Saturday, September 21, 2024

భారత్ తొందరపడింది

- Advertisement -
- Advertisement -

India made false assumptions about Coronavirus: Fauci

వాషింగ్టన్ : కరోనా వైరస్ విషయంలో భారతదేశం తప్పుడు అంచనాలతో వ్యవహరించిందని అమెరికా జాతీయ స్థాయి వైద్య నిపుణులు డాక్టర్ ఆంథోనీ ఫౌచీ తేల్చిచెప్పారు. అంతా నయం అయిందని, అన్‌లాక్ ప్రక్రియకు తొందరపడి వెళ్లడం వల్ల విపరీత పరిస్థితి ఏర్పడిందని, ఇప్పటి దయనీయ కొవిడ్ స్థితికి దారితీసిందని ఫౌచీ అమెరికా సెనెటర్లతో తెలిపారు. భారత్‌లో ఇప్పుడు సెకండ్ వేవ్ వైరస్ విజృంభణ ప్రపంచదేశాలను కూడా కలవరపరుస్తోంది. ఇప్పటి దుస్థితి ఎటువంటి వైపరీత్యాలకు దారితీస్తుందో చెప్పలేమని ఈ వైద్య ప్రముఖుడు హెచ్చరించారు. వైరస్ పూర్తిగా సమసిపోవడానికి ముందే తొందరపడి ఆర్థిక వ్యవస్థ పురోగతి కోసం మార్కెట్ ఓపెన్‌కు వెళ్లడం కీలక పరిణామం అయిందని తెలిపారు.

అమెరికా సెనెట్‌కు సంబంధించిన ఆరోగ్య, విద్యా, కార్మిక, పెన్షన్ల కమిటీ ఎదుట సభ్యులతో మాట్లాడుతూ ఫౌచీ భారత్‌లో పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్ తొలిదశలో అమెరికా ఎదుర్కొన్న స్థితిని ఇప్పుడు ఇండియా అనుభవిస్తోన్న విషయాన్ని ఈ సందర్భంగా సెనెటర్ పాటీ ముర్రే గుర్తుచేశారు. అమెరికాలో అన్ని చోట్ల వైరస్ మూలాలు సమసిపోయిన తరువాతనే ఓపెనింగ్ ప్రక్రియ జరిగిందని, ఈ లోగా వ్యాక్సిన్లు, ఇతరత్రా జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు అమెరికా వైరస్ చిక్కుల నుంచి బయటపడిందని కమిటీ సారథ్యం వహించే ముర్రే తెలిపారు. అయితే ఇండియాలో తొందరపాటు చర్యల వల్ల దారుణ పరిస్థితి ఏర్పడం బాధాకరం అన్నారు. మంటలు చల్లారకముందు ప్రజలు బయటకు రావడం వల్ల అగ్నికి ఆజ్యం పరిస్థితి ఏర్పడిందని., ఇండియాలో సెకండ్ వేవ్ ప్రజలను దెబ్బతీస్తోందని సెనెటర్లు బాధాభిప్రాయం వ్యక్తం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News