న్యూఢిల్లీ : దేశంలో కరోనా కొత్త కేసులు కాస్త తగ్గినట్టు కనిపించినా మళ్లీ 20 వేల పైనే నమోదవుతున్నాయి. అంతక్రితం రోజు 24,354 కేసులతో పోల్చితే కేసులు కాస్త తగ్గాయి. మరోవైపు మరణాలు 250 లోపే నమోదయ్యాయి. ఇక కేరళలో కరోనా ఉధృతి తగ్గడం లేదు. దేశంలో నమోదైన కేసుల్లో సగానికి పైగా ఆ రాష్ట్రం నుంచే ఉంటున్నాయి. శనివారం ఆ రాష్ట్రంలో 13,217 కేసులు 121 మరణాలు చోటు చేసుకున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గడచిన 24 గంటల్లో దేశంలో 22,342 కేసులు నమోదు కాగా, శనివారం 244 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,48,81,78 కి చేరింది. కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉంటున్నాయి. శనివారం 25,930 మంది కరోనా నుంచి బయటపడ్డారు. ఇప్పటివరకు 3,30,94,529 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఇక ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 199 రోజుల కనిష్ఠానికి తగ్గి 2,70,557 కి చేరింది. ఇక దేశంలో వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటివరకు 90. 5 కోట్ల వరకు డోసులు పంపిణీ అయ్యాయి.