యంలో ఉన్న భారత్ నుంచి రాజ్‌కుమార్ మరో గోల్ నమోదు చేశాడు. దీంతో భారత్ 4-2తో ఘన విజయం సాధించింది. మ్యాచ్‌తో పాటు షూటౌట్‌లో రెండు గోల్స్ అడ్డుకొని శ్రీజేష్ భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా ఈ మ్యాచ్‌లో తొలి గోల్ సాధించిన హర్మన్‌ప్రీత్‌కు ఒలింపిక్స్‌లో ఇది ఏడో గోల్ కావడం విశేషం.