150 కోట్ల డోసులు దాటిన వ్యాక్సిన్ పంపిణీ
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడికి చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. శుక్రవారంనాటికి దేశంలో ఇప్పటివరకు మొత్తం 150 కోట్ల డోసుల వ్యాక్సిన్ పంపిణీ దాటినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ సమర్థ నాయకత్వంలో ఆరోగ్య రక్షణ కార్యకర్తలు అవిశ్రాంత కృషి తోనే ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించినట్లు ఆయన తెలిపారు. ప్రతిఒక్కరూ కలసికట్టుగా పనిచేస్తే ఎటువంటి లక్ష్యాన్ని అయినా సాధించగలమంటూ ఆయన ట్వీట్ చేశారు. కాగా..గత ఏడాది అక్టోబర్ 21న దేశం 100 కోట్ల డోసుల కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో విజయోత్సవాలు కూడా జరిగాయి. కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం దేశంలో ఇప్పటివరకు 91 శాతానికి పైగా స్త్రీపురుషులు(18 సంవత్సరాలు పైబడినవారు) కనీసం ఒక డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. 66 శాతానికి పైగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. 15 నుంచి 18 సంవత్సరాల లోపు పిల్లలలో 22 శాతానికి పైగా మొదటి డోసు వ్యాక్సినేషన్ జరిగింది.