Wednesday, January 22, 2025

వైరుధ్యాల భారతదేశం

- Advertisement -
- Advertisement -

India of contradictions

భారతదేశ 75వ స్వతంత్ర దినోత్సవ సంబరాలను స్వదేశంలోనూ విదేశాలల్లో ఆజాదికా అమృత్ మహోత్సవం పేరుతో ఎంతో హట్టహాసంగా జరుపుకున్నాము కానీ ప్రస్తుతం భారత రాజ్యాంగం నిర్దేశించిన ఆశయాలను సాధించుటలో మాత్రం రాజ్యాంగ విలువలకు ఆశయాలకు విరుద్ధంగా ఉన్నట్లు మన దేశ సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో స్వాతంత్య్రం వచ్చినప్పటి వైరుధ్యాల కంటే విపరీతమైన వైరుధ్యాలతో వింత పోకడలుపోతున్నది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) స్థూల దేశీయ ఉత్పత్తి (జిడిపి) గణాంకాల ప్రకారం భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినట్లు బ్లూమ్ బర్గ్ పేర్కొంది. ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ 816 బిలియన్ డాలర్లు (రూ. 65.04 లక్షల కోట్లు), భారత్ 854.7 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.68.13 లక్షల కోట్లు)గా ఉంది. అయితే తలసరి ఆదాయం తో పాటు అనేక అంశాలలో భారత్ బ్రిటన్ కంటే బాగా వెనుబడి ఉంది. 2022 నాటికి భారత్‌లో 141 కోట్ల మంది జనాభా ఉండగా బ్రిటన్‌లో జనాభా 6.85 కోట్లు మాత్రమే ఉన్నారు.

2021లో బ్రిటన్ పౌరుల తలసరి ఆదాయం 47,334 డాలర్లు (దాదాపు రూ.38 లక్షలు) గా ఉంది, అదే భారతీయుల తలసరి ఆదాయం కేవలం రూ. 91,000 గా ఉంది, ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలకు సంబంధించిన మానవ వనరుల సూచీలో మాత్రం 1980లో బ్రిటన్ ఉన్న స్థితికి భారతదేశ చేరుకోవాలన్న కనీసం 10 సంవత్సరాలు పట్టవచ్చు అని బ్లూమ్ బర్గ్ పేర్కొంది. అంటే బ్రిటన్ కంటే భారత్ కనీసం 50 ఏళ్లు వెనుకబడి ఉందని స్పష్టమవుతుంది. ప్రపంచంలోని 205 దేశాలలోని తలసరి ఆదాయంలో భారతదేశ 158వ స్థానంలో ఉంది. పెద్ద నోట్ల రద్దు, కరోనా సంక్షోభాలతో ప్రజల ఆదాయంలో ఏమాత్రం పెరగకపోయినా భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం పరుగులు పెడుతున్న విషయం విస్మయాన్ని కలిగిస్తుంది. ఈ కాలంలోనే దేశంలో అంతరాలు భారీగా పెరిగి అదానీ, అంబానీ వంటి ఒకరిద్దరూ పెద్ద ఎత్తున సంపదలు పోగేసుకున్నారు.రిజర్వ్ బ్యాంకు గణాంకాల ప్రకారం 1980, 1990 సంవత్సరాల మధ్య దశాబ్ద కాలంలో దేశం జిడిపిలో సాధించిన వృద్ధిలో ప్రతి ఒక్క శాతానికి సంఘటిత రంగంలో సుమారు రెండు లక్షల ఉద్యోగాల కల్పనకు దారి తీసేది అంటే సుమారుగా సంవత్సరానికి 10 శాతం జిడిపి పెరిగితే 20 లక్షల చొప్పున సంఘటిత రంగంలో ఉద్యోగాలు అదనంగా వచ్చాయి. ఇప్పుడు అందుకు విరుద్ధంగా జిడిపి పెరుగుతుంటే నిరుద్యోగం కూడా పెరుగుతూ ప్రస్తుతం 6.8శాతంగా ఉంది.

కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ డిపార్టుమెంట్ ప్రభుత్వరంగ సంస్థల సర్వే పేరిట 2016-17 నుండి 2020-21 వరకు గల నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో గడిచిన ఐదు సంవత్సరాలలో 64 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను (సిపిఎస్‌ఇ) మూసి వేసినారు. ఈ విధంగా పరిశ్రమలు మూతపడటంతో ఉద్యోగ అవకాశాలు లేక చదువుకున్న నిరుద్యోగులు ఆధునిక బానిసత్వంలోకి బలవంతంగా నెట్టివేయబడుతున్నారు. బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచ అపర కుబేరుల్లో గౌతం అదానీ 137 బిలియన్ డాలర్లు (రూ.10. 90 లక్షల కోట్లు)లతో మూడో స్థానానికి ముఖేష్ అంబానీ 91.9 బిలియన్ డాలర్లు (రూ. 9.3 లక్షల కోట్లు) లతో 11 వ స్థానానికి ఎగబాకారు. ప్రతిరోజు అదానీ 756 కోట్లు, అంబానీ 375 కోట్లు సంపాదిస్తున్నా ఈ కార్పొరేట్స్‌కు గత ఐదు సంవత్సరాలలో రూ. 10 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేస్తూ వస్తున్నారు. ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో 10 శాతం జనాభా 77% జాతీయ సంపదను కలిగి ఉన్నారు. 2000 సంవత్సరంలో కేవలం 9 మంది బిలియనీర్స్ ఉంటే 2017 వచ్చేసరికి 101 మంది ఉన్నారు. ప్రస్తుతం 119 బిలియనీర్స్ ఉండగా 2018 నుంచి 2022 మధ్య ప్రతిరోజు 70 కొత్త మిలియనీర్స్ పుట్టుకొస్తున్నారు.2019-20 భారతదేశంలో ప్రత్యక్ష పనులు చెల్లించిన కార్పొరేట్ సంస్థలు, వ్యక్తుల సంఖ్య పరిశీలిస్తే 8.2 కోట్లు అంటే భారత జనాభాలో కేవలం 6.5% మాత్రమే ఆదాయపు పన్నును చెల్లిస్తున్నారు. కానీ ప్రజలందరూ చెల్లించే పరోక్ష పన్ను వస్తు సేవా పన్ను (జిఎస్‌టి) నుండి ప్రతినెల సుమారుగా రూ.1.40 లక్షల కోట్లు వసూళ్లు చేస్తున్నారు. అయినప్పటికీ ప్రపంచ బ్యాంకు డేటా ప్రకారం 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉన్న యువతకు ఉపాధి రేటు విషయంలో పోరుగు దేశాలైన పాకిస్తాన్ (38.9%) బంగ్లాదేశ్ (35. 3%) శ్రీలంకలో (24.1%) మంది ఉపాధి పొందుతుండగా, భారతదేశం (23.2%) మందికి మాత్రమే ఉపాధి దొరుకుతుంది అని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ మేనేజింగ్ డైరెక్టర్ & సిఇఒ మహేశ్ వ్యాస్ తెలిపారు.

నకిలీ నోట్లు బాగా చలామణిలో ఉంటున్నందున వాటిని అణచివేయాలంటే పెద్దనోట్ల రద్దు తప్పదని ప్రభుత్వం 2017లో నోట్ల రద్దు చేసింది 2016లో పట్టుకున్న నకిలీ కరెన్సీ రూ.15.9 కోట్లు ఉండగా, ఆ తర్వాత సంవత్సరాలలో 2017, 18, 19, 20, 21లలో వరుసుగా రూ. 28.10, 17.95, 25.39, 92.17, 20.39 కోట్లు ఉన్నాయి. ఈ నకిలీ సొమ్ములో 60 శాతం కేవలం రూ. 2000 నోట్లు ఉన్నాయని జాతీయ నేర గణాంకాల బ్యూరో పేర్కొంది. ఇదే ఐదు సంవత్సరాలలో ఐదు లక్షల చిన్న పరిశ్రమలు మూతబడిపోయి దానితో నిరుద్యోగం భారీగా పెరిగిపోయింది. ఉన్నత కులాలుగా చెప్పుకునే వారికి 5 ఎకరాల పంట భూమి 8 లక్షల సంవత్సర ఆదాయం, 1000 చదరపు అడుగుల ఇల్లు, 100 చదరపు గజాలు ప్లాటుకు తక్కువ ఉన్నవారికి ఆర్థికంగా బలహీన వర్గాలు అంటూ (ఇడబ్ల్యుఎస్) క్రింద 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. సామాజికంగా, విద్యాపరంగా బలహీనవర్గాలైన ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి కులాల వారికి 2.5 లక్షల ఆదాయం దాటితే వారికి రిజర్వేషన్ ద్వారా వచ్చే ఆర్థిక సదుపాయాలు అమలు కావడం లేదు.

దీనిని బట్టి ఉన్నత కులాల వారు సంవత్సరానికి 8 లక్షల రూపాయలు సంపాదించిన పేదవారే, కానీ బహుజనులు మాత్రం సంవత్సరానికి 2.5 లక్షల రూపాయలు సంపాదిస్తే ఆర్థికంగా బలమైన వర్గాలుగా చూపుతూ అవకాశాలను దూరం చేస్తూ సామాజిక న్యాయానికి పాతర వేస్తున్నారు. 2016వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లోని తుని వద్ద రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలును కాల్చివేస్తే సుమారుగా రూ. 41 కోట్లు రైల్వే వారికి నష్టం వచ్చింది. కానీ దోషులందరి మీద కేసులను మాఫీ చేశారు.అదే తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఒక మామిడికాయ కోశాడని చంపి పంచాయతీ ఆఫీస్‌లో ఉరివేసినారు. ప్రస్తుత భారత దేశంలో మనిషికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు సాటి మనుషులు, సంస్థలు మీడియా అన్ని వ్యవస్థలు కూడా ఆ మనిషి కులాన్ని బట్టి స్పందిస్తున్నారు అంటే మనిషి విలువను కులం ఆధారంగా చూస్తూ మానవత్వాన్ని పూర్తిగా చంపి వేశారు. ప్రపంచం ముందు తలదించుకునేలా 15 ఆగస్టు 2022, స్వాతంత్య్ర దినోత్సవం రోజు గుజరాత్ రాష్ట్రంలో క్షమాభిక్ష పేరుతో అత్యాచారం చేసి జైలు శిక్ష అనుభవిస్తున్న దోషులను విడుదల చేస్తే వారికి సన్మానాలు, సత్కారాలు చేస్తున్నారు.

ప్రపంచంలో అత్యంత పేదరికంలో ఉన్న జనాభా 68.9 కోట్ల అయితే అందులో భారత దేశంలో 20.17% ఉన్నారు. ప్రపంచ ఆహార సంస్థ ‘పోషక ఆహార భద్రతపై 2018’ నివేదిక ప్రకారం 19.59 కోట్ల మంది పస్తులతో పడుకుంటున్నారు. అవర్ వరల్డ్ సంస్థ 2017 నివేదిక ప్రకారం 57.1 కోట్ల మంది కనీస పోషక ఆహారాన్ని కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్నారు. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సర్వే 2021 ప్రకారం ఏటా పోషక ఆహారం అందక దేశంలో ఏటా 17 లక్షల మంది మరణిస్తున్నారు. ప్రపంచంలో పోషక ఆహారం అందని వారు 42 శాతం మంది ఉంటే మన దేశంలో ప్రపంచ సగటున పోలిస్తే మన దగ్గర సుమారుగా 30% అధికంగా ఉన్నారు. ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ విభాగం ప్రకారం పోషకాహార కొనుగోలుకు అయ్యే ఖర్చు ఒక మనిషి సంపదలో 63% దాటితే దానిని భరించలేని స్థితిగా (అన్ అఫార్డబుల్) పేర్కొనవచ్చు అని తెలియజేశారు. అడిగితే ప్రపంచానికి ఆహార అందిస్తాం అంటూ ఢాంబికాలు మాట్లాడుతూ మరో వైపు 92వ మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి మాట్లాడుతూ భజన చేయుట ద్వారా పోషక ఆహారం లోపాన్ని తగ్గించవచ్చు అని అంటున్నారు. అంటే సమాజం పట్ల వీరికి ఉన్న బాధ్యతను, అవగాహనను అక్షర జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరైనా అర్థం చేసుకొనవచ్చు. అందుకేనేమో ప్రస్తుతం ప్రపంచ పేదలకు రాజధానిగా నైజీరియా స్థానంలో భారత్ చేరింది. పోషక ఆహారం లోపం వలన 17.3% చిన్నారులు ఎత్తుకు తగ్గ బరువు లేరు. అదే విధంగా జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే ప్రకారం మనిషి బ్రతికి ఉండే జీవిత కాలాన్ని 2013-16లో పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో కులాల వారీగా అంచనా వేయగా పురుషులలో ఉన్నత కులాలు వారు 70.9, 68.3 సంవత్సరాలు ఇతర వెనుకబడిన తరగతుల వారు 67.5, 65.4 సంవత్సరాలు, ముస్లింలు 66.8, 67.0 సంవత్సరాలు షెడ్యూల్డ్ కులాల వారు 65.1, 62.8 సంవత్సరాలు షెడ్యూల్డ్ తెగ వారు 63.0, 62.4 సంవత్సరాలు. అలాగే మహిళలలో అన్ని కులాలలోనూ మరో ఐదు సంవత్సరాలు ఎక్కువగా ఉన్నది.

2018 ప్రపంచ ఆకలి సూచీ (గ్లోబల్ హంగర్ ఇండెక్స్) మేరకు 119 దేశాలలో భారత్ 103వ స్థానం ఆహార భద్రత చూచి ప్రకారం 113 దేశాలలో 76వ స్థానంతో ఘనా, బోలివియా కన్నా వెనుకబడి ఉంది. 2018లో 46 మంది ఆకలితో మరణించారు. స్వరాజ్ అభియాన్ సంస్ధ 2015 నివేదిక ప్రకారం మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల పరిధిలోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని 13 జిల్లాలలో 38% గ్రామాలలో 8 నెలల కాలంలో పల్లెకు ఒకరు చొప్పున పస్తులతో మరణించారని సర్వే బయటపెట్టినది. ప్లేట్లు మోగించి కొవ్వొత్తులు వెలిగిస్తే కరోనా తగ్గుతుంది అని చెప్తే ప్రజలు నమ్మి మోసపోయారు చివరకు ‘కోవిడ్‌తో మొత్తం మరణాలు అంచనా’ పేరుతో యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ ఇన్స్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవల్యూషన్ ఈ అధ్యయనం ప్రకారం భారత్‌లో అధికారిక మరణాల సంఖ్య 2,21,181 అయితే వాస్తవ మరణాల సంఖ్య 6,54,395 అంటే 4.3 లక్షల మరణాలను తక్కువగా నమోదు చేశారు.

భారతదేశంలోని ఈ అంతులేని అదుపులేని అసమానతలు కుల, మత, ప్రాంతీయ, లింగ ఆధారంగా ఉన్నాయి. ఇవి సమాజంలో పెద్ద అగాధాని సృష్టిస్తున్నాయి. మన దేశానికి పరాయి దేశస్తులైన బ్రిటిష్ వారి నుండి ఎన్నో త్యాగాలు చేసి స్వాతంత్య్రం సాధించుకున్నాము. కానీ 75 సంవత్సరాల స్వాతంత్య్ర భారతదేశంలో కూడా భారతదేశ అభివృద్ధి అధికారం సంపద అతి కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమయింది. ధనవంతులు మరింత ధనవంతులుగా మెజారిటీ బహుజనులను దోచుకుని ఎదుగుతుంటే పేదలైన బహుజనులు కనీస మానవ అవసరాలు కూడా తీర్చుకోలేని బలవంతపు నిరుపేదలుగా ఆధునిక బానిసత్వంలోనికి నెట్టివేయబడుతున్నారు. పరాయిపాలనలో ఉన్నప్పుడు దేశంలో ఏ సమస్య వచ్చినా విదేశీయులపై నిందలు వేసే వారికి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అది ఏ సమస్య అయినా పూర్తిగా మనమే బాధ్యత వహించాలి. పేదరికంలో మగ్గుతున్న మెజారిటీ బహుజనులకు విద్య, వైద్యం అందిస్తూ బాడ కార్పొరేట్లపై సంపద పన్నును పెంచుతూ అన్ని రంగాలలో బహుజనులకు సమాన అవకాశాలను కల్పిస్తూ సంపద అందరికీ సమానంగా దక్కేలాగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా భారత రాజ్యాంగం ఆశించిన ప్రజాస్వామ్య సమసమాజ స్థాపనకు అడుగులు వేయాలి. లేకపోతే బ్రిటిష్ వారిని తరిమి కొట్టడానికి చేసిన స్వాతంత్య్ర పోరాటం మాదిరిగా అంతర్గత భారతదేశంలో మరో స్వాతంత్య్ర పోరాటానికి నాంది పలికే అవకాశం ఉన్నది.

డా. బోరుగడ్డ సుబ్బయ్య- 9492704401

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News