భువనేశ్వర్: సొంత గడ్డపై జరిగిన పురుషుల హాకీ ప్రపంచకప్‌లో ఆతిథ్య భారత జట్టు పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత్ మెరుగైన ప్రదర్శన చేస్తుందని అభిమానులు భావించారు. అయితే హాకీ జట్టు మాత్రం ఘోరంగా విఫలమైంది. కనీసం క్వార్టర్ ఫైనల్‌కు కూడా చేరకుండానే ఇంటిదారి పట్టింది. భారీ ఆశలతో బరిలోకి దిగిన భారత్ తొమ్మిదో స్థానంతోనే సరిపెట్టుకుంది. ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించడంతో భారత జట్టుపై అంచనాలు భారీగా పెరిగాయి. అంతేగాక స్వదేశంలో టోర్నీ జరగడంతో ట్రోఫీ సాధించినా ఆశ్చర్యం లేదని అందరూ భావించారు. కానీ భారత్ మాత్రం అంచనాలకు తగ్గ ఆటను కనబరచలేక పోయింది.
స్పెయిన్, వేల్స్‌పై అతి కష్టం మీద విజయం సాధించింది. మరో మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. ఇక క్వార్టర్ ఫైనల్ బెర్త్ కోసం జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైంది. ఇదిలావుంటే భారత పేలవమైన ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాన కోచ్ పదవికి గ్రాహమ్ రీడ్ రాజీనామా చేశారు. ఆయతో పాటు ఇతర సిబ్బంది కూడా తమ పదవుల నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని భారత హాకీ సమాఖ్య ధ్రువీకరించింది.
ఇదిలావుంటే ఆస్ట్రేలియాకు చెందిన రీడ్ 2019లో భారత హాకీ ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఆయన మార్గదర్శకంలో భారత్ ప్రపంచ హాకీలో మెరుగైన జట్లలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. ఇదే క్రమంలో టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించి సత్తా చాటింది. అంతేగాక ఆసియాకప్, ఆసియా క్రీడల్లో కూడా మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. కానీ మెగా ఈవెంట్ వరల్డ్ కప్‌లో మాత్రం పేలవమైన ప్రదర్శనతో లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది.