Friday, January 24, 2025

సమున్నత స్థాయికి భారత్‌-నేపాల్ బంధం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారత్ నేపాల్ సంబంధాలను తాము హిమాలయాల స్థాయి ఉన్నతికి తీసుకువెళ్లుతామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. సరిహద్దు వివాదాలు ఇతర జటిలతలను ఇదే స్ఫూర్తితో పరిష్కరించుకుంటామని చెప్పారు. నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహాల్ ప్రచండత విస్తృతస్థాయి చర్చల తరువాత ప్రధాని మోడీ గురువారం మాట్లాడారు. ఆ తరువాత మీడియాకు ప్రధాని తరఫున ప్రకటన వెలువరించారు.

భారత్‌లో నాలుగురోజుల పర్యటనకు నేపాల్ నేత బుధవారం ఇక్కడికి వచ్చారు. ఇరువురు నేతలు ఇరుదేశాల మధ్య పటిష్ట సంబంధాల దిశలో పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలను, శంకుస్థాపనలను రిమోట్ కంట్రోలు పద్ధతిలో జరిపారు. ఉభయ దేశాల మధ్య భాగస్వామ్యం భవిష్యత్తులో సూపర్‌హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీమాంతర పెట్రోలియం పైప్‌లైన్ విస్తరణ, జలవిద్యుత్ విషయంలో మరింతగా సహకారం వంటి కీలక అంశాలకు సంబంధించి ఉభయపక్షాలు ఏడు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఇరుదేశాల మధ్య రవాణా సంబంధిత ఒప్పందాన్ని సవరించడం మరో కీలక మలుపుగా నిలిచింది.

తాము తొమ్మిదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పొరుగుదేశం నేపాల్‌తో సంబంధాలకు ప్రాధాన్యత పెరుగుతూ వచ్చిన విషయాన్ని ప్రధాని ప్రస్తావించారు. 2014లో తాను అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో నేపాల్‌కు తొలిసారి వెళ్లినప్పుడు ఇరు దేశాల మధ్య సంబంధాల దిశలో హిట్ ఫార్మూలాను (హైవేస్, ఐ వేస్, ట్రాన్స్‌వేస్) ప్రతిపాదించినట్లు, ఇప్పుడు ఈ సంబంధాలు సూపర్‌హిట్ దిశకు వెళ్లుతాయని తెలిపారు. పొరుగుదేశానికి తగు ప్రాధాన్యత అనే మోడీ ఆలోచన తనను ఆకట్టుకుందని ఈ సందర్భంగా నేపాల్ ప్రధాని తెలిపారు. ఇరుదేశాల మధ్య స్నేహం చిరకాలానిది అని, బహుముఖమని చెప్పారు. ప్రధాని మోడీకి తొమ్మిదేళ్ల పాలనా దశ పట్ల అభినందనలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News