Wednesday, January 22, 2025

కొవిడ్‌పై కేంద్రం అప్రమత్తం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దేశంలో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తం చేసింది. కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయని హెచ్చరించిన కేంద్రం.. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాసింది. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలలో కేసులు పెరుగుతున్నాయ ని.. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు లేవని స్పష్టం చేసింది. ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య,

కొవిడ్ మరణాలు తక్కువే ఉన్నాయని పేర్కొంది. ఇన్‌ఫ్లుయెంజా వ్యాధులు కూడా ఇప్పుడే ప్రబలుతున్నాయని కేంద్రం చెప్పింది. పరిస్థితులను అన్ని రాష్ట్రాలు క్షుణ్ణంగా పరిశీలించి.. ప్రజలకు అవగాహన కల్పించి అప్రమత్తం చేయాలని సూచించింది. జనం గుంపులుగా ఉండే పరిస్థితులను నియంత్రించాలని.. ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది, రోగులు తప్పక మాస్క్ ధరించాలని హితవు పలికింది. కొవిడ్ పరీక్షలు పెంచి, లక్షణాలపై తప్పకుండా నివేదికలు ఇవ్వాలని ఆదేశించింది.
వైరస్ కట్టడికి ముందస్తు చర్యలు
ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఆసుపత్రుల సంసిద్ధతను సమీక్షించేందుకు నిర్ణయించింది. అందుకోసం ఏప్రిల్ 10, 11 తేదీల్లో దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్స్ నిర్వహించనుంది. ఈ మేరకు శనివారం ఐసిఎంఆర్, కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్తంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేశాయి. వైద్య సామాగ్రి, ఆక్సిజన్, ఔషధాల లభ్యతను అంచనా వేసేందుకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు ఈ మాక్‌డ్రిల్స్‌లో పాల్గొనాలని పేర్కొన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సంఖ్య భారీగా పడిపోయిందని,

ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం చాలా తక్కువగా ఉందని మార్గదర్శకాల్లో కేంద్రం పేర్కొంది. అన్ని రాష్ట్రాల్లో పరీక్షల సంఖ్యను పెంచాలని, కొవిడ్ హాట్‌స్పాట్లను గుర్తించి, వైరస్‌ను కట్టడి చేసేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండడం, మాస్కులు ధరించడం, గాలివెలుతురు సరిగ్గా ఉండేలా చూసుకోవడం వంటి చర్యల ద్వారా కొవిడ్ వ్యాప్తిని నిరోధించవచ్చని తెలిపింది.
దేశంలో కొత్తగా 1590 కేసులు, ఆరుగురు మృతి
దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రాలకు కరోనా అలర్ట్ జారీ చేసింది. దేశంలో కేసులు పెరుగుతున్నవేళ ప్రధాని మోడీ నేతృత్వంలో బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వచ్చే సోమవారం రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్యశాఖ వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. అలాగే ఏప్రిల్ 10.11 తేదీల్లో కరోనాపై కేంద్రం మాక్ డ్రిల్ నిర్వహించనున్నది. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకలో భారీగా కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో కొత్తగా 1590 కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.

గత 146 రోజుల్లో ఒకే రోజు ఇంతపెద్ద సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 4,47,02, 257కు చేరింది. గత 24 గంటల్లో ఆరుగురు మరణించా రు. దీంతో ఇప్పటివరకు 5,30,824 మంది కరోనాకు బలయ్యారు. కొత్తగా మృతి చెందిన వారిలో మహారాష్ట్రలో ముగ్గురు ఉండగా, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరాఖండ్‌లో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. ఇక శుక్రవారం ఉదయం నుంచి శనివారం వరకు 910 మంది కోలుకున్నారు. మొత్తం 4,41,62,832మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు. మరో 8601 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 98.79 శాతం మంది కోలుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News