దిల్లీ: భారత్ అభివృద్ధిని ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ఇటీవల దావోస్ పర్యటనలోనూ గమనించానని అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న బాబు మీడియాతో మాట్లాడారు. అప్పుడు ఐటిపై ఇప్పుడు ఏఐపై దృష్టి పెరిగిందని తెలియచేశారు. 2047 కల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. ఏఐ సాంకేతికలో భారత్ ప్రముఖ పాత్ర వహించనుందని, ప్రపంచ దేశాల్లో భారత్ పేరు మార్మోగుతోందని చంద్రబాబు వెల్లడించారు. వికసిత్ భారత్ లక్షాలను అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు.
పన్ను సంస్కరణల్లో చాలా మార్పులు జరిగాయని, ఎంఎస్ఎంఈ పాలసీ గేమ్ ఛేంజర్ గా మారబోతోందని సూచించారు. ఇప్పుడు పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్టనర్ షిప్ విధానమే ఉందని, భారత్ లో పెట్టుబడు పెట్టేందుకు చాలామంది ముందుకొస్తున్నారని చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. పలు రంగాల్లో భారీగా పెట్టుబడులు రాబోతున్నాయని, నూతన ఆవిష్కరణలతో మౌలిక సదుపాయాల కల్పన పెరుగుతోందని సంతోషం వ్యక్తం చేశారు. వృద్ధిరేటు పెంచేలా ఈ బడ్జెట్ ఉందని, ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య వేత్తల్లో భారతీయులే ప్రముఖంగా ఉంటున్నారని, సంపద సృష్టించాలని, అది పేదలకు పంచాలని చంద్రబాబు పేర్కొన్నారు.