Thursday, January 23, 2025

పాకిస్థాన్‌తో భారత్ ఎన్నడూ వాణిజ్యాన్ని ఆపలేదు: భారత దౌత్యవేత్త

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: భారత్ ఎప్పుడూ పాకిస్థాన్‌తో వాణిజ్య సంబంధాలను ఆపేయలేదని, ఎప్పుడూ సాధారణ వాణిజ్య సంబంధాలు కొనసాగేలా చూసిందని భారతీయ దౌత్యవేత్త ఇక్కడ తెలిపారు. నేటి దౌత్యం పర్యాటకం, వాణిజ్యం, సాంకేతికతలపై దృష్టి పెట్టాల్సి ఉంది, ‘ఎందుకంటే డబ్బే తన బాషను నేడు మాట్లాడుతోంది’ అన్నారు. పాకిస్థాన్‌లోని భారత డిప్యూటీ హైకమిషనర్ సురేశ్ కుమార్ శుక్రవారం లాహోర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎల్‌సిసిఐ)లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు పాకిస్థాన్‌కు చెందిన ‘డాన్’ వార్తా పత్రిక పేర్కొంది.

‘పాకిస్థాన్‌తో భారత్ ఎప్పుడూ మంచి సంబంధాలనే కోరుకుంది. ఎందుకంటే మనము జాగ్రఫీని మార్చలేము.మేము పాకిస్థాన్‌తో మామూలు సంబంధాలనే కోరుకుంటున్నాము. పాకిస్థాన్‌తో మేమెప్పుడూ వాణిజ్యాన్ని ఆపేయలేదు, కాకపోతే పాకిస్థానే భారత్‌తో తన వాణిజ్యాని ఆపింది. సమస్యలను, పరిస్థితులను ఎలా మార్చగలమనేది మనం ఆలోచించాల్సి ఉంది ’ అని సురేశ్ కుమార్ అన్నారు.

పాకిస్థాన్, భారత్‌తో 2019లో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను తెంచేసుకుంది. జమ్మూకశ్మీర్ ప్రత్యేక హోదాను భారత్ తొలగించేశాక పాకిస్థానే ఇస్లామాబాద్‌లోని భారత హై కమిషనర్‌ను బహిష్కరించింది. పొరుగు దేశమైన పాకిస్థాన్‌తో సాధారణ సంబంధాలనే భారత్ ఎప్పుడూ కోరుకుంది. కానీ పాకిస్థానే భారత్‌లో ఉగ్రవాద సమస్యలు సృష్టిస్తూ వచ్చింది. 2019-20లో పాకిస్థాన్‌తో భారత్ వాణిజ్యం 830.58 మిలియన్ డాలర్లు ఉండగా, 2020-21లో అది 329.26 మిలియన్ డాలర్లకు తగ్గిపోయిందని డేటా తెలుపుతోంది. దీనికి కారణం కూడా పాకిస్థానే.

కొవిడ్19 మహమ్మారి కాలంలో పాకిస్థానీలకు జారీ చేసిన వీసాలు తక్కువేనని భారత హైకమిషనర్ సురేశ్ కుమార్ తెలిపారు. అయితే ఇప్పుడు పాకిస్థానీలకు ప్రతి ఏడాది 30,000 వరకు వీసాలు జారీ చేస్తున్నట్లు తెలిపారు. ఇది పెద్ద సంఖ్య అనే చెప్పాలన్నారు. పాకిస్థానీలకు భారత ప్రభుత్వం మెడికల్, స్పోర్ట్ వీసాలను కూడా జారీ చేస్తోందని ఆయన తెలిపారు. పూర్వపు దౌత్య విధానాలు పోయాయని, నేడు దౌత్యం పర్యాటకం, వాణిజ్యం, టెక్నాలజీ చుట్టూ తిరుగుతున్నాయని, నేడు డబ్బే తన భాష మాట్లాడుతోందని ఆయన తెలిపారు. ప్రస్తుతం భారత్, చైనాతో 120 బిలియన్ డాలర్ల వాణిజ్యాన్ని కలిగి ఉంది. చైనాతో భారత్ వాణిజ్యం సమతుల్యంగానే ఉంది.

లాహోర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎల్‌సిసిఐ) అధ్యక్షుడు కషీఫ్ అన్వర్ మాట్లాడుతూ భారత, పాకిస్థాన్ మధ్య ఆర్థిక సంబంధాలు మెరుగుపరచడం చాలా క్లిష్టమైన అంశం(కాంప్లెక్స్ ఇష్యూ) అని తాను భావించానని, దానికి రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలను పరిష్కరించాల్సి ఉంటుందని భావించానని తెలిపారు. ‘ప్రస్తుతం పాకిస్థాన్, భారత్‌తో ఆర్థిక సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు కృషి చేస్తోంది. ఇది రెండు దేశాలకు ప్రయోజనం చేకూర్చనుంది’ అని ఆయన తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News