Friday, November 22, 2024

భారత్‌కు స్వర్ణాలు..

- Advertisement -
- Advertisement -

హాంగ్‌జౌ : ఆసియా గేమ్స్‌లో భారత్‌కు పతకాల పరంపర కొనసాగుతోంది. రెండో రోజు అయిన సోమవారం భారత్ ఖాతాలో రెండు స్వర్ణ, నాలుగు కాంస్య పతకాలు వచ్చి చేరాయి. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత్ తొలి స్వర్ణాన్ని ముద్దాడగా.. భారత మహిళ క్రికెట్ టీమ్ ఫైనల్లో శ్రీలంకపై నెగ్గి, తొలి స్థానంలో నిలిచి మరో స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. ఇక షూటింగ్‌లో భారత టీమ్ రెండు కాంస్యాలు నెగ్గగా రోయింగ్ మరో రెండు కాంస్యాలు చేజిక్కించుకుంది భారత్.

షూటింగ్‌లో స్వర్ణం..
పురుషుల 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్ విభాగంలో టీమ్‌ఇండియా స్వర్ణ పతకం గెలుపొంది. రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, దివ్యాన్ష్ సింగ్ పన్వర్‌తో కూడిన భారత జట్టు ఫైనల్‌లో 1893.7 పాయిట్లు నమోదుచేసి ప్రపంచ రికార్డును బద్దలుకొట్టారు. దీంతో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో చైనా నెలకొల్పిన 1893.3 పాయింట్ల రికార్డు కనుమరుగైంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో ఐశ్వరి ప్రతాప్ సింగ్ తోమర్ కాంస్యం కైవసం చేసుకున్నాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో తోమర్ 228.8 స్కోర్‌తో మూడో స్థానంలో నిలిచి కాంస్యం దక్కించుకున్నాడు. చైనా షూటర్ చెంగ్ లిహావో 253.3 పాయింట్లతో అగ్ర స్థానంలో నిలిచి పసిడి పతకాన్ని సాధించగా, కొరియా షూటర్ పార్క్ హజున్ 251.3 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజతం గెలిచాడు. అంతకుముందు బంగారు పతకం గెలిచిన పురుషుల టీమ్‌లో కూడా ప్రతాప్ తోమర్ సభ్యుడుగా ఉన్నాడు. ఇక మెన్స్ 25 మీటర్ల రాపిడ్ ఫైర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో ఆదర్శ్ సింగ్ టీమ్ కాంస్యం గెలుపొందింది.

విజయ్‌వీర్ సిధు, అనిష్ భన్వాలా, ఆదర్శ్ సింగ్‌లతో కూడిన జట్టు 1718 స్కోర్‌తో మూడో స్థానంలో నిలిచి కాంస్యం నెగ్గింది. 1765 స్కోర్‌తో చైనా స్వర్ణం గెలువగా, 1734 స్కోర్‌తో కొరియా వెండి దక్కించుకుంది. కాగా, ఇప్పటి వరకు షూటింగ్ భారత్ సాధించిన పతకాల సంఖ్య 4కు చేరింది.రోయింగ్‌లో కాంస్యాల పంట రోయింగ్ పురుషుల ఫోర్ ఈవెంట్ విభాగంలో భారత టీమ్ కాంస్య పతకం సాధించింది. జస్విందర్ సింగ్, భీమ్ సింగ్, పునీత్, ఆశిష్‌లతో కూడిన జట్టు 6:10.81 సెకన్ల టైమింగ్‌తో మూడో స్థానంలో నిలిచింది. ఇదే ఈవెంట్‌లో 6:04.96 సెకన్లతో ఉబ్జెకిస్థాన్ బంగారు పతకం కైవసం చేసుకోగా, 6:10.04 సెకన్లతో చైనా రజతం సొంతం చేసుకున్నది. ఇక మెన్స్ క్వాడ్రబుల్ స్కల్స్ విభాగంలో భారత్ మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలుచుకుంది. 6:08:61 నిమిషాల టైమింగ్‌తో సత్నామ్ సింగ్, పర్మీందర్ సింగ్, జకార్ ఖాన్, సుఖ్‌మీత్ సింగ్‌లతో కూడిన భారత టీమ్ ఈ పోటీలో పాల్గొంది.

అంతకంటే అత్యుత్తమ టైమింగ్ నమోదు చేసిన చైనా జట్టు మొదటి స్థానంలో నిలిచి స్వర్ణం సొంతం చేసుకుంది. ఉబ్జెకిస్థాన్ రెండో స్థానంలో నిలిచి రజతం సాధించింది. కాగా, రోయింగ్ విభాగంలో భారత 5 పతకాలను సొంతం చేసకుంది. నిన్న రోయింగ్‌లో రెండు కాంస్యాలు, ఒక రజతం వచ్చిన విషయం తెలిసిందే.

క్రికెట్‌లో భారత్‌కు పసిడి పతకం..
ఆసియా గేమ్స్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్ పోరులో శ్రీలంకతో గోల్డ్ ఫైట్‌కు దిగిన భారత టీమ్ 19 పరుగుల తేడాతో గెలుపొంది తొలి స్థానంలోకి దూసుకెళ్లి పసిడి పతకాన్ని ఒడిసిపట్టింది. తొలుత టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో స్మృతిమంధాన (46), జెమీమా రోడ్రిగ్(42)లు బ్యాట్ ఝలిపించారు. అనంతరం స్వల్ప లక్ష ఛేదనకు దిగిన శ్రీలంక మహిళల జట్టు భారత బౌలర్ల ధాటికి 97 పరుగులే చేసింది. దీంతో భారత్ గెలుపు లాంఛనమైంది. భారత బౌలర్లలో టిటాస్ సాధు మూడు వికెట్లు పడగొట్టగా మరో బౌలర్ రాజేశ్వరీ రెండు వికెట్లు సాధించింది. గెలుపుతో అగ్రస్థానంలో నిలిచిన భారత అమ్మాయిల టీమ్ గోల్డ్ మెడల్ కైవసం చేసుకోగా.. రెండు స్థానంలో నిలిచిన లంక మహిళల జట్టు రజతంతో సరి పెట్టుకుంది. కాగా, ఇప్పటి వరకు భారత్ ఖాతాలో 11 పతకాలు వచ్చి చేరగా పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News