ఈస్టిండియా, ఇండియన్ ముజాహిద్దీన్‌లో కూడా ఇండియా ఉంది
బిజెపి పార్లమెంటరీ పార్టీ భేటీలో ప్రతిపక్షాల కూటమిపై ప్రధాని మోడీ విసుర్లు
న్యూఢిల్లీ: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించే లక్షంతో ఒక్క తాటిపైకి వచ్చిన విపక్షాలు తమ కూటమి పేరును ‘ఇండియా’గా ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 26 పార్టీల కలయికే ఇండియా అని బెంగళూరులో ఇటీవల జరిగిన సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. అయితే కేవలం ‘ఇండియా ’ అని పేరు పెట్టుకున్నంత మాత్రాన సరిపోదంటూ ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజునుంచి మణిపూర్‌లో హింసాకాండ అంశంపై పార్లమెంటు ఉభయ సభల్లో ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో మంగళవారం బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది.
Also Read: లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే జేడీ (ఎస్) పోటీ : దేవెగౌడ
ఈ సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ విపక్ష కూటమిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. విపక్ష పార్టీలు దిశా నిర్దేశం లేకుండా ఉన్నాయన్నారు. ఈస్టిండియా కంపెనీ, ఇండియన్ ముజాహిద్దీన్, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థల్లో కూడా ఇండియా పేరు ఉందని మోడీ గుర్తు చేశారు. ఇంతగా దిశ లేని విపక్షాన్ని ఎప్పుడూ చూడలేదని ప్రధాని మోడీ పేర్కొన్నారని బిజెపి సీనియర్ నేత, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ అన్నారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఈస్టిండియా కంపెనీలాంటి వాటిని కూడా విదేశీయులు ప్రారంభించినట్లు ప్రధాని విమర్శించారు.దేశం పేరును వాడుకుని ప్రజలను తప్పుదోవ పట్టించలేదని ప్రధాని విమర్శించారు. ఓడిపోయి, అలసిపోయి, ఆశలేని పార్టీలుగా విపక్షాలు మిగిలిపోయాయని ప్రధాని అన్నారు.