ప్రతిష్ఠాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నమెంట్‌లో పాల్గొనే టీమిండియాను శనివారం ప్రకటించారు. గాయంతో చాలా కాలంగా టీమిండియాకు దూరంగా ఉన్న సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమికి జట్టులో చోటు కల్పించారు. యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌కు ప్రమోషన్ లభించింది. ఈ టోర్నీలో పాల్గొనే జట్టుకు గిల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. గతంలో ఈ బాధ్యతలను నిర్వర్తించిన హార్దిక్ పాండ్య, బుమ్రాలను కాదని గిల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు. హైదరాబాద్ స్టయిలీష్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు జట్టులో స్థానం లభించలేదు. అంతేగాక సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ తదితరులకు చోటు కల్పించలేదు. నలుగురు స్పెషలిస్ట్ ఆల్‌రౌండర్లను జట్టులోకి తీసుకున్నారు. హార్దిక్, అక్షర్, సుందర్, జడేజాల రూపంలో ఆల్‌రౌండర్లకు జట్టులో స్థానం దక్కింది. ఇక ఫాస్ట్ బౌలింగ్ బాధ్యతలను షమితో పాటు బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ మోయనున్నారు.
రిషబ్ పంత్ వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు. కెఎల్ రాహుల్‌కు కూడా జట్టులో స్థానం లభించింది. శ్రేయస్ అయ్యర్ కూడా జట్టుకు ఎంపికయ్యాడు. సీనియర్‌ఆటగాడు విరాట్ కోహ్లికి ఊహించినట్టు మరో అవకాశం దక్కింది. ఫిట్‌నెస్ ఇబ్బందులను ఎదుర్కొంటున్న షమి, బుమ్రాలను కూడా జట్టులోకి తీసుకోవడం గమనార్హం. కెప్టెన్ రోహిత్‌తో కలిసి యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. కాగా, ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ జరుగనుంది. అయితే భారత్ ఆడే మ్యాచ్‌లను యుఎఇలో నిర్వహించనున్నారు. మిగిలిన మ్యాచ్‌లన్నీ పాక్‌లోనే జరుగుతాయి. ఇక సొంత గడ్డపై ఇంగ్లండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో కూడా ఇదే జట్టు బరిలోకి దిగనుంది. ఫిబ్రవరి ఆరు నుంచి 12 వరకు భారత్‌లో వన్డే సిరీస్ జరుగనుంది. ఇదిలావుంటే జట్టు వివరాలను కెప్టెన్ రోహిత్‌తో పాటు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కార్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు.
జట్టు వివరాలు:
రోహిత్ శర్మ (కెప్టెన్),శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్య, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమి, కుల్దీప్ యాదవ్.