హిజాబ్ వివాదంపై విదేశాల వ్యాఖ్యలపై కేంద్రం ఆగ్రహం
న్యూఢిల్లీ: కర్నాటకను కుదిపేస్తున్న హిజాబ్ వ్యవహారం దేశవ్యాప్తంగానే కాక అంతర్జాతీయంగా కూడా చర్చకు దారి తీసింది. ఇటీవల కొందరు విదేశీ ప్రముఖులతో పాటుగా కొన్ని విదేశాలు కూడా దీనిపై స్పందిస్తూ వ్యాఖ్యలు చేశాయి. దీంతో ఈ వ్యవహారంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ అంతర్గత విషయాలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తగదని సూచించింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ కర్నాటకలోని డ్రెస్ కోడ్ వివాదాన్ని ప్రస్తుతం కర్నాటక ఉన్నత న్యాయస్థానం పరిశీలిస్తోంది. మా రాజ్యాంగ విధి విధానాలు, ప్రజాస్వామ్య నియమాలకు అనుగుణంగా ఆ వివాదాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది.
భారత్ గురించి బాగా తెలిసిన వారు ఈ వాస్తవాలను అర్థం చేసుకుంటారు. అయితే మా అంతర్గత సమస్యలపై ప్రేరేపించే వ్యాఖ్యలను ఎన్నటికీ స్వాగతించబోం’ అని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. కర్నాటకలోని కొన్ని రోజుల క్రితం మొదలైన హిజాబ్ వస్త్రధారణ వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. దీనిపై కొన్ని దేశాలకు చెందిన వ్యక్తులు స్పందిస్తూ కర్నాటక ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. అటు అమెరికా ప్రభుత్వానికి చెందిన ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ కూడా ఈ వివాదంపై స్పందించింది. మరోవైపు పాకిస్తాన్ ప్రభుత్వం గత బుధవారం ఇస్లామాబాద్‌లోని భారత చార్జి డి అఫైర్స్‌ను పిలిపించి ముస్లిం విద్యార్థినులపై ఆంక్షలు విధించడంపై తన ఆందోళనను తెలియజేసింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర విదేశాంగ శాఖ ఈ ప్రకటన చేసింది.