న్యూఢిల్లీ: దేశంలో రికార్డు స్థాయిలో వంటనూనెల దిగుమతులు నమోదవుతున్నాయి. 33శాతం పెరిగి వంటనూనెల దిగుమతులు 16.61లక్షల టన్నులకు చేరుకున్నాయి. సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు అధికం కావడంతో నూనె దిగుమతులు పెరిగినట్లు సాలెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది.
సెప్టెంబర్ 2021నుంచి దిగుమతులతో పోలిస్తే ఏడాది జనవరిలో అత్యధికంగా వంటనూనెలు దిగుమతి అయ్యాయని ఎస్‌ఇఎ తెలిపింది. మొత్తం నూనెల దిగుమతులు జనవరిలో 31శాతం పెరిగి రూ.16,61,750టన్నులకు చేరాయని పరిశ్రమ సంఘం వెల్లడించింది. గతేడాది జనవరిలో 12,70,728 టన్నులు నమోదవగా ఈ ఏడాది జనవరిలో 16,61,750టన్నులకు దిగుమతులు పెరిగాయి. రష్యా, ఉక్రెయిన్ దేశాల నుంచి ప్రధానంగా సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి అవుతోంది.
ఈక్రమంలో జనవరిలో పొద్దుతిరుగుడు పువ్వు నూనెల దిగుమతులు 4,61,000టన్నులకు చేరాయి. సాధారణంగా ప్రతి నెల సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు సగటున 1,61,000టన్నులు ఉంటాయి. ఈ జనవరికి మూడురెట్లు దిగుమతులు పెరిగాయి. సన్‌ఫ్లవర్, సోయాబీన్ నూనెల దిగుమతుల ప్రభావం ధరలపై పడుతుందని ఎస్‌ఇఎ తెలిపింది. కాగా, కరెంటు ఆయిల్ ఇయర్ నవంబర్ 2022, జనవరి 2023 కాలంలో వంటనూనెల దిగుమతులు 36,07,612 టన్నుల నుంచి 47,46,290టన్నులకు పెరిగాయి. అయితే ఎగుమతులు 63,549 టన్నుల నుంచి తగ్గాయి.