Monday, December 23, 2024

వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి భారత్, కువైట్ సంబంధాలు

- Advertisement -
- Advertisement -

కువైట్ అగ్ర నాయకత్వంతో ప్రధాని మోడీ భేటీ
పలు కీలక రంగాల్లో సహకారం పెంపు లక్షంగా చర్చలు
కువైట్‌లో భారతీయుల శ్రేయస్సుపై ఎమీర్‌కు మోడీ ధన్యవాదాలు

కువైట్ సిటీ : భారత్, కువైట్ ఆదివారం తమ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకున్నాయి. మొత్తం ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త ఊపు ఇవ్వడంపై దృష్టి కేంద్రీకరిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ కువైట్ ఎమీర్ షేఖ్ మెషల్ అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ సబాహ్‌తో విస్తృతంగా చర్చలు జరిపిన అనంతరం ఆ పరిణామం చోటు చేసుకున్నది. కువైట్ సిటీలోని బయన్ ప్రాసాదంలో తమ సమావేశంలో ఇద్దరు అధినేతలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఔషధాలు, ఫిన్‌టెక్, మౌలిక వసతులు, భద్రత రంగాల్లో సహకారం పెంపుపై ప్రధానంగా చర్చించారు. కువైట్‌లోని పది లక్షల మందికి పైగా భారతీయుల సంక్షేమాన్ని చూస్తున్నందుకు ఎమీర్‌కు మోడీ ధన్యవాదాలు తెలియజేశారు. తమ గల్ఫ్ దేశం అభివృద్ధి ప్రస్థానంలో భారతీయ సమాజం తోడ్పాటకు కువైటీ అధినేత అభినందనలు తెలిపారు.

ఎమీర్‌తో తన భేటీని ‘అద్భుతం’గా మోడీ ‘ఎక్స్’ పోస్ట్‌లో అభివర్ణించారు. ‘కువైట్ ఎమీర్ గౌరవనీయ షేఖ్ మెషల్ అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ సబాహ్‌తో అద్భుత సమావేశం జరిగింది. ఔషధాలు, ఐటి, ఫిన్‌టెక్, మౌలిక వసతులు, భద్రత వంటి కీలక రంగాల్లో సహకారం గురించి చర్చించుకున్నాం’ అని మోడీ తెలిపారు. ‘మా దేశాల మధ్య సన్నిహిత సంబంధాలకు అనుగుణంగా మా భాగస్వామ్యాన్ని వ్యూహాత్మక స్థాయిని పెంచాం. మా మైత్రి రానున్న కాలంలో మరింతగా పరిఢవిల్లగలదని ఆశిస్తున్నా’ అని మోడీ తెలియజేశారు. బయన్ ప్రాసాదానికి చేరుకున్న మోడీకి వైభవోపేత స్వాగతం లభించింది. కువైట్ ప్రధాని అహ్మద్ అల్ అబ్దుల్లా అల్ అహ్మద్ అల్ సబాహ్ ఆయనకు స్వాగతం పలికారు.

భారత ప్రధాని రెండు రోజుల పర్యటనపై శనివారం కువైట్ సిటీ చేరుకున్నారు. భారతీయ ప్రధాని ఒకరు ఈ గల్ఫ్ దేశాన్ని సందర్శించడం 43 ఏళ్లలో ప్రథమం. ప్రధాని, ఎమీర్ మధ్య చర్చలు భారత్, కువైట్ సంబంధాలను ‘కొత్త పుంతలు’ తొక్కించే మార్గాల అన్వేషణ లక్షంగా సాగాయని విదేశాంగ మంత్రిత్వశాఖ (ఎంఇఎ) అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ వెల్లడించారు. రెండు దేశాల మధ్య గల బలమైన చారిత్రక, స్నేహపూర్వక సంబంధాలను మోడీ, కువైటీ ఎమీర్ తమ చర్చల్లో గుర్తు చేసుకున్నారు. ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరించేందుకు, పటిష్ఠం చేసేందుకు తమ సంపూర్ణ నిబద్ధతను వారు పునరుద్ఘాటించారు. కువైట్‌లోని పది లక్షల మందికి పైగా భారతీయ సమాజం సంక్షేమం కోసం చేస్తున్న కృషికి ఎమీర్‌కు ప్రధాని ధన్యవాదాలు తెలిపారని ఎంఇఎ వెల్లడించింది. తన ‘2035 లక్షం’ సాఫల్యానికి కువైట్ చేపట్టిన కొత్త పథకాలను మోడీ శ్లాఘించారని, ఈ నెల ప్రథమార్ధంలో గల్ఫ్ సహకార మండలి (జిసిసి) శిఖరాగ్ర సదస్సును విజయవంతంగా నిర్వహించినందుకు ఎమీర్‌ను ఆయన అభినందించారని ఎంఇఎ పేర్కొన్నది.

యుఎఇ, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్, కువైట్‌తో కూడిన ప్రభావశీల బృందం జిసిసి. జిసిసి దేశాలతో భారత్ వాణిజ్య పరిమాణం 202223 ఆర్థిక సంవత్సరంలో 184.46 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉన్నది. శనివారం అరేబియన్ గల్ఫ్ కప్ ప్రారంభ వేడుకకు ‘గౌరవ అతిథి’గా తనను ఆహ్వానించినందుకు కూడా మోడీ తన కృతజ్ఞతలు తెలియజేశారు. కువైట్, గల్ఫ్ ప్రాంతంలో విలువైన భాగస్వామిగా భారత్ పాత్రను ఎమీర్ కొనియాడినట్లు ఎంఇఎ ఒక ప్రకటనలో తెలియజేసింది. కువైట్ ‘లక్షం 2035’ సాధన దిశగా భారత్ మరింత పాత్ర పోషించేందుకు కువైటీ అధినేత ఎదురు చూస్తున్నారని ఎంఇఎ తెలిపింది. భారత్‌ను సందర్శించవలసిందిగా ఎమీర్‌ను ప్రధాని మోడీ ఆహ్వానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News