Sunday, December 22, 2024

తొలి రోజు భారత్ హవా..

- Advertisement -
- Advertisement -

ముంబై: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో గురువారం తొలి రోజు భారత మహిళలు ఆధిపత్యం చెలాయించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను 77.4 ఓవర్లలో 219 పరుగులకే పరిమితం చేయడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు. తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపట్టిన టీమిండియా ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 98 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ స్కోరును అందుకోవాలంటే భారత్ మరో 121 పరుగులు చేయాలి. ఓపెనర్లు షఫాలీ వర్మ, స్మృతి మంధానలు శుభారంభం అందించారు. ఇద్దరు ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. ధాటిగా ఆడిన షఫాలీ వర్మ 59 బంతుల్లో 8 ఫోర్లతో 40 పరుగులు చేసి ఔటైంది. మరోవైపు మంధాన 49 బంతుల్లో 8 బౌండరీలతో 43 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. స్నేహ్ రాణా 4 పరుగులతో క్రీజులో ఉంది.

ఆరంభంలోనే..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్ లిచ్‌ఫీల్డ్ ఖాతా తెరవకుండానే రనౌట్‌గా వెనుదిరిగింది. వన్‌డౌన్‌లో వచ్చిన ఎలిసె పేరి 4 పరుగులు చేసి పూజా వస్త్రకర్ వేసిన బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యింది. దీంతో భారత్ 7 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది. ఈ దశలో మరో ఓపెనర్ బేథ్ మూనీ, తహిలా మెక్‌గ్రాత్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. ఇద్దరు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన మెక్‌గ్రాత్ 8 ఫోర్లతో వేగంగా 50 పరుగులు చేసి పెవిలియన్ చేరింది. ఈ క్రమంలో మూడో వికెట్‌కు 80 పరుగులు జోడించింది. కెప్టెన్ హీలీ 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 38 పరుగులు సాధించింది. సమన్వయంతో బ్యాటింగ్ చేసిన మూనీ 40 పరుగులు చేసింది. చివర్లో కిమ్ గార్థ్ 28 (నాటౌట్) కాస్త రాణించడంతో ఆస్ట్రేలియా స్కోరు 219 పరుగులకు చేరింది. భారత బౌలర్లలో పూజా వస్త్రకర్ నాలుగు, స్నేహ్ రాణా మూడు వికెట్లు పడగొట్టారు.దీప్తి శర్మకు రెండు వికెట్లు దక్కాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News