ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్టు వెల్లడి
న్యూఢిల్లీ : భారత క్షిపణి వ్యవస్థ అత్యంత విశ్వసనీయమైందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం పొరపాటున దూసుకెళ్లిన క్షిపణి, పాకిస్థాన్ భూభాగంలో కూలిన ఘటనపై మంగళవారం ఆయన పార్లమెంట్‌లో స్పందించారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్టు తెలియచేశారు. “మన ఆయుధ వ్యవస్థ భద్రతకు మేం అధిక ప్రాధాన్యం ఇస్తాం. ఈ క్రమంలో ఏదైనా లోపం కనిపిస్తే వెంటనే సరిదిద్దుకుంటాం. మన క్షిపణి వ్యవస్థ అత్యంత విశ్వసనీయమైంది. సురక్షితమైంది.
దీనిపై నేను సభా వేదికగా హామీ ఇవ్వాలనుకుంటున్నాను. మన భద్రతా విధానం ప్రొటోకాల్స్ ఉన్నత స్థాయిలో ఉన్నాయి. మన బలగాలు సుశిక్షితమైనవే కాకుండా క్రమశిక్షణ కలిగి ఉంటాయి. ఈ తరహా వ్యవస్థలను నిర్వహించడంతో మంచి అనుభవం కలిగి ఉన్నాయి”. అని రాజ్‌నాధ్ సింగ్ వెల్లడించారు. అలాగే ఈ ఘటనపై మంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ క్షిపణి కారణంగా ఎవరూ గాయపడలేదని తెలిసి తేలికపడ్డామని చెప్పారు. కేంద్రం దీన్ని తీవ్రంగా పరిగణించిందని, ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించామని, దర్యాప్తులో కచ్చితమైన కారణాలు తెలుస్తాయని మంత్రి వివరించారు.