Monday, December 23, 2024

సర్దు‘పాట్లు..

- Advertisement -
- Advertisement -

ఉత్కంఠభరితమైన సాధారణ ఎన్నికల ఘట్టానికి జాతీయ ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ సమాయత్తమవుతున్నది. దశాబ్దం క్రితం వరకు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీని కూడా కలుపుకొని వెళుతున్న ‘ఇండియా’ అంతర్గత వైరుధ్యాలను పరిష్కరించుకొని నిలదొక్కుకోడం అనుకొన్నంత సులభం కాదు. బెంగాల్‌లో సీట్ల సర్దుబాటు విషయంలో తృణమూల్ కాంగ్రెస్‌తో కాంగ్రెస్‌కు తలెత్తిన పేచీ ఏ విధంగా కొలిక్కి వస్తుందనేది ఆసక్తిదాయకమైన అంశం.ఈ రాష్ట్రంలో గల 42 లోక్‌సభ స్థానాల్లో కేవలం రెండింటిని మాత్రమే కాంగ్రెస్‌కు వదిలిపెడతానని తృణమూల్ కాంగ్రెస్ స్పష్టం చేసింది. సర్దుబాటుపై కాంగ్రెస్ నియమించిన అయిదుగురు పార్టీ సీనియర్ సభ్యుల జాతీయ కూటమి కమిటీని తాను కలిసే ప్రసక్తి లేదని తెగేసి చెప్పింది. నువ్వు ఇచ్చే రెండు స్థానాలు అంగీకరించబోమని రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ నాయకులు దానికి స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల (చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరం) ఎన్నికల్లో ఈ వరుసలోని మొదటి మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు ఎదురైన ఊహించని ఓటమి సీట్ల వాటాల బేరసారాల్లో దాని సామర్ధ్యాన్ని దెబ్బ తీసింది.

ఉత్తరాదిలో కాంగ్రెస్ శక్తి సన్నగిల్లి పోయింది. అయితే చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో పోటీ ప్రధానంగా బిజెపి, కాంగ్రెస్‌ల మధ్యనే వుంటుంది. కాబట్టి అక్కడ సీట్ల విషయంలో దాని బేరశక్తిని హరించడం ఇతర ప్రతిపక్షాలకు సులభతరం కాబోదు. మొన్నటి ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రాలను కాంగ్రెస్ గెలుచుకొని వుంటే దానికి పట్టపగ్గాలు వుండేవి కావు. కూటమిలోని ఇతర భాగస్వామ్య పక్షాల మాటకు విలువ ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీ, ఆర్‌జెడిలు ఇప్పటికే కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నాయి. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమతో మాట్లాడకుండా కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను కమల్‌నాథ్ ఏకపక్షంగా ప్రకటించారని సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ నిశితంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల సీట్ల సర్దుబాటులో యుపిలో తమ ప్రతాపం చూపిస్తామని ఆయన హెచ్చరించి వున్నారు. గత డిసెంబర్ 3న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో కాంగ్రెస్ ఓటమి ప్రస్తావన వచ్చింది.

తమలో మరింత సమన్వయం అవసరమనే అభిప్రాయంతో బాటు లోక్‌సభ ఎన్నికలకు తొందరలోనే సీట్ల సర్దుబాటు జరగాలనే సంకల్పం గట్టిగా వ్యక్తమైంది. ఉమ్మడి అభ్యర్థుల నిర్ణయం త్వరగా జరిగితే ప్రచారం తొందరగా చేపట్టవచ్చని అనుకొన్నారు. ఈ సమావేశానికి సమాజ్‌వాది పార్టీ గైర్హాజరైనప్పటికీ తాము ‘ఇండియా’ కూటమిలోనే కొనసాగుతామని అది ప్రకటించింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే ఇతర భాగస్వామ్య పక్షాలు ఎక్కువ ఓట్లు పొందిన స్థానాలను అవి కోరుకోడం సబబుగా ఉంటుందని, కాంగ్రెస్ ఆధిక్యంలో వున్న సీట్లను అవి ఆశించడం సబబు కాదనే వాదన త్రోసిపుచ్చలేనిది. కూటమిలో అతిపెద్ద పార్టీయే కాకుండా దేశమంతటా ఉనికి వున్న పార్టీ కాంగ్రెస్. అయితే పశ్చిమబెంగాల్, కేరళ, పంజాబ్, ఢిల్లీలలో భాగస్వామ్య పక్షాలనుంచి అది తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నది. ఈ నాలుగు చోట్ల దానికి బలం లేదు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ 300 స్థానాల్లో పోటీ చేయాలని, యుపిని అఖిలేశ్ యాదవ్‌కి, ఢిల్లీ, పంజాబ్‌లను ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కి, బెంగాల్‌ను మమతా బెనర్జీకి వదిలివేయాలని తృణమూల్ కాంగ్రెస్ సూచించినట్టు సమాచారం.

కాంగ్రెస్‌ను మరీ లోకువ చేయడం సబబు కాదు గాని అంతిమంగా బిజెపిని మట్టి గరిపించే లక్ష్యసాధన కోసం అలవికాని చోట తగ్గి తనకు బలము, పట్టు ఉన్న స్థానాలపై అది దృష్టి కేంద్రీకరించడం మంచి పద్ధతే అవుతుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్‌జెడి నుంచి కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు పొంది తక్కువ సీట్లు గెలుచుకోడం వల్ల కూటమికి నష్టం కలిగిందనే అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైన సంగతి తెలిసిందే. బిజెపి మరోసారి నరేంద్ర మోడీని చూపించి ప్రయోజనం పొందాలని చూస్తున్నందున ‘ఇండియా’ కూటమి కూడా దీటైన నేతను తమ తరపున ప్రధాని అభ్యర్థిగా ప్రచారంలో పెట్టవలసి వుంటుంది. కాంగ్రెస్ ఇప్పటికే రాహుల్ గాంధీని ఇందుకు ముస్తాబు చేసి వుంచింది. ఆయన కూడా తరచూ మోడీని విమర్శిస్తూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు. కూటమిలోని ఇతర పార్టీలు రాహుల్ అభ్యర్థిత్వాన్ని సులభంగా ఒప్పుకోకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ప్రధాని అభ్యర్థిని చేయాలని మమతా బెనర్జీ, కేజ్రీవాల్ ప్రతిపాదించారు. ఇది కాంగ్రెస్‌కు నచ్చే వ్యవహారం కాదు.

తానే ఇందుకు సరైనవాడినని నితీశ్ కుమార్ భావిస్తారు. సందర్భం వస్తే మమతా బెనర్జీ సైతం ఈ విషయంలో వెనుకాడరు. వీటన్నిటి కంటే ముందుగా దుర్భేద్యమైన ఐక్యతను సాధించుకొని దేశ ప్రజల్లో తన పట్ల విశ్వసనీయతను పెంచుకోడం ‘ఇండియా’ కూటమిపై గల బాధ్యత. సీట్ల సర్దుబాటు ఘట్టాన్ని వీలైనంత ఫలవంతంగా, తొందరగా పూర్తి చేసుకోడం ద్వారా ఈ కూటమి ముందుకు సాగవలసి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News