Saturday, January 18, 2025

ఎదురులేని టీమిండియా

- Advertisement -
- Advertisement -

హ్యాట్రిక్ విజయాలతో ఫుల్ జోష్

మన తెలంగాణ/క్రీడా విభాగం: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను టీమిండియా ఒక టెస్టు మిగిలివుండగానే 31 తేడాతో గెలుచుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య భారత్‌కు అనూహ్య ఓటమి ఎదురైంది. దీంతో మిగిలిన మ్యాచుల్లో ఇంగ్లండ్‌ను ఓడించడం టీమిండియాకు అంత సులువుకాదని విశ్లేషకులు అభివర్ణించారు. అయితే రోహిత్ సేన మాత్రం విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టు నుంచి అనూహ్యం పుంజుకుంది. తొలి టెస్టులో ఎదురైన ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకున్న భారత తర్వాతి మ్యాచుల్లో సమష్టిగా ముందుకు సాగింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అసాధారణ పోరాట పటిమతో ఇంగ్లండ్‌కు గట్టి పోటీ ఇచ్చింది.

విశాఖలో జరిగిన మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్ బాగానే ఆడింది. అయితే ఈసారి టీమిండియా తన ఆటతీరును పూర్తిగా మార్చుకుంది. ఇంగ్లండ్ సవాల్‌ను తట్టుకుంటూ లక్షం దిశగా అడుగులు వేసింది. బ్యాటింగ్‌లో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, బౌలింగ్‌లో బుమ్రా అసాధారణ రీతిలో చెలరేగి పోయారు. తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. రెండో ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ శతకంతో అలరించాడు. ఇక బుమ్రా బౌలింగ్‌లో చెలరేగి పోయాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ఆరు, రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో అసాధారణ పోరాట పటిమను కనబరిచింది. అయితే భారత బౌలర్లు అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించారు. రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టెస్టులో కూడా టీమిండియా జయకేతనం ఎగుర వేసింది.

ఈసారి జట్టును గెలిపించే బాధ్యతను ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తనపై వేసుకున్నాడు. బ్యాట్‌తో బంతితో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో చిరస్మరణీయ శతకం సాధించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇద్దరు శతకాలతో చెలరేగడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఇంగ్లండ్ జట్టులో బెన్ డకెట్ సెంచరీ సాధించాడు. అయితే భారత బౌలర్లు సమష్టి ప్రతిభతో ఇంగ్లీష్ టీమ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో యువ సంచలనం యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో కదంతొక్కాడు. సిరీస్‌లో వరుసగా రెండో ద్విశతకంతో పెను ప్రకంపనలు సృష్టించాడు. శుభ్‌మన్ గిల్ కూడా అద్భుత బ్యాటింగ్‌తో అలరించాడు. తర్వాత భారీ లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ను భారత బౌలర్లు 122 పరుగులకే కుప్పకూల్చారు. జడేజా ఐదు వికెట్లు తీసి ఇంగ్లండ్ బ్యాటింగ్ పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 434 పరుగుల భారీ తేడాతో రికార్డు విజయాన్ని అందుకుంది.

ఇక తాజాగా రాంచి వేదికగా నాలుగో టెస్టులోనూ భారత్ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ నుంచి భారత్‌కు గట్టి పోటీ ఎదురైంది. అయినా చివరి వరకు సమష్టిగా రాణించిన టీమిండియా చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. యశస్వి జైస్వాల్, యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ అసాధారణ బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. జురెల్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 39 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి, శుభ్‌మన్ గిల్‌లు కీలక ఇన్నింగ్స్‌లు ఆడడంతో భారత్ ఈ టెస్టులో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను దక్కించుకుంది. జడేజా, కుల్దీప్, అశ్విన్‌లు బంతితో రాణించారు. ఇలా బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన టీమిండియా హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. ఇక ధర్మశాల వేదికగా జరిగే చివరి టెస్టుకు సమరోత్సాహంతో సిద్ధమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News