Sunday, January 19, 2025

దేశంలో 13,874కు పెరిగిన చిరుతపులుల సంఖ్య

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో చిరుతపులుల సంఖ్య 2018 నుంచి 2022 మధ్యకాలంలో 12,852 నుంచి 13,874 కు పెరిగిందని, కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ గురువారం వెల్లడించింది. గతంతో పోలిస్తే 1.08 శాతం చిరుతపులుల సంఖ్య పెరిగింది. ఇదే కాలంలో గులాబీ వన్నె కలిగిన కళ్లుండే రోజెట్టే జాతి చిరుతల సంఖ్య శివాలిక్ కొండల్లో, ఇండో గంగాతీర మైదాన ప్రాంతాల్లో స్వల్పంగా తగ్గినట్టు పేర్కొంది. ఈ వన్యప్రాణుల యధాతథ స్థితిని వివరిస్తూ రూపొందిన నివేదికను కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ ఆవిష్కరించారు. ఈ నివేదిక ప్రకారం మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 3421 నుంచి 3907 వరకు చిరుతపులులు పెరిగాయి. మధ్యప్రదేశ్ తరువాత మహారాష్ట్రలో 1690 నుంచి 1985 కు, కర్ణాటకలో 1783 నుంచి 1897కు, తమిళనాడులో 868 నుంచి 1070 వరకు చిరుతపులులు పెరిగాయి. మధ్యభారతంలో 8071 నుంచి 8820 వరకు చిరుతపులుల సంఖ్య పెరగ్గా, శివాలిక్ కొండల్లో, ఇండో గంగానదీ మైదాన ప్రాంతాల్లో 2018లో 1253 నుంచి 2022 నాటికి 1109 కి వీటి సంఖ్య తగ్గింది.

ఈ ప్రాంతాల్లో ఏటా 3.4 శాతం వంతున తగ్గుదల కనిపిస్తోంది. మధ్యభారతం, తూర్పు కనుమల్లో 1.5 శాతం పెరుగుదల కనిపిస్తోంది. ఇక టైగర్ రిజర్వు ఏరియాల్లో ఆంధ్రప్రదేశ్ నాగార్జున సాగర్ శ్రీశైలంలో చిరుతపులుల సంఖ్య అత్యంత గరిష్ఠ స్థాయిలో ఉంది. తరువాతి స్థానాల్లో మధ్యప్రదేశ్‌లోని పన్నా, సాత్పురా రిజర్వు ఫారెస్ట్ ఏరియాల్లో చిరుతల సంఖ్య ఎక్కువగా నమోదైంది. ఈ సర్వే 18 రాష్ట్రాల పులుల జీవన స్థితిగతులపైనే కేంద్రీకరించడమైంది. ప్రకృతి విధ్వంసం, చిరుతలను వేటాడడం, వన్యప్రాణుల ఘర్షణ, చిరుతల మృతికి ప్రధాన కారణాలని నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ వెల్లడించడంతో వాస్తవ పరిస్థితులను తెలుసుకోడానికి దాదాపు 6,41,449 కిమీ పొడవునా కాలినడకన సంచరించి సర్వే జరిపారు. ఈ మేరకు 32,803 ప్రాంతాల్లో కెమెరాలు అమర్చారు. ఫలితంగా చిరుతల ఫోటోలు 85,488 వరకు తీయడమైంది. చిరుతల సంరక్షణ కోసమే ఈ సర్వే ప్రధాన లక్షంగా ఉంది. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే ప్రధాని నరేంద్రమోడీ మార్గదర్శకాలపై వన్యప్రాణుల సంరక్షణకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News