Sunday, January 19, 2025

చేజేతులా చేజారింది

- Advertisement -
- Advertisement -

ఉప్పల్ : గెలుపొందే మ్యాచ్‌లో తడబాటుతో టీమిండియా చేజేతులా మ్యాచ్‌ను చేజార్చుకుంది. అందరూ భారత్ గెలుపు ఖయమనకున్నా తరుణంలో ఇంగ్లండ్ బౌలర్ టామ్ హరల్టీ స్పిన్ ఉచ్చులో చిక్కుకుని 28 పరుగుల తేడాతో ఓటమిని మూడగట్టుకుంది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో భారత్ ఓటమి పాలైంది. దీంతో ఇంగ్లండ్ జట్టు సిరీస్‌లో 01తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

ఆదుకున్న ఓలే పోప్
అదివారం నాలుగో రోజు ఆటలో స్పిన్నర్ల హవా కొనసాగింది. భారీ సెంచరీతో కీలక ఇన్నింగ్స ఆడిన ఓలే పోప్ డబుల్ సెంచరీ చేజార్చుకున్నా ఇంగ్లండ్‌కు భారీ ఆధిక్యతను అందించాడు. ఓ దశలో ఇంగ్లాండ్ 163 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ, పోప్ ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. బెన్ ఫోక్స్‌తో కలిసి ఆరో వికెట్‌కు 112 పరుగులు, రెహాన్ అహ్మద్‌తో కలిసి ఏడో వికెట్‌కు 64, ఎనిమిదో వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఇంగ్లండ్‌ను ఆదుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో 420 రన్స్‌కు ఆలౌట్ అయింది. భారత్ ముందు 231 పరుగుల లక్షాన్ని ఉంచగలిగింది. భారత బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు, అశ్విన్ మూడు, జడేజా రెండు, అక్షర్ ఒక్క వికెట్ తీశారు.

బ్యాట్లెత్తేశారు..
231 పరుగుల లక్ష్య చేధనలో భారత్ తొలుత నిలకడగానే ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు తొలి వికెట్ కి 42 రన్స్ జోడించారు. అయితే జైస్వాల్, గిల్ వెంట వెంటనే ఔట్ అవడం, దూకుడుగా ఆడుతున్న రోహిత్ శర్మ కూడా వెనుదిరగడంతో భారత్ కష్టాల్లో పడింది. ఇక్కడ నుంచి వికెట్ల పతనం క్రమం తప్పకుండా కొనసాగింది. అక్షర్ పటేల్ 17, కెఎల్ రాహుల్ 22 పరుగులకు ఔటవగా జడేజా రనౌట్ కూడా కొంపముంచింది. శ్రేయాస్ అయ్యర్ సయితం నిరాశపరచడంతో భారత్ ఓటమి ఖాయమైంది. అయితే కెఎస్ భరత్ , అశ్విన్ 55 పరుగుల భాగస్వామ్యంతో గెలుపు మళ్లీ ఆశలు చిగురించాయి. అయితే చివర్లో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మరో అరగంట సేపు ఆట కొనసాగించే నిబంధనను కోరడంతో భారత్‌పై ఒత్తిడి పెరిగింది. ఫలితంగా శ్రీకర్ భరత్, అశ్విన్ వెంటవెంటనే ఔటయ్యారు. చివర్లో బుమ్రా, సిరాజ్ అసాధారణ బ్యాటింగ్‌తో ఆఖరి వికెట్‌కు 25 పరుగులు జోడించి ఆశలు రేకెత్తించారు. సిరాజ్ స్టంపౌటవ్వడంతో భారత్ ఇన్నింగ్స్‌కు 202 పరుగులకు తెరపడింది. రెండో టెస్ట్ విశాఖ వేదికగా ఫిబ్రవరి 2 నుంచి జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News