Monday, November 18, 2024

చాయ్ సమోసాలకే ఇండియా కూటమి భేటీలు పరిమితం

- Advertisement -
- Advertisement -

జెడియు ఎంపి పింటూ విమర్శలు

న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి విజయం సాధించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించిన జనతాదళ్(యునైటెడ్) పార్లమెంట్ సభ్యుడు సునీల్ కుమార్ పింటూ తాజాగా మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం ప్రతిపక్ష పార్టీల మధ్య సీట్ల పంపకం జరిగేంతవరకు ప్రతిపక్ష ఇండియా కూటమి నిర్వహించే సమావేశాలు చాయ్ సమోసాలకే పరిమితం అవుతాయని గురువారం పింటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ హైతో మున్కిన్ హై(మోడీతో ఏదైనా సాధ్యమే) అన్న బిజెపి నినాదాన్ని ప్రస్తావిస్తూ మూడు రాష్ట్రాలలో బిజెపి సాధించిన విజయాలకు మోడీని కీర్తించిన పింటూ గురువారం తన వ్యాఖ్యలను విలేకరుల వద్ద సమర్థించుకున్నారు.

హిందీ భాషను మాట్లాడే రాష్ట్రాల ప్రజలు మోడీని నమ్ముతున్నారనడానికి తాజా ఎన్నికల ఫలితాలే నిదర్శనమని, తాను ఈ వాస్తవాలనే చెబుతున్నానని ఆయన అన్నారు. ప్రజల మనోభీష్టాలను మనం అర్థం చేసుకుని రానున్న ఎన్నికల కోసం మనం వ్యూహాలను రూపొందించుకోవాలని ఆయన సూచించారు. తాను బిజెపి మనిషినని, తన ఊపిరి ఉన్నంతవరకు బిజెపి మనిషిగానే కొనసాగుతానని పింటూ స్పష్టం చేశారు. తనను జెడి(యు)లోకి పంపింది బిజెపియేనని ఆయన వెల్లడించారు. తన నాయకుడు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కోరితే తక్షణమే ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి తాను సిద్ధమని ఆయన ప్రకటించారు. రాష్ట్రీయ జనతా దళ్(ఆర్‌జెడి)తో పొత్తులో వచ్చే లోక్‌సభ ఎన్నికలలో పోటీచేయడం తనకు అసౌకర్యంగా ఉందని కూడా ఆయన తెలిపారు.

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత జెడియు ఎంపి పింటూ బిజెపి నినాదాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోడీని కీర్తించడంతో బీహార్‌లో తీవ్ర దుమారం రేగింది. సీతామఢి పార్లమెంటరీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జెడియు ఎంపి పింటూ ప్రధాని మోడీని ప్రస్తుతించడంతో జెడియులో పలువురు నాయకులకు మింగుడుపడడం లేదు. ప్రధాని మోడీ భజనలో తరిస్తున్న పింటూ తన లోక్‌సభ సభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేయాలని జెడియు అధికార ప్రతినిధి ధీరజ్ కుమార్ డిమాండ్ చేయడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News