కేంద్ర మంత్రి సింధియా వెల్లడి
న్యూఢిల్లీ: డ్రోన్ సేవలను విస్తృతం చేయడానికి కేంద్ర ప్రభుత్వంలోని 12 మంత్రిత్వశాఖలు ప్రయత్నిస్తున్నాయని, రానున్న రోజుల్లో భారత్‌కు దాదాపు లక్ష మంది డ్రోన్ పైలట్ల అవసరం ఉంటుందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. మంగళవారం నీతి ఆయోగ్ ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ మూడు చక్రాల ప్రాతిపదికన డ్రోన్ రంగాన్ని ముందుకు నడపడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మొదటి చక్రం విధానపరమైన నిర్ణయాలని, రెండవది రాయితీలు కల్పించడమని, మూడవది వివిధ మంత్రిత్వశాఖల ద్వారా డ్రోన్ సర్వీసులకు దేశీయంగా డిమాండు కల్పించడమని ఆయన తెలిపారు. డ్రోన్ విధానాన్ని అత్యంత వేగంగా అమలులోకి తీసుకువచ్చామని, ఉత్పాదక ఆధారిత రాయితీల పధకం(పిఎల్‌ఐ) ద్వారా డ్రోన్ రంగంలో ఉత్పత్తి, సర్వీసులకు ఊతమివ్వడం జరుగుతోందని ఆయన చెప్పారు. 12వ తరగతి పాసైన వ్యక్తికి డ్రోన్ పైలట్‌గా శిక్షణ ఇవ్వవచ్చని, ఇందుకు కాలేజీ డిగ్రీలు అవసరం లేదని ఆయన తెలిపారు. రెండు మూడు నెలల శిక్షణ పూర్తి చేసుకున్న వ్యక్తి డ్రోన్ పైలట్‌గా నెలకు సుమారు రూ. 30,000 జీతం పొందవచ్చని సింధియా పేర్కొన్నారు. రానున్న కాలంలో దాదాపు లక్షమంది డ్రోన్ పైలట్ల అవసరం ఉంటుందని, రంగంలో ఉపాధి అవకాశాలు అద్భుతంగా ఉంటాయని ఆయన చెప్పారు.