Friday, November 22, 2024

కార్పొరేట్ల కోసం దిగుమతులు!

- Advertisement -
- Advertisement -

చైనా నుంచి తమ ఆర్థిక వ్యవస్థను విడగొట్టుకోవాలని కోరుకోవటంలేదని అమెరికా వాణిజ్య ప్రతినిధి కాథరీన్ తాయి 2023 ఏప్రిల్ 20న జపాన్ రాజధాని టోకియోలో చెప్పారు. 2022-23లో చైనా నుంచి మన దిగుమతులు 4.16 శాతం పెరగ్గా, ఎగుమతులు 28 శాతం తగ్గినట్లు వాణిజ్య మంత్రిత్వశాఖ ప్రాథమిక సమాచారం వెల్లడించింది. 2022లో చైనా భారత్ వాణిజ్య లావాదేవీలు 136 బిలియన్ డాలర్లు కాగా, చైనా ఎగుమతులు 118, భారత్ ఎగుమతులు 18 బి.డాలర్ల చొప్పున ఉన్నట్లు ముంబైలోని చైనా కాన్సులేట్ జనరల్ కాంగ్ షియాన్ హువా ఏప్రిల్ 18న ముంబైలో చెప్పాడు. మరో వైపు మన దేశ ప్రధాన వాణిజ్య భాగస్వామిగా అమెరికా తయారైందని, లావాదేవీల విలువ 128 బి.డాలర్లని మరొకవార్త. ఆర్థిక రంగంలో భారత్ ఎలా చైనాను వెనక్కు నెడుతున్నదో చూడండి అంటూ ఒక విశ్లేషణ. మన ఇరుగుపొరుగు దేశాలతో 115 బి.డాలర్ల సరిహద్దు వాణిజ్య లావాదేవీలు జరిపేందుకు అవకాశం ఉన్నప్పటికీ 2021లో కేవలం 2.8 బి.డాలర్ల మేరకే జరిగిందని, పదిహేడు రాష్ట్రాలు సరిహద్దుల్లో ఉన్నప్పటికీ తొమ్మిది మాత్రమే చురుకుగాలావాదేవీలు జరిపినట్లు మరొక విశ్లేషణ.

ఇవన్నీ వారం, పది రోజుల్లో వచ్చినవే. గత తొమ్మిది సంవత్సరాలలో నరేంద్ర మోడీ సర్కార్ సాధించినట్లు చెబుతున్న విజయాల మాలలో వీటిని ఎక్కడ అమర్చుతారో తెలియదు. ఉట్టికి ఎగరలేని వారు నేరుగా స్వర్గానికి ఎగురుతామని చెప్పినట్లుగా ఇరుగు పొరుగు దేశాలతో సరిహద్దు వాణిజ్య లావాదేవీలు జరపలేని స్థితిలో చైనాను వెనక్కు నెట్టేసి ప్రపంచ ఫ్యాక్టరీగా మన దేశాన్ని మార్చుతామంటే నమ్మేదెలా ? సరిహద్దు లావాదేవీలు భద్రతాపరమైన కారణాలతో జరపటం లేదని చెబుతున్నారు. ఇతర అంశాలతో పాటు విదేశాలు, స్వదేశంలో ఉన్న ఉగ్రవాదుల వెన్ను విరిచేందుకు పెద్ద నోట్ల రద్దుకు చెప్పిన కారణం ఒకటని గుర్తుకు తెచ్చుకోవాలి. అదే విధంగా దేశం సురక్షిత హస్తం చేతుల్లో ఉందని కూడా చెప్పుకున్న సంగతి తెలిసిందే. అలాంటపుడు తగిన జాగ్రత్తలు తీసుకొని లావాదేవీలను ఎందుకు జరపటం లేదు? చైనాకు ఇరుగు పొరుగు దేశాలతో అన్నీ విభేదాలే అని చెబుతున్నవారు మన దేశం కూడా అదే స్థితిలో ఉన్నట్లు ఈ పరిస్థితి చెప్పటం లేదా? చైనానుంచి నేరుగా దిగుమతులు చేసుకొంటే లేని భద్రతా అంశం సరిహద్దుల్లో లావాదేవీలకు ఎందుకు చెబుతున్నట్లు? సరిహద్దు లావాదేవీలు ఆ ప్రాంతంలో ఉన్న పౌరుల ఆర్థిక వృద్ధికి ఎంతగానో తోడ్పడతాయని తెలిసిందే.

ఇక్కడొక అంశాన్ని చెప్పాలి. లడక్ గాల్వన్ ఉదంతం తరువాత చైనా వస్తు బహిష్కరణ గురించి నానాయాగీ చేసిన కాషాయ దళాలు, వాటి సమర్ధకులు ఇప్పుడు కొత్త పాట పాడుతున్నారు. ఎగుమతులు, దిగుమతులను ఆయుధాలుగా మార్చుకోవాలన్న అమెరికా డోనాల్డ్ ట్రంప్ స్ఫూర్తి తప్ప ఈ తొలి ఉద్రేకం వెనుక మరేమీలేదు. పోనీ దానికి కట్టుబడి ఉన్నారా అంటే అదీ లేదు,తన రికార్డులను తానే మోడీ బద్దలు కొడుతున్నారు. చైనా వస్తు బహిష్కరణ అని దుస్తులు చించుకున్నవారే సరిహద్దు వివాదాలకు, వాణిజ్య లావాదేవీలకు లంకె పెడతారేమిటని ఎదురు దాడికి దిగుతున్నారు. ఇదే దేశభక్తులు, వీరి పూర్వీకులు చైనాతో వివాదాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలన్న వైఖరిని చెప్పినందుకు సిపిఐ (ఎం) నేతలను దేశద్రోహులుగా చిత్రించారు. ఇప్పటికీ అదే దాడి చేస్తున్నారు. 1960 దశకంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వారిని జైళ్లలో పెట్టిన సంగతిని కూడా మరచిపోరాదు. నరేంద్ర మోడీతో చెట్టపట్టాలు వేసుకొని కౌగిలింతలతో తిరిగిన డోనాల్డ్ ట్రంప్ 2018లో చైనాతో వాణిజ్యపోరుకు తెర తీశాడు. ఐదేండ్ల తరువాత వెనక్కు తిరిగి చూస్తే అమెరికా ఎన్ని బెదిరింపులకు దిగినా, మరొకటి చేసినా చైనా ఒక్క అంగుళం కూడా వెనక్కు తగ్గలేదు. పీటర్సన్ సంస్థ విశ్లేషకులు చెప్పిన అంశాలను చూస్తే చెరువు మీద అలిగినవాడి మాదిరి అమెరికా పరిస్థితి మారింది.దాని పరిస్థితే అలా ఉంటే మన నరేంద్ర మోడీ ఏలుబడి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

ఆత్మనిర్భరతలో భాగంగా ఓకల్ ఫర్ లోకల్ (స్థానిక వస్తువులనే వాడండి), మేకిన్ ఇండియా (భారత్‌లో ఉత్పత్తి చేయండి), మేడిన్ ఇండియా(భారత తయారీ) ఇలా ఇచ్చిన పిలుపులు ఎంత మేరకు ఫలించిందీ ఎప్పుడైనా జనానికి చెప్పారా ? అమెరికా తాజాగా విడుదల చేసిన సమాచారం ప్రకారం 2022లో అమెరికా ఎగుమతులు మరింతగా తగ్గినట్లు, దాని పోటీదారులు చైనా మార్కెట్లో వస్తువులను అమ్ముకుంటున్నట్లు తేలిందని, అమెరికా ఎగుమతులైన ఆటో మొబైల్స్, బోయింగ్ విమానాలు అదృశ్యమైనట్లు పీటర్సన్ విశ్లేషణ పేర్కొన్నది. సెమీకండక్టర్ల ఎగుమతి విధానం కారణంగా వాటి ఎగుమతి తగ్గింది, కరోనా కాలంలో తగ్గిన సేవల ఎగుమతులు అంతకు పూర్వపు స్థాయికి ఇంకా చేరుకోలేదు. చైనాకు అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగినా చైనా మార్కెట్ మీద ఎక్కువగా ఆధారపడిన అమెరికాకు ఆందోళనకర సూచనలు వెలువడ్డాయి. చైనా ఇతర దేశాల నుంచి దిగుమతులకు పూనుకున్నట్లు పీటర్సన్ పేర్కొన్నది.
ఎగుమతులు, దిగుమతులను ఆయుధాలుగా మార్చినందున ఎవరికి వారు జాగ్రత్తలు పడుతున్నారు. రాజీ మార్గంగా రెండు సంవత్సరాల్లో అమెరికా నుంచి 200 బి.డాలర్ల మేరకు అదనంగా కొనుగోలు చేస్తామని 2020 జనవరిలో చైనా అంగీకరించినా వివిధ కారణాలతో ఆ మేరకు దిగుమతులు జరగలేదు.

చైనా వస్తువులు నాసిరకమని, కరోనా నిరోధ వ్యాక్సిన్లు పని చేయలేదని ప్రచారం చేసిన వారి గురించి తెలిసిందే. ఇప్పుడు అమెరికా గతం కంటే ఎక్కువగా చైనా ఔషధాల మీద ఆధారపడుతోంది. గడచిన ఐదు సంవత్సరాల్లో రెండు దేశాల మధ్య మొత్తం లావాదేవీల్లో ఔషధాల వాటా విలువ 0.6 నుంచి 3 శాతానికి పెరిగింది. అమెరికా 10.2 బి.డాలర్ల విలువ గలవి దిగుమతి చేసుకుంటే చైనా కాన్సర్, యాంటీబయటిక్స్ వంటి ఆధునిక ఔషధాలను 9.3 బి. డాలర్ల మేర దిగుమతి చేసుకుంది. అమెరికా చేసుకుంటున్న మొత్తం ఔషధ దిగుమతుల్లో ఐర్లండ్ 19.8, జర్మనీ 10.8, స్విట్జర్లాండ్ 10.7 చైనా నుంచి 6 శాతం ఉన్నాయి. రెండు సంవత్సరాల్లో చైనా వాటా 2.5 శాతం నుంచి పెరిగింది. అమెరికా నుంచి చైనా చేసుకుంటున్న ఔషధాల దిగుమతులు కూడా అదే విధంగా పెరిగాయి. ఇతర వస్తువులు, సేవల అంశంలో భద్రత అంశాన్ని ముందుకు తెస్తున్న అమెరికా ఔషధాల గురించి మౌనంగా ఉంది. ఇలాంటి కొన్ని అవసరాల రీత్యా చైనా నుంచి తాము పూర్తిగా ఆర్థిక సంబంధాలను విడగొట్టుకోవటం లేదని అమెరికా వాణిజ్య ప్రతినిధి కాథరీన్ తాయి చెప్పారన్నది స్పష్టం.

చైనా వస్తువులను బహిష్కరించి దానికి బుద్ధి చెప్పాలన్న కాషాయ దళాల గోడు నరేంద్ర మోడీ పట్టించుకోవటం లేదు. ఎందుకంటే ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు అవసరమైన నిధులు రావాలన్నా, అధికారాన్ని నిలుపుకోవాలన్నా కార్పొరేట్ల మద్దతు అవసరం. రాజకీయంగా బిజెపితో లడాయిలో ఉన్న ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ కాషాయ దళాలు గతంలో లేవనెత్తి తరువాత నోరు మూసుకున్న ఈఅంశాన్నే ఇప్పుడు తవాంగ్ పేరుతో ముందుకు తెచ్చారు. చైనా వస్తువులను బహిష్కరించి దానికి ఎందుకు బుద్ధి చెప్పరంటూ ప్రశ్నించారు. చైనా వస్త్తువులను మన దేశంలో కూడా తయారు చేస్తున్నారని, దిగుమతులకు బదులు ఇక్కడే తయారు చేసి మన కార్మికులకు ఎందుకు పని కల్పించరంటూ నిలదీశారు. కేజ్రీవాల్ చేసే అన్ని విమర్శలకు సమాధానం చెప్పే కమలనాథులు దీని గురించి మౌనంగా ఉన్నారు. చైనా నుంచి భారత్ దిగుమతులు ఉత్తి పుణ్యానికి లేదా చైనా కార్మికులకు పని కల్పించేందుకు, అక్కడి కంపెనీలకు లాభాలు కట్టిపెట్టేందుకు కాదు. ముంబైలోని చైనా కాన్సులేట్ జనరల్ కాంగ్ షియాన్ హువా మన దేశంలోని పెట్టుబడిదారులతో మాట్లాడుతూ రెండు దేశాల మధ్య జరుగుతున్న లావాదేవీల లెక్కలు డొక్కలు పూర్తి కథను వెల్లడించవంటూ అసలు సంగతిచెప్పారు.

చైనా నుంచి భారత్ చేసుకుంటున్న దిగుమతులలో ఇంటర్‌మీడియట్‌లు (పూర్తిగా తయారు కాని, ముడి పదార్ధాలు, విడి భాగాల వంటివి. ఉదాహరణకు మనం వేసుకొనే ఔషధ గోళీలు మన దేశంలో తయారైనప్పటికీ వాటిలో నింపే పదార్ధాలను చైనా నుంచి దిగుమతి చేసుకోవటం) ఎక్కువగా ఉంటాయని, వాటితో వస్తువులను తయారు చేసి భారత్ ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తున్నదని, అందువలన మేక్ ఇండియా, మేకిన్ ఇండియా సంపూర్ణం కావాలంటే చైనా మార్కెట్‌కు రావాలని మన పెట్టుబడిదారులను కోరాడు. ఐటి, సినిమా నిర్మాణ రంగాలలో ముందున్న భారతీయులు తమ మార్కెట్లోకి రావచ్చని కూడా చెప్పాడు.ఈ కారణంగానే సరిహద్దుల్లో ఘర్షణలు జరిగినా, ఏటా భారీ మొత్తంలో విదేశీ మారకద్రవ్యాన్ని చైనాకు సమర్పించుకోవాల్సి వచ్చినా మోడీ సర్కార్ కిమ్మనకుండా దిగుమతులలో రికార్డులను బద్దలు కొడుతున్నది. మన దేశంతో 2022లో చైనా వాణిజ్య మిగులు 100 బి.డాలర్లు, 2021లో ఆ మొత్తం 69.38 బి.డాలర్లు. అంటే ఇంత మొత్తాన్ని డాలర్ల రూపంలో చైనాకు మనం సమర్పించుకున్నాం. ఇదంతా దేశభక్తి, సైనికుల త్యాగాల గురించి రోజూ జనాలకు మనోభావాలను గుర్తు చేస్తుండగానే, వారి కనుసన్నలలోనే జరుగుతోంది.

చైనా చెప్పే లెక్కలు జనవరి నుంచి డిసెంబరు వరకు ఏడాదిగా పరిగణిస్తే మన ప్రభుత్వం ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఆర్థిక సంవత్సరంగా తీసుకుంటున్నందున అంకెల్లో కొంత గందరగోళం తలెత్తవచ్చు, వాస్తవాలు మారవు. మన ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం 2022 23లో మన చైనా దిగుమతులు 4.16 శాతం పెరిగి 98.51 బి.డాలర్లకు, చైనాకు మన ఎగుమతులు 28 శాతం తగ్గి 15.32 బి.డాలర్లుగా ఉన్నాయి. మన వాణిజ్యలోటు అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 72.91 నుంచి 83.2 బి.డాలర్లకు పెరిగింది. అమెరికాతో లావాదేవీలు 128.55 బి.డాలర్లకు చేరినందున చైనాను వెనక్కు నెట్టి అమెరికా ముందుకు వచ్చిందని చెబుతున్నారు. దాని వలన చైనా కు వచ్చే నష్టం లేదు. ఇక దేశభక్తులుగా చెలామణి అవుతున్న అదానీ వంటి కార్పొరేట్లు ఏ దేశం నుంచి దిగుమతి చేసుకున్నప్పటికీ దిగుమతి పన్ను ఎగవేసేందుకు తప్పుడు సమాచారం ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ‘దిగుమతి విలువ ఎక్కువ, ఎగుమతి విలువ తక్కువగా ఉండటం సాధారణ అంశం. కానీ భారత్‌లో అందుకు విరుద్ధంగా చైనా భారత్ లావాదేవీలు ఉన్నట్లు’ మింట్ పత్రిక పేర్కొన్నది.

ఆర్థిక రంగంలో చైనాను భారత్ ఎలా పక్కకు నెడుతున్నది అనే శీర్షికతో మేజర్ అమిత్ బన్సాల్ అనే రిటైర్డు అధికారి ఒక విశ్లేషణ చేశారు. ఏమిటి అంటే సింగపూర్‌కు చెందిన ఒక సంస్థ ఆసియన్ దేశాలలో ఇటీవల సింగపూర్‌కు చెందిన ఐఎస్‌ఇఎఎస్ అనే సంస్థ జరిపిన సర్వేలో భారత్‌ను ఆమోదించిన లేదా అంగీకరించిన వారు గత సర్వేతో పోల్చితే 5.1 నుంచి 11.3 శాతానికి పెరిగారని తేలిందట. చైనా, అమెరికా తరువాత మూడో స్థానంలో ఉన్నాం గనుక ఇదే కొనసాగి చైనాను వెనక్కు నెట్టే దారిలో ఉన్నట్లు బన్సాల్ చెబుతున్నారు. ఎందుకటా అమెరికా చైనా వివాదపడుతున్నాయి గనుక భారత్ దూరేందుకు అవకాశం వచ్చింది అంటున్నారు.

మరోవైపున చైనా 700 బి.డాలర్ల మేరకు ఆసియన్ దేశాలతో లావాదేవీలు జరుపుతూ చైనా మొదటి స్థానంలో ఉందంటూనే మనం 2022లో 110 బి.డాలర్ల దగ్గర ఉన్నామని, అమెరికాను ఐదారు సంవత్సరాల్లో, పదేండ్లకు చైనాను వెనక్కు నెట్టేస్తామంటున్నారు. ఆసియన్ దేశాల లావాదేవీల్లో మన దిగుమతులు 68, ఎగుమతులు 42 బి.డాలర్లు అంటే మనం 26 బి.డాలర్లు వారికి సమర్పించుకుంటున్నాం. వారికి లాభసాటిగా ఉంది గనుక మనతో లావాదేవీలకు మొగ్గుచూపుతున్నానర్నది స్పష్టం. అందమైన కలలు కనటాన్ని తప్పుపడతామా? చైనాను వెనక్కు నెట్టే సంగతి తరువాత ముందు వారితో ఉన్న వాణిజ్య లోటును సమం చేస్తే అదే పది వేలు. 2021 22లో మన దేశం 612 బి.డాలర్ల మేర దిగుమతులు చేసుకుంటే చేసిన ఎగుమతుల విలువ 422 బి.డాలర్లు. పెద్ద దేశాల్లో అమెరికా, బ్రిటన్‌తో మాత్రమే మన ఎగుమతులు ఎక్కువ, ఇక కొన్ని చిన్న దేశాతో కూడా ఎక్కువే. మన మిగులు విలువ 59 బి.డాలర్లు పోను మన లోటు 192 బి.డాలర్లు.

అందువలన వచ్చే పదేండ్లలో దాన్ని సమం చేసినా ఘన విజయమే. ప్రపంచ బ్యాంకు సమాచారం ప్రకారం 2014 మన వస్తు ఎగుమతుల విలువ 322.69 బి.డాలర్లు కాగా 2021లో 395.43 బి.డాలర్లు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వివరాల మేరకు 2021 22లో 447బి.డాలర్లు. ద్రవ్యోల్బణం కారణంగా ఈ పెరుగుదల తప్ప గడచిన తొమ్మిదేండ్లలో పదే పదే విదేశాలు తిరిగిన నరేంద్ర మోడీ మన సరకులకు సాధించిన మార్కెట్ ఏమిటి అన్నది ప్రశ్న. అదే ప్రపంచ బ్యాంకు చైనా 2014లో 2.34 లక్షల కోట్ల డాలర్ల మేర సరకులు ఎగుమతి చేస్తే 2021 నాటికి 3.36 లక్షల కోట్లకు పెరిగింది. ఇలాంటి అంకెలు మన కళ్ల ముందు ఉండగా చైనాను అధిగమిస్తామని ఎలా చెబుతారు?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News