పారిస్ క్రీడల్లో ఏడు మెడల్స్ తృటిలో కోల్పోయిన భారత్
మన తెలంగాణ/ క్రీడా విభాగం : విశ్వక్రీడల్లో ఈసారి భారత్ మంచి ప్రదర్శన చేస్తుందని అందరూ భావించినా రెండంకెల పతకాలు సాధించలేక భారత అథ్లెట్లు విఫలమయ్యారు. అందులో ఒక్క గోల్డ్ మెడల్ కూడా లేకపోవడం ఎంతటి నిరాశో చెప్పకనే చెప్పొచ్చు. టోక్యో ఒలింపిక్స్‌లో మెరిసిన అథ్లెట్లు ఒక్కరు కూడా పారిస్ క్రీడల్లో రాణించలేకపోయారు. దీంతో పతకాల పట్టికలో భారత్ 69వ స్థానంలోకి పడిపోయింది. అమెరికా, చైనా అథ్లెట్లు పోటీపడి పతకాలు సాధించగా.. భారత్ క్రీడాకారులు చతికిలపడ్డారు. టోక్యో ఒలింపిక్స్‌లో 7 పతకాలు సాధించిన భారత్.. పారిస్ క్రీడల్లో కేవలం 6 పతకాలతోనే సరిపెట్టుకుంది. మరో 7 పతకాలు తృటిలో చేజార్చుకుంది.
షూటింగ్‌లో పాయింట్ తేడాతో..
ఈ ఒలింపిక్స్‌లో మను భాకర్ అద్భుత ప్రదర్శన చేసి 2 కాంస్య పతకాలు సాధించింది. అయితే, మను భాకర్ 25 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ పోటీలో పతకం సాధించలేదు. కానీ, తృటిలో పతకం చేజార్చుకుంది. మహేశ్వరి చౌహాన్, అనంత్‌లకు షూటింగ్ పోటీల్లో భారత్ తరపున పతకం సాధించే అవకాశం లభించింది. కాంస్య పతక పోరులో రెండు జోడీలు చైనాకు చెందిన జియాంగ్ యుటింగ్, లియు జియాలిన్‌లతో తలపడ్డాయి. కానీ కేవలం 1 పాయింట్ తేడాతో భారత్ పతకాల ఆశలు అడియాశలయ్యాయి. చివరికి ఈ జంట నాలుగో స్థానంలో నిలిచింది. స్టార్ షూటర్ అర్జున్ బాబుటాకు కూడా పతకం సాధించే అవకాశం వచ్చింది. అతను 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్‌లో కాంస్య పతక మ్యాచ్ ఆడాడు. అయితే, క్రొయేషియా ఆటగాడు మారిసిక్ మిరాన్ చేతిలో అర్జున్ ఓడిపోయాడు. దీంతో భారత్ మరో పతకం సాధించాలన్న కల నెరవేలేదు.
లక్షసేన్ చేజేతులా..
ఇక బ్యాడ్మింటన్‌లో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ దూకుడుగా సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. సెమీలో అనూహ్యంగా ఓటమిపాలయ్యాడు. ఆ తర్వాత కాంస్య పతక మ్యాచ్‌లో మలేషియాకు చెందిన లీ జి జియాపై తొలి సెట్ సునయాసంగా గెలుపొందిన సేన్.. రెండో సెట్‌లో ప్రత్యర్థిని నిలువరించలేక వరుసగా రెండు, మూడు సెట్‌ను కోల్పోయి 13-21, 21-16, 21-11 తేడాతో ఓడిపోయాడు. మిక్స్‌డ్ ఆర్చరీ టీమ్‌లో ధీరజ్ బొమ్మదేవర, అంకిత భకత్ భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. కాంస్య పతక పోరులోనూ ఈ జోడీ ఆడింది. ఈ మీట్‌లో భారత్‌కు మరో పతకం వస్తుందని అంతా భావించారు. కానీ, అమెరికాకు చెందిన కేసీ కౌఫోల్డ్, బ్రాడీ ఎలిసన్ 2-6తో ధీరజ్ బొమ్మదేవర, అంకితా భకత్ జోడీని ఓడించి పతకం సాధించాలనే భారత్ కలను నీరుగార్చారు. ఇక్కడ కూడా ఈ భారత జోడీ నాలుగో స్థానం దక్కించుకుంది.
మీరాబాయి చానుకు నిరాశే..
వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను నుంచి దేశంలోని కోట్లాది మంది క్రీడాభిమానులు పతకం ఆశించారు. టోక్యో ఒలింపిక్స్‌లో మీరాబాయి చాను రజత పతకం సాధించింది. ఆమె నుంచి ఈసారి బంగారు పతకం ఆశించారు. అయితే, కేవలం 1 కేజీ తేడాతో 4వ స్థానంతో నిలిచింది. అంచనాలకు మించి ఆటతీరుతో మహిళల రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో వినేశ్ ఫొగట్ ఫైనల్ చేరింది. అయితే, ఫైనల్స్‌కు ముందు బరువు పెరగడంతో ఆమె సస్పెండ్‌కు గురైంది. దీంతో కనీసం పతకం కూడా లేకుండానే ఇంటిదారి పట్టింది. ఈ ఘటన జరిగి ఉండకపోతే భారత్‌కు బంగారు పతకం లేదా రజత పతకం వచ్చి ఉండేది. దీంతో తీవ్ర భావోద్వేగానికి లోనైన వినేశ్ ఆటకు వీడ్కోలు పలికింది.