పశ్చిమ బెంగాల్ సమీపంలోని సరిహద్దుల్లో టర్కీ తయారీ డ్రోన్లను బంగ్లాదేశ్ మోహరించిందన్న సమాచారంతో భారత్ అప్రమత్తం అయింది. సరిహద్దులు వద్ద నిఘాను భారత్ పెంచింది. షేఖ్ హసీనా ప్రభుత్వ పతనం దరిమిలా సరిహద్దు ప్రాంతాల్లో తీవ్రవాద కార్యకలాపాలు పెరిగినట్లు నిఘా వర్గాల సమాచారం నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. భారత సరిహద్దు సమీపంలో టర్కీ తయారీ ‘బైరాక్టర్ టిబి2’ మానవరహిత వైమానిక వాహనాలు (యుఎవిలు) మోహరించినట్లు వచ్చిన నివేదికలను ఆర్మీ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. నిఘా కార్యకలాపాల కోసం బంగ్లాదేశ్‌లోని 67వ ఆర్మీ వాటిని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ రక్షణ అవసరాల కోసం వాటిని మోహరించినప్పటికీ,
అధునాతన డ్రోన్లను సున్నిత ప్రాంతాల్లో ఉంచడంతో భారత్ అప్రమత్తం అయింది. ఉగ్రవాద గ్రూపులపై హసీనా ప్రభుత్వం ఉక్కు పాదం మోపింది. ఆమె భారత్‌కు పారిపోయిన తరువాత సరిహద్దు సమీప ప్రాంతాల్లోని తీవ్రవాదులు మళ్లీ పుంజుకున్నారు. దేశంలోని ప్రస్తుత అస్థిర పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్న ఉగ్రవాద గ్రూపులు, స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లు భారత్‌లోకి చొరబడుతున్నట్లు సమాచారం. హసీనా బహిష్కరణ తరువాత సరిహద్దు ప్రాంతంలో భారత వ్యతిరేక అంశాలు పెరిగాయని, ఈ నేపథ్యంలో భారత సరిహద్దుల వద్ద అధునాతన యుఎవిల మోహరింపుతో నిఘా అవసరమని సీనియర్ ఇంటలిజెన్స్ అధికారి ఒకరు తెలిపారు.