న్యూఢిల్లీ : గోవాలో జరగనున్న షాంఘై సహకార సంఘం (ఎస్‌సిఓ) విదేశాంగ మంత్రుల సమావేశానికి పాకిస్థాన్‌ను భారత్ ఆహ్వానించింది. మే 4, 5 తేదీల్లో జరిగే ఈ సదస్సుకు సభ్య దేశాల విదేశాంగ మంత్రులతో పాటు పాక్‌నూ ఆహ్వానించింది. పాకిస్థాన్‌ను ఆహ్వానించడం సుమారు పన్నెండేళ్ల తర్వాత ఇదే తొలిసారి. పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీకి ఆహ్వానాన్ని ఇస్లామాబాద్‌లోని ఇండియన్ ఎంబసీ ద్వారా మన దేశ విదేశాంగ మంత్రి జైశంకర్ పంపించినట్లు సమాచారం. ఎస్‌సీఓలో చైనా, భారత దేశం, కజకిస్థాన్, కిర్గిజ్‌స్థాన్, రష్యా, పాకిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, ఇరాన్ సభ్య దేశాలు.
గత ఏడాది సెప్టెంబరులో ఎస్‌సిఓ చైర్మన్‌షిప్ భారత్‌కు వచ్చింది. అయితే భారత్ ఆహ్వానంపై పాకిస్థాన్ స్పందించలేదు. బిలావల్ భుట్టో ఈ సమావేశాలకు హాజరవుతారో, లేదో ఇంకా స్పష్టత రాలేదు. పాక్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్ 2012లో మన దేశంలో పర్యటించి, అప్పటి విదేశాంగ మంత్రితో చర్చలు జరిపారు. ఆమె ఇటీవల మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య సమస్యల పరిష్కారానికి పెద్దమనిషి తరహా వ్యవహార శైలి అవసరమన్నారు. మరోవైపు ఇటీవల పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ కూడా భారత్‌తో సత్సంబంధాలను కోరుకుంటున్నామని ప్రకటించారు. గత మూడు యుద్ధాలు తమలో మార్పు తెచ్చాయని పేర్కొన్న సంగతి తెలిసిందే.